చిన్నమ్మ తంత్రం
సాక్షి, చెన్నై : విదేశీ మారక ద్రవ్యం కేసులో చిన్నమ్మ శశికళ కుటుంబీకులు కోర్టుకు హాజరయ్యారు. పరప్పన అగ్రహార చెర నుంచి భద్రత నడుమ సుధాకరన్‌ను ఎగ్మూర్ కోర్టుకు తీసుకొచ్చారు. ఆయనతో పాటుగా మరో బంధువు భాస్కరన్ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా బెంగళూరు చెరలో ఉన్న శశికళతో దినకరన్, తంబిదురైతో పాటుగా ఐదుగురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ కుటుంబానికి చెందిన వారిపై విదేశీ మారక ద్రవ్యం కేసుల మోత మోగుతున్న విషయం తెలిసిందే. శశికళ మీద కూడా ఈ కేసు నమోదై ఉంది.
ఈ కేసుల విచారణ చెన్నై ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టు న్యాయమూర్తి మలర్ మది విచారిస్తున్నారు. శశికళ అక్క కుమారుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, అన్న కుమారుడు భాస్కరన్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇక, దివంగత సీఎం జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇందుకు కారణం ఆ ఇద్దరు అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తుండటమే. విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం సుధాకరన్‌ను హాజరుపరచాలని ఇప్పటికే పలుమార్లు కోర్టు సమన్లు జారీచేసింది. అయితే, కర్ణాటక పోలీసులు అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటాన్ని ఓ కారణంగా ఆ పోలీసులు చూపించారు.
ఎట్టకేలకు మంగళవారం జరిగిన విచారణకు పరప్పన అగ్రహార చెర నుంచి గట్టి భద్రత నడుమ సుధాకరన్‌ను చెన్నైకి తీసుకొచ్చారు. నిఘా నీడలో ఆయన్ను ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు. సూపర్ డూపర్ టీవీకి ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుతో తనకు సంబంధం లేదని, అన్యాయంగా ఇరికించారంటూ కోర్టుకు సుధాకరన్ విన్నవించుకున్నారు. అభియోగాలపై ప్రభుత్వ తరపు వాదన, సాక్షుల విచారణకు కోర్టు తేదీ నిర్ణయించడంతో సుధాకరన్ అంగీకరించారు. ఇదే కేసు నిమిత్తం భాస్కరన్ సైతం కోర్టుకు హాజరైన తన వాదన వినిపించారు. తదుపరి విచారణను జూలై 13కు వాయిదా వేశారు. దీంతో సుధాకరన్‌ను గట్టి భద్రత నడుమ మళ్లీ బెంగళూరుకు తరలించారు. ఇక, విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళను కోర్టులో ఎప్పుడు హాజరు పరుస్తారో అన్నది వేచి చూడాల్సిందే.
చిన్నమ్మతో ములాఖత్ : పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళతో మూడోసారిగా మంగళవారం దినకరన్ ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటుగా సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితర ఐదుగురు ఎమ్మెల్యేలు శశికళను కలిశారు. రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారాలు, పార్టీలతో తమకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలు, అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి చిన్నమ్మకు వివరించినట్టు సమాచారం. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని, దివాకరన్‌తో సాగుతున్న వివాదంపై స్పందించారు.
వివాదాలన్నీ పనిగట్టుకుని సృష్టిస్తున్నారని, తమ కుటుంబీకులు అందరూ ఐక్యతతోనే ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై చిన్నమ్మ తన నిర్ణయాన్ని పార్టీకి పంపుతారని, అందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. ఇక, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చిన్నమ్మతో వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. చాలాకాలం అనంతరం చిన్నమ్మతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మీడియాతో మాట్లాడుతూ తంబిదురై వ్యాఖ్యానించడం విశేషం.
కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటు బీజేపీకి అనుకూలంగా పడే రీతిలో పార్టీ వర్గాలకు సందేశం ఇవ్వాలన్న సంకేతాన్ని చిన్నమ్మకు తంబి దురై సూచించినట్టు సమాచారం. అలాగే, ఇదే ఎన్నికల్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఎదుర్కొందామా..? లేదా, సామరస్యంగా సాగుదామా..? అన్న అంశంపై దినకరన్ మంతనాలు సాగించినట్టు తెలిసింది. అయితే, తన రాజకీయ తంత్రాన్ని ఎన్నికల తేదీ నాటికి ప్రయోగించేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.