Russia Ukraine War: ‘రష్యా తీరుపై భారత వైఖరితో మేం తీవ్ర అసంతృప్తికి లోనయ్యాం’ – భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఇటీవల వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఉక్రెయిన్ వివాదంపై భారత స్పందనపై అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాలకు ఇది అద్దం పడుతోంది. రష్యా దాడిని చాలా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నా భారత్ మాత్రం ‘సంయమనం, చర్చలు’ అంటూ మధ్యేమార్గంగా స్పందిస్తూ వస్తోంది. దీని వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని ఢీ అంటే ఢీ అంటున్న రష్యా, అమెరికా రెండూ భారత్‌కు బాగా కావాల్సిన దేశాలే అవడం వాటిలో ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఉదంతంపై స్పష్టంగా ఏ వైఖరి తీసుకున్నా అగ్ర రాజ్యాల్లో ఏదో ఒకదానికి దూరం కావాల్సి రావచ్చు. ఆ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడేందుకే ఆచితూచి స్పందించడానికే భారత్ ప్రాధాన్యమిస్తోంది...
రష్యా.. చిరకాల మిత్రుడు
చారిత్రకంగా భారత్‌కు రష్యా దీర్ఘకాలిక మిత్రదేశం. అంతేగాక అతి పెద్ద ఆయుధ సరఫరాదారు కూడా. ఉక్రెయిన్ ఉదంతంలో మన వైఖరిని ఈ అంశం బాగానే ప్రభావితం చేస్తోంది. మిలటరీ హార్డ్‌వేర్, టెక్నాలజీ తదితరాలపై కూడా చాలావరకు రష్యా మీదే భారత్ ఆధారపడింది. ఒకరకంగా భారత ఆయుధ పరికరాల్లో సగానికి పైగా రష్యావే. ఇటీవలే ఏకంగా రూ.35,000 కోట్ల విలువైన ఎస్–400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి సమకూర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరున్న ఎస్–400 డీల్‌ను అమెరికా అభ్యంతరాలను తోసిరాజని మరీ ఓకే చేసుకుంది. దాంతోపాటు 6.1 లక్షల అత్యాధునిక ఏకే–203 అసాల్ట్ రైఫిళ్ల తయారీ ఒప్పందం కూడా ఇరు దేశాల మధ్య కుదిరింది. దీని విలువ రూ.5 వేల కోట్ల పైచిలుకే. గత డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రష్యాతో కలిసి యూపీలోని అమేథీ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తారు.
చదవండి: (అమెరికాకు రష్యా స్పేస్ ఏజెన్సీ అధిపతి హెచ్చరికలు)
రష్యాకు చేరువవుతున్న చైనా
ఇటీవలి కాలంలో రష్యాకు చైనా, పాకిస్తాన్ దగ్గరవుతున్న తీరు కూడా భారత్‌ను ఆందోళన పరుస్తోంది. ముఖ్యంగా చైనా అయితే ఉక్రెయిన్ వివాదంలో రష్యాకు బాహాటంగానే మద్దతిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ గనక రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంటే చైనాతో ఆ దేశం బంధం ఇంకా గట్టిపడే ప్రమాదముంది. ఇది దేశ భద్రతకు సవాలు కాగలదన్నది భారత్ ఆలోచన. ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తున్న చైనా, మనకు అతి పెద్ద మిత్రుడైన రష్యానూ తనవైపు తిప్పుకుంటే మనపైకి మరింతగా పేట్రేగుతుందన్న ఆందోళనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యాను బాహాటంగా తప్పుబట్టడం తెలివైన పని కాదన్నది మన వ్యూహకర్తల వాదన.
విదేశీ మారక ద్రవ్యానికి ఆయువు పట్టు
►అమెరికాతో భారీగా భారత వాణిజ్యం
►ఐటీ ఎగుమతుల్లో అధిక భాగం అమెరికాకే
►ఐటీ అడ్డా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా
►మన విదేశీ మారక ద్రవ్యంలో ఎక్కువగా అమెరికా నుంచే
కీలక దశలో యూఎస్‌తో బంధం
అమెరికాతో కూడా భారత్‌కు బలమైన బంధమే ఉంది. పైగా గత పది పదిహేనేళ్లుగా అది క్రమంగా పెరుగుతూ వస్తోంది. యూఎస్‌తో మనం పలు ఆయుధ సరఫరా ఒప్పందాలు కూడా చేసుకున్నాం. దాంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యం కూడా భారీ పరిమాణంలో జరుగుతూ వస్తోంది. అమెరికాలోని భారతీయుల సంఖ్య 50 లక్షల పైచిలుకే. వీరిలో భారత టెకీల సంఖ్య చాలా ఎక్కువ. అమెరికా వ్యవహారాల్లో మనవారి పాత్ర, సిలికాన్ వ్యాలీపై భారత టెకీల ప్రభావం కూడా చాలా ఎక్కువ. అమెరికా నుంచి ఏటా మనకు భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంటుంది.
అంతేగాక ఏటా యూఎస్ విడుదల చేసే హెచ్1బీ వీసాల్లో చాలావరకు మనవాళ్లకే దక్కుతుంటాయి. మన ఐటీ ఎగుమతుల్లో సింహభాగం వెళ్లేది అమెరికాకే. పైగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కలిసి క్వాడ్ పేరుతో భారత్ కూటమి కూడా ఏర్పాటు చేసింది. చైనాకు రష్యా దగ్గరవుతున్న దృష్ట్యా అమెరికాతో సాన్నిహిత్యం వ్యూహాత్మకంగా మనకు ఎప్పుడూ కీలకమే. ఈ నేపథ్యంలో రష్యాకు పూర్తి అనుకూల వైఖరి తీసుకుని అమెరికాను నొప్పించరాదన్నది కేంద్రం వైఖరిగా కన్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment