
విదేశీ మారక నిల్వలు.. రికార్డ్
న్యూఢిల్లీ: మరోవైపు దేశీయ విదేశీ మారకద్రవ్య నిల్వలు కొత్త రికార్డులకు చేరాయి. సెప్టెంబర్ 8వ తేదీతో ముగిసిన వారంలో 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం వారంతో పోల్చితే ఈ మొత్తం 2.604 బిలియన్ డాలర్లకు చేరింది. డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ అసెట్స్ ఈ కాలంలో భారీగా 2.56 బిలియన్ డాలర్లు పెరిగి 376.20 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ యథాపూర్వం 20.69 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో భారీగా 11.4 బిలియన్ డాలర్లు దేశానికి వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో దేశానికి వచ్చిన విదేశీ మారక నిల్వలు 7 బిలియన్ డాలర్లుకాగా, 2016–17 చివరి త్రైమాసికంలో ఈ మొత్తం 7.3 బిలియన్ డాలర్లు మాత్రమే.
భారత్ రుణ భారం 472 బిలియన్ డాలర్లు
భారత్ విదేశీ రుణ భారం ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 472 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన 13.1 బిలియన్ డాలర్లు (2.7 శాతం) తగ్గాయి. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు, వాణిజ్య రుణాలు తగ్గడం దీనికి కారణం. విదేశీ రుణ భారం నిర్వహణా స్థాయిలోనే ఉందని ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది.