
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల సాగులో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం) డైరెక్టర్ రాకేష్ మోహన్‌జోషి అన్నారు. దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యం పెంచేందుకు ఎగుమతులను ప్రోత్సహించేలా పరిశోధనలు సాగాలన్నారు.
గుంటూరు లాంలోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. మన దేశంలో నూటికి 60 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అదే అమెరికాలో 3–4 శాతం మంది, న్యూజిలాండ్‌లో 3–5 శాతం మంది మాత్రమే ఈ రంగంపై ఆధారపడ్డారని చెప్పారు.
మన దేశ మార్కెట్‌లోకి వచ్చే ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల్లో మెజార్టీ వాటా అమెరికాదేనన్నారు. ఆర్బీకేల సేవలు అమోఘం ఏపీలో రైతు భరోసా కేంద్రాలు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు అందించడంతో పాటు పరిశోధనా ఫలితాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరవేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని జోషి కొనియాడారు. ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీ ఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ పరిశోధనాలయాలు రైతుల పాలిట దేవాలయాలని పేర్కొన్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ టి. జానకిరామ్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment