
తెలియదు.. గుర్తు లేదు!
♦ చిన్నమ్మ పల్లవి
♦ వీడియో కాన్ఫరెన్స్ విచారణ
♦ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి
♦ ఇక క్రాస్ ఎగ్జామిన్
విదేశీ మారక ద్రవ్యం కేసులో కోర్టు సంధించిన ప్రశ్నలకు చిన్నమ్మ శశికళ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానాలు ‘తెలియదు.. గుర్తు లేదు’ అని దాటవేశారు. ఆమేరకు శనివారం పరప్పన అగ్రహార చెర నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నై ఎగ్మూర్ కోర్టు ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించారు.
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళపై కేసులకు కొదవ లేదు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈడీ దాఖలుచేసిన పలు కేసుల విచారణలు ఒకటి తర్వాత మరొకటి చెన్నై ఎగ్మూర్ కోర్టు ముందుకు వస్తున్నాయి.
1991–1996 మధ్య కాలంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చిన్నమ్మ అండ్ ఫ్యామిలీ సాగించిన అవినీతి వ్యవహారాలు, మాయాజాలాలను తదుపరి అధికారంలోకి వచ్చిన డీఎంకే ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చింది. ఆ దిశగా 1996 –2001 మధ్యకాలంలో శశికళపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఐదు కేసులను నమోదు చేసింది. ఇందులో నాలుగు కేసుల్లో శశికళ మీద అభియోగాలు మోపింది. మూడు కేసుల్లో శశికళతో పాటు ఆమె బంధువులు కూడా నిందితులుగా ఉన్నారు.
ఇందులో జయ టీవీకి విదేశాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు చిన్నమ్మ మెడకు ఉచ్చుగా మారింది. రిజర్వు బ్యాంక్ అనుమతి లేకుండా నగదు బట్వాడా డాలర్లలో సాగినట్టు ఈడీ తేల్చింది. ఈ కేసు విచారణను చెన్నై ఎగ్మూర్ కోర్టులో సాగుతోంది. కోర్టుకు శశికళ నేరుగా హాజరు కావాల్సి ఉన్నా, పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్న దృష్ట్యా, కుదర లేదు. వాయిదాల పర్వంతో సాగుతూ వచ్చిన ఈ పిటిషన్ విచారణ మరింత వేగవంతం అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు ఎగ్మూర్ ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జకీర్ హుస్సేన్ ఆదేశాలు ఇచ్చారు.
ఉక్కిరి బిక్కిరి.. దాటవేత
శనివారం ఎగ్మూర్ కోర్టులో విచారణ ఆసక్తికరంగా సాగింది. 11.15 గంటల నుంచి 12.40 గంటల వరకు విచారణ జరిగింది. పరప్పన అగ్రహార చెర నుంచి వీడియో కాన్ఫరెన్స్ ముందుకు ఖైదీల యూనిఫాం గెటప్‌లో చిన్నమ్మ ప్రత్యక్షం అయ్యారు. ఆమెను ప్రశ్నలతో న్యాయమూర్తి ఉక్కిరి బిక్కిరి చేశారు. విదేశీ మారక ద్రవ్యం కేసులో ఈడీ మోపిన అభియోగాలను వివరిస్తూ ప్రశ్నలను సంధించారు. న్యాయమూర్తి ప్రశ్నలకు తెలియదు.. గుర్తు లేదు అన్న సమాధానాలతో చిన్నమ్మ దాటవేశారు.
అనేక ప్రశ్నలను చిన్నమ్మను ఇరకాటంలో పెట్టే విధంగా సాగినా, చాకచక్యంగా దాటవేత ధోరణి సాగించడం గమనార్హం. ఇక, విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఆ రోజున క్రాస్ ఎగ్జామిన్ సాగుతుందని విచారణను న్యాయమూర్తి ముగించారు. ఇక, శశికళ, ఆమె బంధువు సుధాకరన్ మీద దాఖలుచేసిన మరో విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ ఏడో తేదీ విచారణకు రానుంది. ఇప్పటికే సుధాకరన్ కోర్టుకు హాజరైన దృష్ట్యా, ఆ రోజున మరోమారు చిన్నమ్మ శశికళ వీడియో కాన్ఫరెన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.