ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి.
అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్‌సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి.
► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది.
► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది.
► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది.
తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు
భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు.
– ఫిచ్ రేటింగ్స్
Comments
Please login to add a commentAdd a comment