డీ-డాలరైజేషన్‌కు ప్రయత్నిస్తే చర్యలు తప్పవు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్(యూఎస్ డాలర్ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓవల్ కార్యాలయంలో జరిగిన అధ్యక్ష పత్రాలపై సంతకాల కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యంలో యూఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించే ఏ బ్రిక్స్ దేశంపైనైనా 100 శాతం సుంకాన్ని విధిస్తామని హెచ్చరించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక వాణిజ్యాల్లో స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచాలని యోచిస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ దేశాలు అనుసరిస్తున్న విధానాలను ట్రంప్ అమెరికా ఆర్థిక పరపతికి ప్రత్యక్ష సవాలుగా భావిస్తున్నారు. అందుకే ఆయన అమెరికాతో వాణిజ్యం చేసే బ్రిక్స్ దేశాలపై భవిష్యత్తులో 100 సుంకాలు విధిస్తామని స్పష్టం చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది హెచ్చరిక కాదు.. స్పష్టత
ట్రంప్ ఈమేరకు చేసిన ప్రకటలో తన హెచ్చరికను ముప్పుగా చూడరాదని తెలిపారు. ఈ అంశంపై స్పష్టమైన వైఖరిగా మాత్రమే చూడాలని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ డీ-డాలరైజేషన్ విషయంలో అమెరికా బలహీనమైన స్థితిలో ఉందని బైడెన్ సూచించినట్లు చెప్పారు. అయితే బ్రిక్స్ దేశాలతో అమెరికా వాణిజ్యం గణీనీయంగా ఉందని, వారు తమ ప్రణాళికలను(డీ-డాలరైజేషన్‌కు సంబంధించి) ముందుకు సాగలేరని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూ
ఆర్థిక స్థిరత్వానికి విఘాతం
ట్రంప్ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి దూకుడు సుంకాల విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి విఘాతం కలిగిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. మరోవైపు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ట్రంప్ దృఢమైన వైఖరి అవసరమని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment