రూపాయి.. రన్!
మూడు నెలల గరిష్ట స్థాయి
• డాలర్ మారకంలో 66.85 పైసలు
• అంతర్జాతీయ ట్రేడింగ్‌లో మరింత లాభం
• నేడు మరింత బలపడే అవకాశం
• డాలర్ బలహీనత, ఈక్విటీ మార్కెట్ల దన్ను!
• తాత్కాలికమేనంటున్న నిపుణులు
ముంబై: అనూహ్య రీతిలో డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 ట్రేడింగ్ సెషన్ల నుంచి పరుగులు పెడుతోంది. ఈ సమయంలో డాలర్ మారకంలో దాదాపు 1.75 పైసలు బలపడింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫారెక్స్ మార్కెట్‌లో మూడు నెలల గరిష్ట స్థాయి 66.85 వద్ద ముగిసింది. భారత్ రూపాయి నవంబర్ 10 తరువాత ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి.
ఇంట్రాబ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో బుధవారం రూపాయి ముగింపు 67.19 పైసలు. క్రితం ముగింపుతో పోల్చితే రూపాయి దాదాపు 34 పైసలు (0.51%) లాభపడింది. కాగా భారత్‌లో ఫారెక్స్ ట్రేడింగ్ ముగిసిన తరువాత, అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం రూపాయి భారీగా బలపడింది. తుది సమాచారం అందే సరికి మరో 20 పైసలు లాభపడి 66.65 సమీపంలో ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్రవారం సైతం రూపాయి జోరును కొనసాగించే అవకాశం ఉంది.
ఈ పరుగు ఎందుకు...
⇔ అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేనాటికి దాదాపు 14 సంవత్సరాల గరిష్ట స్థాయిలో 104 డాలర్లకు చేరింది. అయితే డాలర్ బలహీనపడాలన్న అమెరికా అధ్యక్షుని విధానానికి తోడు, అధిక స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడ్ అయ్యే డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 101 డాలర్ల దిగువ స్థాయిలో ట్రేడవుతోంది. ఈ ప్రభావం భారత్ కరెన్సీమీదే కాకుండా, మిగిలిన కొన్ని ఆసియా దేశాల కరెన్సీల బలోపేతానికి సైతం కారణమవుతోంది.
⇔ ఇక అమెరికా ఆర్థిక వృద్ధిపై నెలకొన్న అనుమానాలు డాలర్ బలహీనతకు దారితీస్తాయన్న అంచనాలు ఆ కరెన్సీ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు ఇప్పట్లో పెంచబోదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
⇔ భారత్‌లో బుధవారం పాలసీ సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటు తగ్గిస్తే– రూపాయికి బ్రేక్‌లు పడతాయని భావించారు. అయితే ఇదీ జరగలేదు. రెపో రేటును 6.25 స్థాయిలోనే ఆర్‌బీఐ కొనసాగించింది.
⇔ డాలర్ మరింత బలహీనపడుతున్న అంచనాలతో బ్యాంకులు, ఎగుమతిదారులు సైతం ఆ కరెన్సీ భారీ అమ్మకాలకు దిగుతున్నారు. ఇది భారత్ కరెన్సీకి బలాన్ని ఇస్తోంది.
బలపడితే ఏమిటి?
రూపాయి బలపడితే ప్రధానంగా భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఎగుమతులకు తక్కువ డాలర్లు చేతికి అందుతాయి. సాఫ్ట్‌వేర్, టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువలరీ వంటి రంగాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నది నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే భారత్ ఎగుమతులు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి.
ర్యాలీ స్వల్పకాలమే!
⇔ కాగా రూపాయి పరుగు స్వల్పకాలమేనని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు చూస్తే
⇔ ఫార్వార్డ్ మార్కెట్‌లో డాలర్ ప్రీమియం స్థిరంగా కొనసాగుతోంది. కార్పొరేట్ నుంచి చెల్లింపుల ఒత్తిడి దీనికి కారణం. బెంచ్‌మార్క్ ఆరు నెలల ప్రీమియం జూలైకి సంబంధించి బుధవారం 154–156 పైసల శ్రేణి నుంచి 155.5–156.5 పైసల శ్రేణికి పెరిగింది. 2018 జనవరి ప్రీమియంసైతం 301–303 శ్రేణి నుంచి 305–306పైసలకు పెరిగింది.
⇔ ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితితో వచ్చే నెల రోజుల్లో డాలర్ బలపడే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుత 100 ఎగువ స్థాయి ఆ కరెన్సీకి బలోపేతమైన అంశమే.
⇔ 2016 సంవత్సరం మొదటి నుంచీ డాలర్ మారకంలో 66.2–68.7 శ్రేణిలో తిరుగుతున్న రూపాయి తన కదలిక బాటను మార్చుకునే అవకాశం ఉందని మరో బ్యాంకింగ్ సేవల దిగ్గజం– డీబీఎస్ నివేదిక ఒకటి అంచనావేసింది.
⇔ పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం సైతం సమీప కాలంలో భారత్ ఈక్విటీలు, రూపాయిపై ప్రతికూలత చూపుతాయని జపాన్ బ్రోకరేజ్‌సంస్థ నోమురా పేర్కొంది. ఇప్పటికిప్పుడు రూపాయి బలంగా ఉన్నా, సమీప కాలంలో కొంత బలహీనత ఖాయమని అంటోంది.