Merrill Lynch
-
ఆర్బీఐ నుంచి రూ లక్ష కోట్లు రానున్నాయ్..
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ మిగులు నిల్వల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ లక్ష కోట్లు బదలాయించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ బోర్డు భేటీలో ఈ దిశగా కసరత్తు సాగిందని, ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌పై కమిటీని ఏర్పాటు చేసిందని మెరిల్ లించ్ వెల్లడించిన నోట్ పేర్కొంది. ఈ కమిటీ ఆర్బీఐలో రూ లక్ష నుంచి రూ మూడు లక్షల కోట్ల మిగులు నిల్వలను గుర్తించి తదనుగుణంగా కేంద్రానికి బదలాయించే మొత్తాన్ని నిర్ణయిస్తుందని తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో అదనపు నగదు కోసం వేచిచూస్తున్న ప్రభుత్వం ఆర్బీఐ మిగులు నిధులపై కన్నేసిందని గత కొంత కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఆరునెలల్లో ప్రభుత్వానికి ఆర్బీఐ నిధుల అవసరమేమీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నా ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. జీఎస్టీ వసూళ్లు తగ్గడం, రుణాలు, ఇతర వనరుల ద్వారా నగదు సమీకరణ అవకాశాలు తగ్గడంతో ఆర్బీఐ మిగులు నిల్వలపై కేంద్రం భారీ ఆశలే పెట్టుకుందని భావిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ నగదు నిల్వలను బదలాయించడం ద్వారా తిరిగి ఆర్బీఐకి ప్రభుత్వం బాండ్లు జారీ చేస్తుందని ఫలితంగా ద్రవ్య లోటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఎయిర్‌టెల్‌లో వాటాలు అమ్మేసిన మెరిల్ లించ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో మెరిల్లించ్ తనకున్న వాటాల్లో సింహ భాగాన్ని విక్రయించేసింది. ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌కు డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి 5.09 కోట్ల షేర్లుండగా, వీటిలో 3.87 కోట్ల షేర్లను మంగళవారం సగటున ఒక్కో షేరును రూ.499.1 చొప్పున విక్రయించింది. ఇది 0.97 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను ఎస్ఆర్ఎస్ పార్ట్నర్స్ (కేమాన్) ఎల్ఎల్సీ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1,931.23 కోట్లు. బీఎస్ఈలో ఎయిర్టెల్ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.43 శాతం నష్టంతో రూ.496.90 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గుతాయా?
ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రకటించనున్న పాలసీ రివ్యూలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై ఆర్థికవర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9వ తేదీన జరగనున్న రిజర్వుబ్యాంకు ద్వైమాసిక పరపతి సమీక్షా సమావేశాల్లో రెపో రేటు ను 0. 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తెలిపింది. కీలక వడ్డీరేట్లను 25 పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తాజా నివేదికలో వెల్లడించింది. అటు వేసవి రబీపంట దెబ్బతినడం వల్ల పప్పుల ద్రవ్యోల్బణం 27 శాతం పెరిగిందని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం వర్షాలు సాధారణం కంటే అధికంగా ఉంటాయన్న అంచనాతో ఖరీఫ్ సీజన్లో పంటలు 39 శాతం అధికంగా వేసారని పేర్కొంది. దీంతో మార్చి చివరికి పప్పుల ధరలు 20 శాతం వరకు తగ్గముఖం పట్టనున్నాయని పరిశోధన తేల్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల ను 5.7నుంచి 5.1 శాతానికి కుదించుకున్న సంస్థ ఇవి దిగిరావచ్చునని బీఓఎఫ్ఏ -ఎంఎల్ తన పరిశోధనా పత్రంలో వెల్లడించింది. ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని మెరిల్ లించ్ పేర్కొంది. ఒకటి.. రుతుపవనాలు అనుకూలంగా ఉంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవొచ్చు. రెండవది. జూన్‌లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం కాస్తా అదుపులోకి వచ్చింది. మూడోది వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో మే నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు పేలవంగా నమోదయ్యాయని.. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ వచ్చే నెలలో 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. కాగా జూన్‌లో జరగిన పరపతి సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించారు. దీనికి ఆయన చెబుతున్న కారణాలు ద్రవ్యోల్బణం ఒత్తిడి ఎక్కువగా ఉందని.. ఒక వేళ రుతుపవనాలు అనుకూలంగా ఉంటే వడ్డీరేట్లు తగ్గిస్తామని చెప్పారు. మరోవైపు జూన్ మాసపు టోకు ధరల సూచీ 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. మరి ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.. -
రూపాయి క్షీణతకు అడ్డుకట్టకు చర్యలు!
న్యూఢిల్లీ: అడ్డూఅదుపూలేకుండా జారిపోతున్న రూపాయికి మద్దతుగా ప్రభుత్వం నేడు(సోమవారం) మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి చిదంబరం ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావుతో విస్తృత చర్చలు జరిపారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారామ్ కూడా సీనియర్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రూపాయి స్థిరీకరణకు కీలక చర్యలు వెలువడతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా విదేశీ నిధులను మరింత ఆకర్షించడమే ఈ చర్యల ప్రధానోద్దేశం. కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ(ఈసీబీ) నిబంధనలను సడలించడం, నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులపై సుంకం పెంపు, ఎగుమతులకు ప్రోత్సాహం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు. గత వారంలో డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.80) తాకిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 15 శాతం పైగానే క్షీణించింది.దేశీ కరెన్సీ చికిత్సకు ఆర్బీఐ ఇప్పటికే ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) కట్టడి, స్పెక్యులేషన్‌ను తగ్గించేవిధంగా చర్యలు తీసుకున్నప్పటికీ... రూపాయి పతనం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రతి సోమవారం రూ.22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్ల వేలం చేపట్టనున్నట్లు కూడా ఆర్బీఐ తాజాగా ప్రకటించడం గమనార్హం. కాగా, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లు సార్వభౌమ బాండ్ల తరహా(క్వాసీ-సావరీన్) రుణపత్రాల జారీ ద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు కూడా కేంద్రం అనుమతించే అవకాశాలున్నాయని సమాచారం. క్యాడ్ కట్టడే లక్ష్యం...: కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం)ను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీతో పోలిస్తే 4.8%) ఎగబాకడం తెలిసిందే. క్యాడ్‌కు అడ్డుకట్టవేయడానికి వీలుగా నిత్యావసరంకాని వస్తువుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని మంత్రుల కమిటీ ఇప్పటికే ఆర్థిక మంత్రికి సిఫార్సుల నివేదికను సమర్పించింది. కేంద్రం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. బొగ్గు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ దిగుమతులపై దృష్టిపెట్టినట్లు చిదంబరం ఇదివరకే చెప్పారు.