15 నెలల కనిష్టానికి సెన్సెక్స్
వదలని చైనా భయాలు
- 25 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
- 308 పాయింట్ల నష్టంతో 24,894 వద్ద ముగింపు
- 7,600 పాయింట్ల కిందకు నిఫ్టీ
- 96 పాయింట్ల నష్టంతో 7,559 పాయింట్లకు డౌన్!
చైనా ఆందోళనలకు వర్షాభావ భయాలు, రూపాయి పతనం తోడవడంతో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 25,000 మార్క్ దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,600 మార్క్ దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు (1.22 శాతం)నష్టపోయి 24,894 పాయింట్ల వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు (1.26 శాతం)నష్టపోయి 7,559 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 15 నెలల కనిష్ట స్థాయి. నిఫ్టీకి 13 నెలల కనిష్ట స్థాయి. ఫార్మా, లోహ, బ్యాంక్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టాలపాలయ్యాయి. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.
‘మోదీ’ లాభాలన్నీ మాయం
సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. జీడీపీ వృద్ధి అంచనాలను చైనా తగ్గించడం, చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 9,390 కోట్ల డాలర్లు హరించుకుపోవడం వంటి అంశాల కారణంగా షాంఘై స్టాక్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌పై పడింది. డాలర్‌తో రూపాయి మారకం తాజా రెండేళ్ల కనిష్ట స్థాయికి(37 పైసలు నష్టపోయి 66.83కు) పడిపోవడం సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది.
వర్షపాత అంచనాలు బలహీనంగా ఉండడం, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, పెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అంశంపై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులంటున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి (ఈ ఏడాది మే) నుంచి సెన్సెక్స్ సాధించిన లాభాలన్నీ దాదాపు హరించుకుపోయాయి.కాగా 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టపోయాయి. కాల్ డ్రాప్స్‌కు టెలికం ఆపరేటర్లు నష్టపరిహారం చెల్లించాలన్న ట్రాయ్ ప్రతిపాదన నేపథ్యంలో టెలికం షేర్లు పతనమయ్యాయి.
ఈ మూడు నెలలు ఒడిదుడుకులే: బీఓఎఫ్‌ఏ-ఎంల్
సెప్టెంబర్-నవంబర్ కాలానికి దేశీయ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తాజా నివేదిక పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అంశం, కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, బీహార్ ఎన్నికలు, దేశంలో ఆర్థిక సంస్కరణలు వంటి కారణాల వల్ల ఈ ఒడిదుడుకులు ఉంటాయని వివరించింది.