ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రకటించనున్న పాలసీ రివ్యూలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై ఆర్థికవర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9వ తేదీన జరగనున్న రిజర్వుబ్యాంకు ద్వైమాసిక పరపతి సమీక్షా సమావేశాల్లో రెపో రేటు ను 0. 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తెలిపింది. కీలక వడ్డీరేట్లను 25 పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తాజా నివేదికలో వెల్లడించింది.
అటు వేసవి రబీపంట దెబ్బతినడం వల్ల పప్పుల ద్రవ్యోల్బణం 27 శాతం పెరిగిందని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం వర్షాలు సాధారణం కంటే అధికంగా ఉంటాయన్న అంచనాతో ఖరీఫ్ సీజన్‌లో పంటలు 39 శాతం అధికంగా వేసారని పేర్కొంది. దీంతో మార్చి చివరికి పప్పుల ధరలు 20 శాతం వరకు తగ్గముఖం పట్టనున్నాయని పరిశోధన తేల్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల ను 5.7నుంచి 5.1 శాతానికి కుదించుకున్న సంస్థ ఇవి దిగిరావచ్చునని బీఓఎఫ్‌ఏ -ఎంఎల్ తన పరిశోధనా పత్రంలో వెల్లడించింది.
ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని మెరిల్ లించ్ పేర్కొంది. ఒకటి.. రుతుపవనాలు అనుకూలంగా ఉంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవొచ్చు. రెండవది. జూన్‌లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం కాస్తా అదుపులోకి వచ్చింది. మూడోది వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో మే నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు పేలవంగా నమోదయ్యాయని.. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ వచ్చే నెలలో 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
కాగా జూన్‌లో జరగిన పరపతి సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించారు. దీనికి ఆయన చెబుతున్న కారణాలు ద్రవ్యోల్బణం ఒత్తిడి ఎక్కువగా ఉందని.. ఒక వేళ రుతుపవనాలు అనుకూలంగా ఉంటే వడ్డీరేట్లు తగ్గిస్తామని చెప్పారు. మరోవైపు జూన్ మాసపు టోకు ధరల సూచీ 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. మరి ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గుతాయా?
Published Fri, Jul 22 2016 1:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
Advertisement
Advertisement