దినకరన్ చార్జ్‌షీట్ రద్దు
హైకోర్టు ఉత్తర్వులు
టీ.నగర్: విదేశీ మారకద్రవ్యం కేసులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌పై ఏప్రిల్ 19వ తేదీ వరకు దాఖలైన చార్జ్‌షీటును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అందులో పిటిషనర్ తరఫు న్యాయవాది పాల్గొనే విధంగా జూలై 31వ తేదీలోగా ఒకే రోజున కొత్త చార్జ్‌షీటును నమోదు చేయాలని, మూడు నెలల్లోగా విచారణను ఎగ్మూరు ఆర్థిక నేరాల విభాగం కోర్టు ముగించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
గత 1996–97లో జేజే టీవీకి విదేశాల నుంచి ప్రసార పరికరాలను కొనుగోలు చేయడానికి సంబంధించి విదేశీ మారకద్రవ్యం మోసానికి పాల్పడినట్లు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె అక్క కుమారుడు భాస్కరన్, జేజే టీవీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తమను విడిపించాలని కోరుతూ శశికళ, టీటీవీ దినకరన్ ఇదివరకే ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఎగ్మూరు కోర్టు గత 2015లో శశికళపైన ఒక కేసులోను, దినకరన్‌పై రెండు కేసుల్లోను, భాస్కరన్‌పై ఒక కేసులోను వారిని విడిపిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఎగ్మూరు కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విదేశీ మారకద్రవ్యం కేసు నుంచి శశికళ, దినకరన్ విడిపించడాన్ని రద్దుచేస్తూ ఎగ్మూరు కోర్టు కేసు విచారణను కొనసాగించాల్సిందిగా ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం టీటీవీ దినకరన్‌పైన రెండు కేసుల విచారణను ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి సమక్షంలో జరుగుతూ వచ్చింది. ఇలాఉండగా కొడనాడు ఎస్టేట్ బంగళాను నకిలీ సంస్థల ద్వారా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు దాఖలైన కేసులో దినకరన్‌పై ఎగ్మూరు కోర్టు చార్జ్‌షీటు నమోదు చేసింది.
కేసుకు సంబంధించి టీటీవీ దినకరన్ కోర్టులో హాజరయ్యారు. తాను ఏ పొరపాటు చేయలేదని తన తరఫు వివరణ ఇచ్చారు. ఈ కేసులో దినకరన్‌పై చార్జ్‌షీట్లు నమోదు చేయడంతో కేసులో తదుపరి విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఇలాండగా మద్రాసు హైకోర్టులో టీటీవీ దినకరన్ కొత్తగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో తనపై చార్జ్‌షీటు నమోదు చేసే సమయంలో తన తరఫు వాదనలు వినకుండా చార్జ్‌షీటు నమోదు చేశారని, అందువల్ల చార్జిషీటు నమోదుకు, ఎగ్మూరు కోర్టు విచారణకు స్టే విధించాలని టీటీవీ దినకరన్ పిటిషన్‌లో కోరారు.
ఈ పిటిషన్ 10 రోజుల క్రితం న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. ఆ సమయంలో దినకరన్‌పై చార్జ్‌షీటు నమోదుకు మధ్యంతర స్టే విధిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ విదేశీ మారకద్రవ్యం కేసులో దినకరన్‌పై ఏప్రిల్ 19 వరకు నమోదైన చార్జ్‌షీటు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా పిటిషనర్ తరఫు న్యాయవాది పాల్గొనే విధంగా జూలై 31వ తేదీలోగా ఒకే రోజున కొత్త చార్జ్‌షీటును నమోదు చేయాలని, ఇదివరకే కాలాతీతమైన కేసును మరింతగా పొడిగించకూడదని తెలిపారు. అంతేకాకుండా కేసుపై ప్రతిరోజూ విచారణ జరిపి మూడు నెలల్లోగా విచారణను ఎగ్మూరు ఆర్థికనేరాల విభాగం కోర్టు ముగిం చాలని ఉత్తర్వులిచ్చారు.