రూపాయి.. హ్యాట్రిక్‌ | Rupee Rises For Third Day On Up 27 Paise to 74.19 Per USD | Sakshi
Sakshi News home page

రూపాయి.. హ్యాట్రిక్‌

Published Thu, Nov 19 2020 5:57 AM | Last Updated on Thu, Nov 19 2020 5:57 AM

Rupee Rises For Third Day On Up 27 Paise to 74.19 Per USD - Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో బుధవారం వరుసగా మూడవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల బాటన పయనించిం ది. మంగళవారం ముగింపుతో పోల్చితే 27 పైసలు లాభంతో 74.19 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 74.49 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.09 స్థాయి గరిష్ట, 74.52 కనిష్ట స్థాయిల్లో తిరిగింది.   

కారణాలు చూస్తే...
ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ట్రేడయ్యే– డాలర్‌ ఇండెక్స్‌ బలహీన ధోరణి, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కరోనా వ్యాక్సిన్‌ సిద్ధమైపోయిందన్న వార్తలు రూపాయికి బలం చేకూర్చుతున్నట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొంటున్నారు. విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టరు (ఎఫ్‌ఐఐ) క్యాపిటల్‌ మార్కెట్లో బుధవారం నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. రూ.3,072 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత రెండు సెషన్లలో ఎఫ్‌ఐఐలు బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారనీ, దీనితో ఈ నెల్లో వీరి పెట్టుబడుల విలువ 5.1 బిలియన్‌ డాలర్లకు చేరిందని మోతీలాల్‌ ఓశ్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ఫారెక్స్‌ అండ్‌ బులియన్‌ విశ్లేషకులు గౌరంగ్‌ తెలిపారు.  

మరింత పెరగాల్సిందే.. కానీ!:  నిజానికి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున ప్రభుత్వ రంగ బ్యాంకులు జరిపిన కొనుగోళ్లు రూపాయి బలోపేతానికి పగ్గాలు వేశాయి కానీ, లేదంటే భారత్‌ కరెన్సీ మరింత బలపడి ఉండేదని విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్‌ ఉన్నట్లు రిలయెన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ శ్రీరామ్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ). కాగా,  ఈ వార్త రాస్తున్న రాత్రి 7.41 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 92.40 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి విలువ లాభాల్లో 74.21 వద్ద ట్రేడవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement