మాల్యాకు మరో చిక్కు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి, తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఇచ్చిన వ్యక్తిగత హాజరు మినహాయింపును ఢిల్లీ కోర్టు ఎత్తివేసింది. సెప్టెంబర్ 9న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఫారిన్ ఎక్చ్సేంజ్ రూల్స్ ఉల్లఘించించారనే ఆరోపణల కింద విజయ్ మాల్యా కచ్చితంగా కోర్టులో హాజరుకావాలని పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రకటిత నేరస్తుడిగా ప్రత్యేక కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ కు సంబంధించి రూ.9000కోట్ల రుణాన్ని బ్యాంకులకు ఎగనామం పెట్టి మార్చిలో మాల్యా బ్రిటన్ కు చెక్కేశాడు. అయితే నిన్న ఇంగ్లండ్ లోని సిల్వర్ స్టోన్ లో జరుగుతున్న ఫార్ములా వన్ రేసింగ్ పోటీల్లో ఆయన సహారా ఫోర్స్ వన్ జట్టు సహ భాగస్వామి హోదాలో మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. జీవితం అనేది సాగిపోతుండాలి అనే వేదాంత ధోరణిలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం తన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిపై ఆయన పెదవి విరిచారు. వారంలో 6 రోజులు పనిచేస్తూ కొన్ని కిలోల మేర బరువు తగ్గానని, తానిప్పుడు ఫిట్‌గా ఉన్నానన్నారు.
ఫైనాన్సియల్ కేసుల్లో విచారణ నిమిత్తం భారత్ కు తిరిగి రావాలని తామిచ్చే ఆదేశాలపై మాల్యా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపిస్తోంది. ఇటీవలే మాల్యాకు సంబంధించిన రూ.1,411 కోట్ల ప్రాపర్టీని ఈడీ అటాచ్ చేసింది. ఏప్రిల్ లో మాల్యా పాస్ పోర్టు కూడా రద్దు అయింది.