రూపాయి అంతకంతకూ దిగజారు తోంది. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 14న డాలర్‌తో రూపాయి మారకం విలువ గరిష్టంగా 80 రూపాయలు దాటింది. ప్రస్తుతం కాస్త తగ్గి 79.96 రూపాయలకు చేరింది. ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దేశంలో పెట్టుబడులను ఉపసంహరిం చుకోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకనే ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్ల పెంపు కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ద్రవ్యోల్బణం అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు అంచనాలతో పొంతన లేకుండా ద్రవ్యో ల్బణం పెరుగుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలే దీనికి కారణమని రిజర్వ్ బ్యాంక్ అంటోంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చి 17న 6.95 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి పెరిగింది. దీనితో 2022–23 ఆర్థిక సంవ త్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న క్రితం అంచనాలను ఆర్‌బీఐ తాజాగా ఒక శాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల వేగాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు ఎక్కువ.
2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌పదకొండు వరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పీపీఏసీ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్ 10న మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. 2012లో అప్పటి ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 6,201.05 కాగా... ఎనిమిదేళ్ల పాలనలో నరేంద్ర మోదీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రూ. 9,434.29. రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేకపోవడం వల్ల ఈ రోజు మనం ప్రతీ ముడిచమురు పీపాకు పదేళ్ల నాటి కంటే అదనంగా రూ.3,233.24 చెల్లి స్తున్నాం. పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 51.13 ఉండగా మోదీ పాలనలో అది రూ. 80 దాటింది. పదేళ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ రూపాయి పతనం కారణంగా మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది.
రూపాయి పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారుతోంది. దీంతో అప్పులు కూడా కట్టలేని స్థితికి చేరుకుంటోంది. రాబోయే 9 నెలల్లో దాదాపు 621 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 40 శాతం... అంటే 267 బిలియన్ల అప్పు ఇంకా పెండింగ్ లోనే ఉందని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలే చెబుతున్నాయి. ఇది మన దగ్గరున్న విదేశీమారక నిల్వల్లో 44 శాతానికి సమానం. మరోవైపు రూపాయి పతనాన్ని అరి కట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్‌లో అమ్ముతోంది. గత డిసెంబరు 31 నాటికి 633.6 బిలియన్ డాలర్లుండగా, జూన్ 24న 593.3 బిలియన్ డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77–81 మధ్య ఉండొచ్చని అంచనా (ఇప్పుడున్న ముడిచమురు ధరలు స్థిరంగా ఉంటేనే).
రూపాయి పడితే ఇబ్బందేంటి అన్న అనుమానం సామాన్య మానవునికి రావచ్చు. అసలు సమస్య అంతా అక్కడే ఉంది. రూపాయి పడితే బడా వ్యాపారవేత్తలకంటే కూడా సాధారణ పౌరులే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇతర దేశాల నుండి కొన్న వస్తువులకు వాళ్లు డాలర్ల లెక్కలోనే బిల్లు ఇస్తారు. అప్పుడు మనం రూపాయిలను డాలర్లుగా మార్చి చెల్లించాలి. అంటే రూపాయి విలువ తరిగే కొద్దీ మనం ఎక్కువ ధనాన్ని దిగు మతులకు చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఈ లెక్కన దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. గ్యాస్, పెట్రోల్ వంటివాటి ధరలు పెరగడం వల్ల అన్ని వినియోగ వస్తువుల ధరలూ పెరుగుతాయి. రూపాయి పతనానికి ముకుతాడు వేయకుంటే... ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితులు అతి త్వరలోనే భారత్‌లో కనిపించే ప్రమాదముందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- వై. సతీష్ రెడ్డి
చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment