న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్‌ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి).
దీన్ని ఎల్‌ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్‌ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment