విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు | Kishan Reddy Answer To Vijayasai Reddy Question In Rajya Sabha | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

Published Thu, Apr 6 2023 6:20 PM | Last Updated on Thu, Apr 6 2023 6:51 PM

Kishan Reddy Answer To Vijayasai Reddy Question In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2021 ఆర్థిక సంవత్సరంలో పర్యాటకుల ద్వారా 65 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు చెప్పారు. 2019లో కోవిడ్‌ ప్రబలడానికి ముందు కోటి మంది విదేశీ పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో అందించిన తాజా సమాచారం ప్రకారం 2022లో దేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 60 లక్షలు ఉన్నట్లు మంత్రి వివరించారు.

కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత విదేశీ పర్యాటకం గణనీయంగా పుంజుకుంటోందని మంత్రి వెల్లడించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ మంత్రిత్వ శాఖ స్వదేశ్‌ దర్శన్‌, ప్రసాద్‌ వంటి వినూత్న పథకాలతోపాటు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. విదేశీ పర్యాటకులకు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ 12 విదేశీ భాషల్లో టూరిస్టు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది

166 దేశాలకు సంబంధించిన పర్యాటకులకు అయిదు సబ్‌ కేటగిరీల్లో ఈ వీసా మంజురు చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 1000 నుంచి 7500 రూపాయలు ఉండే హోటల్‌ గది అద్దెలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించి పర్యాటక ప్రాంతాల్లో వసతి సౌకర్యాల కల్పనకు పోటీని పెంచేందుకు దోహదం చేసినట్లు మంత్రి చెప్పారు. పర్యాటక మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 59 టూరిజం రూట్లను వివిధ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో 55 ప్రాంతాల్లో జి 20 సమావేశాలు జరుగుతున్నాయి. పర్యాటకుల కోసం ఈ ప్రదేశాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. జి-20 ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఏపీలో 79 లక్షల మంది కార్మికులకు ఉచిత ప్రమాద బీమా
కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్ లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి  రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం మరో ఏడాదిపాటు పొడిగించే యోచన ఉందా? అన్న మరో ప్రశ్నకు జవాబిస్తూ ఇన్సూరెన్స్ కవరేజ్ పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని, పోర్టల్‌లో నమోదు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి సంవత్సరం మాత్రమే ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో పాటు స్పెషల్ డ్రైవ్‌లు, క్యాంపులు నిర్వహించి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ-శ్రమ్ పోర్టల్ ప్రమోషన్ కోసం నిధులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement