ఒక్కసారిగా ప్రపంచాన్ని ‘అణు’ భయాలు ఆవరించాయి. చిన్నపాటి యుద్ధంగా మొదలైన ఉక్రెయిన్ సంక్షోభం చివరకు అణుయుద్ధానికి దారితీసేలా పరిణామాలు మారుతున్నాయి. ఉక్రెయిన్ ప్రతిఘటనను, అంతర్జాతీయ ఆంక్షలను భరించలేని పుతిన్ అణు వార్నింగ్ ఇచ్చారు. దీంతో న్యూక్లియర్ వార్ వాకిట్లోకి వచ్చినట్లయింది. కోల్డ్‌వార్ ముగిసినప్పటినుంచి మానవాళి అణు వార్నింగ్‌లను మర్చిపోయింది. కేవలం ఎన్నికల సమయంలో దేశీయులను ఆకట్టుకోవడానికి పాక్ లాంటి కొన్ని దేశాలు అణుయుద్ధాల ప్రసక్తి తీసుకురావడం తప్ప ఒక దేశం మరో దేశాన్ని న్యూక్లియర్ ఆయుధాలు చూపి నేరుగా హెచ్చరించడం ఇటీవల కాలంలో జరగలేదు.
అంతా మర్చిపోయిన ఈ అణుయుద్ధం జరిగితే అది చేసే చేటు అంతా ఇంతా కాదని, సమస్త జీవజాలంపై దీని ప్రభావం ఉంటుందని అణు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతక స్థాయిలో విడుదలయ్యే రేడియేషన్ జీవరాసులను చంపడమే కాకుండా గాలి, నీరు, నేలను విషపూరితం చేస్తుందంటున్నారు. అణ్వాయుధాలతో జరిగే యుద్ధ ప్రభావం అనేక తరాలు వెంటాడుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అణుయుద్ధం జరిగితే ప్రపంచంలోని ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతింటాయని, దీంతో ప్రజలు బతకడానికి ఆదిమ మార్గాలు అనుసరించే పరిస్థితులు దాపురిస్తాయని ఆయన హెచ్చరించారు.
కరోనా కన్నా తీవ్రం
కోవిడ్ వైరస్ కారణంగా ప్రపంచమంతా కరోనా వ్యాపించి పలు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. అణుయుద్ధం జరిగితే ఇంతకు మించి అల్లకల్లోలాలు చెలరేగే అవకాశాలు అధికమని నిపుణుల హెచ్చరిక. చిన్నపాటి అణు పేలుడు సైతం లక్షలాది ప్రాణాలు తీయగలదు. వీటి దెబ్బకు అలముకునే ధూళి మేఘాలు సూర్యరశ్మిని అడ్డుకోవడంతో న్యూక్లియర్ వింటర్ వస్తుంది. ఇది పంటలను నాశనం చేసి తీవ్ర దుర్భిక్షానికి కారణమవుతుంది. న్యూక్లియర్ స్మోక్ వల్ల ఉత్తరార్థ గోళంలో ఓజోన్ పొర కరిగి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. దీనివల్ల జీవజాలం తీవ్రమైన వ్యాధులకు గురవుతుంది. దక్షిణార్థ గోళంలో కూడా ఇలాంటి సంక్షోభాలే కనిపిస్తాయి. కేవలం కోట్లాది ప్రాణాలు పోవడమే కాకుండా కిలోమీటర్ల మేర రేడియోయాక్టివిటీ వల్ల పర్యావరణం కలుషితమవుతుందని అణు శాస్త్రవేత్త క్రిస్టిన్‌సన్ హెచ్చరించారు.
ఆ దేశాల వద్దే అణ్వాయుధాలు
1945లో హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత అణ్వాయుధాల బలం, విస్తృతి చాలా అధికం. వీటిలో ఏ ఒక్కటి ప్రయోగించినా లేదా భూమిపై ఏ కొద్ది ప్రాంతంలో ప్రయోగించినా చివరకు అన్ని దేశాలు దుష్పరిణామాల బారిన పడడం ఖాయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని దేశాలు సంయమనం పాటించాలని నిపుణులు కోరుతున్నారు. భవిష్యత్‌లో అణుయుద్ధ భయం లేకుండా ఉండేందుకు ప్రపంచ న్యూక్లియర్ పవర్ దేశాలు తమ అణ్వాయుధాలను నాశనం చేయాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, బ్రిటన్, ఉత్తరకొరియా వద్ద అణ్వాయుధాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం అణుయుద్ధంగా పరిణమిస్తే వీటిలో చాలా దేశాలు తమ అస్త్రాలను బయటకు తీసే ప్రమాదం ఉంది. అన్ని దేశాలు యుద్ధానికి దిగకపోయినా, ఒక ప్రాంతానికే అణ్వాయుధాల యుద్ధం పరిమితమైనా ప్రభావం మాత్రం ప్రపంచమంతా ఉంటుందని అణు శాస్త్రవేత్త విల్సన్ హెచ్చరించారు. ఏ స్థాయిలోనైనా అణ్వాయుధ ప్రయోగం కూడదన్నారు. అయితే ఉక్రెయిన్ తరఫున ఏ దేశం నేరుగా పోరాటంలోకి దిగనందున రష్యా హెచ్చరికలకే పరిమితం కావచ్చని పలువురి అంచనా.
– నేషనల్ డెస్క్, సాక్షి
భయపెట్టే పరిణామం
రష్యా అణు వార్నింగ్‌పై గుటెరస్
న్యూయార్క్: దేశంలోని అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలివ్వడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా అణ్వాయుధ యుద్ధంగా మారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ప్రకటన భయపెట్టే పరిణామంగా ఐరాస కార్యదర్శి గుటెరస్ వ్యాఖ్యానించారు. అణు యుద్ధమనే ఆలోచనే ఊహించరానిదన్నారు. ఇరు పక్షాల చర్చలతో తక్షణం యుద్ధ విరమణ ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నాశనమవుతోందని సోమవారం జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సంక్షోభం అందరిపై తీవ్ర పరిణామం చూపుతుందని హెచ్చరించారు. చర్చలకు ఎప్పుడూ దారులు తెరిచే ఉంచాలని, శాంతియుత పరిష్కారమే అందరికీ అవసరమని చెప్పారు. జరిగిందేదో జరిగిందని, ఇకనైనా సైనికులు వెనక్కు మరలి నేతలు చర్చలకు రావాలని ఆకాంక్షించారు. తాజా దాడి ఐరాస మౌలిక భావనలను ప్రశ్నిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment