
ఆర్‌బీఐ అధ్యయనంలో వెల్లడి
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవడమనేది .. విదేశీ పెట్టుబడుల రాకపోకల వల్ల కరెన్సీ మారకంపరంగా తలెత్తే ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు గణనీయంగా తోడ్పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా బులెటిన్‌లోని అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మారకం రేటు తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు కూడా కారణమని ఇందులో పేర్కొన్నారు.
2008–09లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభ సమయంలో, 2013లో ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ వార్తలు వచ్చినప్పుడు, 2018లో ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం తలెత్తినప్పుడు, ఆ తర్వాత కోవిడ్–19 మహమ్మారి సమయంలో రూపాయి ఒడిదుడుకులకు గురైనట్లు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్‌బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ మైఖేల్ పాత్రా సారథ్యంలోని బృందం దీన్ని రూపొందించింది. జనవరి 10తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు 8.714 బిలియన్ డాలర్లు తగ్గి 625.871 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.