వెయిటింగ్‌లిస్ట్‌లోని రైల్ టికెట్ రద్దు చేసినప్పుడు విధించే ఛార్జీలను నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సదరు ఛార్జీలను మినహాయించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోందా? అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
సీట్ల కొరత కారణంగా రైల్వేలో వెయిటింగ్‌లిస్ట్ టికెట్‌లు రద్దు అవుతాయి. అయితే ఆ సమయంలో రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జీలను విధిస్తుంది. వినియోగదారు ప్రమేయంలేని వాటికి ఛార్జీలు చెల్లించడం సరికాదనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి ఈమేరకు మోదీ ప్రభుత్వం ఇలాంటి ఛార్జీలను మినహాయించేలా ఏదైనా ఆలోచిస్తుందా? అని ప్రశ్నించారు. దానికి బదులుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
‘రైల్వే ప్యాసింజర్స్ (టికెట్ల రద్దు, ఛార్జీల వాపసు) రూల్స్ 2015 ప్రకారం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రద్దు చేసిన వాటితో సహా అన్ని వెయిట్‌లిస్టింగ్‌లోని టిక్కెట్ల రద్దుపై క్లర్కేజ్ ఛార్జీ విధిస్తున్నారు. ఒకవేళ సీట్ అలాట్ అవ్వకపోతే టికెట్ రద్దు అవుతుంది. ఈ ఛార్జీలతోపాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైల్వే నిర్వహణ ఖర్చులు, ఆస్తుల పునరుద్ధరణ, మూలధన వ్యయం, కస్టమర్ సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులుకు వినియోగిస్తున్నారు. అప్పటికే సీట్ కన్ఫర్మ్ అయినవారు ఎవరైనా తమ టికెట్ రద్దు చేసుకుంటే ఖాళీగా ఉన్న బెర్త్‌లను వెయిట్‌లిస్ట్‌లోని వారికి అలాట్ చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లోని ప్రయాణీకులు ‘వికల్ప్’ స్కీమ్ ద్వారా ప్రత్యామ్నాయ రైలులో కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంది’ అని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
ఏదైనా కారణాల వల్ల రైల్ బయలు దేరడానికంటే 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే కింది విధంగా ఛార్జీలు విధిస్తారు.
ఏసీ ఫస్ట్ క్లాస్/ ఎగ్జిక్యూటివ్ క్లాస్: రూ.240
ఏసీ 2-టైర్/ ఫస్ట్ క్లాస్: రూ.200
ఏసీ 3-టైర్/ ఏసీ చైర్ కార్/ఏసీ-3 ఎకానమీ: రూ.180
స్లీపర్ క్లాస్: రూ.60
సెకండ్ క్లాస్: రూ.20
Comments
Please login to add a commentAdd a comment