నిరంతర వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటు సమర్థంగా నిర్వహించడానికి ఐటీ రంగం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఐటీ ఎగుమతులు మందగిస్తే దేశ ఫారెక్స్ నిల్వలు తరిగి అది రూపాయి విలువపై ప్రభావం చూపనుంది. ఐటీ రంగం పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఆదాయాన్ని తీసుకురావడమే కాదు.. ఇతర ఎగుమతి ఆధారిత రంగాలతో పోలిస్తే ఇందులో ఫారెక్స్ వ్యయాలు కూడా తక్కువ. ఐటీ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఎగుమతి ఆదాయంలో సగం కంటే తక్కువ ఉంటుందని అంచనా. మరోవైపు కార్పొరేట్ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఫారెక్స్ ఆదాయాలను మించిపోతాయి.
ఇటీవల స్టాక్‌మార్కెట్లు బాగా పుంజుకోవడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా భారత్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్‌పావెల్ కీలక వడ్డీరేట్లపై ఇటీవల చేసిన ప్రకటన మార్కెట్‌లకు దన్నుగా నిలుస్తోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎప్పటినుంచో అనిశ్చితి కొనసాగుతున్న ఐటీ స్టాక్‌లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా డాలర్లలోనే వ్యాపారం సాగిస్తాయి. దాంతో భారత్‌లోని టాప్ కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు అధికంగా పెట్టుబడి పెట్టడంతో దేశంలోని ఫారెక్స్ నిలువలు పెరిగినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీ కంటే ముందు వారానికి 9.11 బిలియన్ డాలర్లు(రూ.75 వేలకోట్లు) పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు(రూ.51.2 లక్షల కోట్లు) ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ కంటే ముందు వారానికి ఫారెక్స్ నిల్వలు 2.82 బిలియన్ డాలర్లు(రూ.23 వేలకోట్లు) పుంజుకుని 606.86 బిలియన్ డాలర్లకు(రూ.50.5 లక్షల కోట్లు) చేరుకున్నాయి.
విదేశీ కరెన్సీ నిల్వలు 8.35 బిలియన్ డాలర్లు(రూ.68 వేలకోట్లు) పెరిగి 545.05 బిలియన్ డాలర్ల(రూ.45 లక్షల కోట్లు) వద్దకు చేరాయి. బంగారం నిల్వలు 446 మిలియన్ డాలర్ల(రూ.3700 కోట్లు) పెరుగుదలతో 47.58 బిలియన్ డాలర్లు(రూ.4 లక్షల కోట్లు), స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 135 మిలియన్ డాలర్ల(రూ.1100 కోట్లు) నుంచి 18.32 బిలియన్ డాలర్లకు(రూ.1.5 లక్షల కోట్లు) పుంజుకున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..
ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 181 మిలియన్ డాలర్లు పెరిగి 5.02 బిలియన్ డాలర్లకు(రూ.41 వేల కోట్లు) చేరాయి. 2021 అక్టోబర్‌లో భారత ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ల డాలర్ల(రూ.53 లక్షల కోట్లు) ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నపుడు ఆర్‌బీఐ బహిరంగ మార్కెట్‌లో డాలర్లను విక్రయిస్తూ రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆదుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment