![Central Govt Says To Bank Foreign Transactions Make More In Indian Rupee - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/9/Untit.jpg.webp?itok=YFuyQRk4)
న్యూఢిల్లీ: విదేశీ వాణిజ్యంలో రూపాయి పాత్రను పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలను రూపీ మారకంలోనే నిర్వహించడానికి మొగ్గు చూపాలని వాణిజ్య మండళ్ల ప్రతినిధులు, బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. సీమాంతర చెల్లింపులు రూపీలో జరిగేలా చూసేందుకు విదేశాల్లోని భాగస్వామ్య బ్యాంకులతో కలసి ప్రత్యేక రూపీ వాస్ట్రో ఖాతాలు ఆఫర్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించింది.
ప్రస్తుతం విదేశీ వాణిజ్యం అంతా డాలర్ మారకంలో కొనసాగుతుండడం గమనార్హం. దీని కారణంగా ఎక్కువ అస్థిరతలు నెలకొనడంతో తాజా సూచన చేయడం గమనార్హం. వాణిజ్య సంఘాలు, వాటి విదేశీ భాగస్వామ్య సంస్థలు రూపీ మారకంలో లావాదేవీలకు వీలుగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. వాణిజ్య మండళ్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రూపీ మారకంలో వాణిజ్యానికి శ్రీలంక, అర్జెంటీనా, జింబాబ్వే సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయంగా వాణిజ్య సంస్థలు రూపీలో మారకానికి ఆసక్తితో ఉన్నందున.. రూపీ మారకంలో ఎగుమతులు, దిగుమతులకు వీలు కల్పించేందుకు బ్యాంకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశిస్తూ ఆర్‌బీఐ ఈ ఏడాది జూలైలోనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం రష్యా నుంచి మన దేశం చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రూపాయి మారకంలోనే ఆ దేశం నుంచి అధిక శాతం దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం!
Comments
Please login to add a commentAdd a comment