న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు విదేశీ ఎక్స్చెంజీలలో నేరుగా లిస్టయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కంపెనీల చట్టంలో సంబంధిత సెక్షన్ 5ని నోటిఫై చేసింది. దీని ప్రకారం నిర్దిష్ట తరగతులకు చెందిన పబ్లిక్ కంపెనీలు .. ఆమోదయోగ్యమైన కొన్ని విదేశీ స్టాక్ ఎక్స్చెంజీలలో తమ షేర్లను లిస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈ సెక్షన్‌కు సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై చేయాల్సి ఉంది.
విదేశాల్లో లిస్టింగ్ కోసం విదేశీ మారక నిర్వహణ చట్టం మొదలైన వాటిని కూడా సవరించాల్సి ఉంటుందని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్‌నర్ యష్ అషర్ తెలిపారు. తాజా పరిణామంతో పెట్టుబడుల సమీకరణకు దేశీ కంపెనీలకు మరో మాధ్యమం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. అయితే, వ్యాల్యుయేషన్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు లెక్కగట్టే విధానం, విదేశాల్లో లిస్టింగ్ వల్ల వాణిజ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలు మొదలైన వాటన్నింటినీ కంపెనీలు మదింపు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం దేశీ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్టవుతున్నాయి. 2020 మే నెలలో కోవిడ్ ఉపశమన ప్యాకేజీలో భాగంగా భారతీయ సంస్థలు విదేశాల్లో నేరుగా లిస్టయ్యేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది.
సదరు సంస్థలు ప్రపంచ మార్కెట్ల నుంచి పెట్టుబడులను సమీకరించుకునేందుకు తోడ్పా టు అందించేలా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జూలై 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. పటిష్టమైన మనీలాండరింగ్ నిబంధనలు అమలయ్యే ఎన్‌వైఎస్‌ఈ, నాస్‌డాక్, ఎల్‌ఎస్‌ఈ మొదలైన పది ఎక్సే్చంజీలను పరిశీలించవచ్చని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment