
ముంబై: కోవిడ్–19 కొత్త వేరియంట్ల భయాలు శుక్రవారం రూపాయిని బలహీనపరచాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 37పైసలు బలహీనపడి 74.89 వద్ద ముగిసింది. రూపాయికి ఇది నెల కనిష్ట స్థాయి. గురువారం రూపాయి ముగింపు 74.52. ట్రేడింగ్‌లో రూపాయి విలువ 74.60 వద్ద ప్రారంభమయ్యింది. 74.58 కనిష్ట–74.92 గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. కరోనా వైరస్ భయాలతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల భారీగా నిధులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ బలోపేతం అవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.89 ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ).
క్రూడ్ ధర పతనం...
ఇక వైరస్ వేరియంట్ల భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరోసారి సవాళ్లు విసిరే అవకాశం ఉందన్న అంచనాలు క్రూడ్‌పై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర శుక్రవారం 10 శాతం పైగా పతనమై, 70 డాలర్ల లోపు ట్రేడవుతోంది. బ్రెంట్ విషయంలో ఈ ధర 74కు పడిపోయింది.
బంగారం అప్...
సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్ తక్షణం బంగారం ధరపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వార్త రాస్తున్న సమయంలో ఔన్స్ (31.1గ్రా) ధర 25 డాలర్ల వరకూ పెరిగి, 1,810 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధర 10 గ్రాములకు రూ.500 లాభంతో 47,900 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment