
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ మిగులు నిల్వల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ లక్ష కోట్లు బదలాయించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ బోర్డు భేటీలో ఈ దిశగా కసరత్తు సాగిందని, ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌పై కమిటీని ఏర్పాటు చేసిందని మెరిల్ లించ్ వెల్లడించిన నోట్ పేర్కొంది. ఈ కమిటీ ఆర్బీఐలో రూ లక్ష నుంచి రూ మూడు లక్షల కోట్ల మిగులు నిల్వలను గుర్తించి తదనుగుణంగా కేంద్రానికి బదలాయించే మొత్తాన్ని నిర్ణయిస్తుందని తెలిపింది.
ఎన్నికల నేపథ్యంలో అదనపు నగదు కోసం వేచిచూస్తున్న ప్రభుత్వం ఆర్బీఐ మిగులు నిధులపై కన్నేసిందని గత కొంత కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఆరునెలల్లో ప్రభుత్వానికి ఆర్బీఐ నిధుల అవసరమేమీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నా ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.
జీఎస్టీ వసూళ్లు తగ్గడం, రుణాలు, ఇతర వనరుల ద్వారా నగదు సమీకరణ అవకాశాలు తగ్గడంతో ఆర్బీఐ మిగులు నిల్వలపై కేంద్రం భారీ ఆశలే పెట్టుకుందని భావిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ నగదు నిల్వలను బదలాయించడం ద్వారా తిరిగి ఆర్బీఐకి ప్రభుత్వం బాండ్లు జారీ చేస్తుందని ఫలితంగా ద్రవ్య లోటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.