ముంబై: అనధికార ఎలక్ట్రానిక్ ఫ్లాట్‌ఫామ్స్‌పై విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) ట్రేడింగ్ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం (ఫెమా) కింద జరిమానాలు పడే అవకాశం ఉందని కూడా సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజన్‌లు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ యాప్ తదితర ఫ్లాట్‌ఫామ్స్‌పై భారతీయ నివాసితులకు ఫారెక్స్ ట్రేడింగ్ సౌకర్యాలను అందిస్తామంటూ వస్తున్న తప్పుదోవ పట్టించే అనధికార ఈటీపీల ప్రకటనలను ఆర్‌బీఐ గమనిస్తున్నట్లు తెలిపింది. అనుమతించబడిన ఫారెక్స్ లావాదేవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆర్‌బీఐ లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల (ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా) అధికారిక ఈటీపీల మాత్రమే నిర్వహించాలని సూచించింది.
ఫెమా కింద రూపొందించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశీ ఎక్సే్ఛంజీలు, విదేశీ కౌంటర్‌పార్టీలకు మార్జిన్‌ల కోసం చెల్లింపులకు ఎంతమాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫారెక్స్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పథకాలను చేపట్టేందుకు కొందరు మోసపూరిత సంస్థలు వారి ఏజెంట్లు ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా సంప్రదించి భారీ రాబడుల హామీలతో వారిని ప్రలోభపెడుతూ, అనధికార ఈటీపీలను నిర్వహిస్తున్న అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇటువంటి అనధికార ఈటీపీలు, పోర్టల్‌లు చేసిన మోసపూరిత పథకాలు, ట్రేడింగ్‌ల వల్ల అనేకమంది భారీ ఎత్తున డబ్బును పోగొట్టుకుంటున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment