సాగుకు...నానో బలిమి! | Used for the cultivation ... Nano! | Sakshi
Sakshi News home page

సాగుకు...నానో బలిమి!

Published Wed, Apr 2 2014 10:30 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

సాగుకు...నానో బలిమి! - Sakshi

సాగుకు...నానో బలిమి!

రైతు... దేశానికి వెన్నెముక అంటారు.
 కానీ విత్తులు మొదలుకొని కోతల వరకూ...
 అన్ని దశల్లోనూ పెట్టే ఖర్చు... రైతుపై పెనుభారం మోపుతోంది.
 ఈ సాగు పెట్టుబడి కొంచెం తగ్గినా... బోలెడు ఉపయోగముంటుంది.
 శాస్త్రవేత్తలు ఇందుకోసం ఎనెన్నో ప్రయోగాలు చేస్తున్నారు కూడా.
 సెంట్రల్ ఏరిడ్ జోన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు నానోటెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన ఎరువులుఈ కోవకే చెందుతాయి. అటు ఖర్చు తగ్గించడంతోపాటు దిగుబడులూ పెంచే ఈ వినూత్న ఎరువు వివరాలు...

 
విత్తనాలు నాటింది మొదలు... పంట కాపుకొచ్చేంత వరకూ మనం ఎరువులు వాడుతూంటాం. మొక్క ఏపుగా ఎదిగేందుకు మంచి దిగుబడులు ఇచ్చేందుకు ఇది అవసరమని కూడా అంటారు. కానీ ఇందులో వాస్తవం కొంతే. వేసిన ఎరువులో మొక్క తీసుకునేది సగం కంటే తక్కువ మాత్రమే ఉంటే... మిగిలిన సగం వృధా అవుతూంటుంది. ఇలా కాకుండా వేసిన ఎరువులు... చాలా నెమ్మదిగా తమలోని పోషకాలను విడుదల చేస్తూ మొక్కలకు అందిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ... ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న యూరియా, పొటాష్, డీఏపీ వంటి రసాయన ఎరువులకు ఈ లక్షణం ఉండదు. కొంచెం అటుఇటుగా వారం రోజుల్లో పోషకాలన్నింటిని విడుదల చేసి నీటిలో కలిసిపోతాయి. మరి ప్రత్యామ్నాయం? నానో ఎరువులు!
 
సూక్ష్మ ప్రపంచం...
 
నానో ఎరువుల గురించి తెలుసుకునే ముందు అసలు నానో అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మన తల వెంట్రుక ఎంత పలుచగా ఉంటుందో మనకు తెలుసు. దాన్ని ఓ లక్ష సార్లు నిలువుగా చీల్చారనుకోండి. ఒక్కో ముక్క నానోమీటర్ మందం ఉంటుంది. అంత సూక్ష్మమైనదన్నమాట ఈ నానో! ఈ స్థాయిలో ఉండే పదార్థాల లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు.. మామూలుగా ఉన్నప్పుడు బంగారం అర్ధవాహకం. అంటే దీని గుండా విద్యుత్తు ప్రవాహం కొంచెమే అవుతుందన్నమాట. అదే నానోస్థాయిలో మాత్రం చాలా సులువుగా విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇదేవిధంగా నానోస్థాయిలో ఉండే ఎరువులు తమలోని పోషకాలను  సాధారణ ఎరువులతో పోలిస్తే నాలుగు రెట్లు తక్కువ వేగంతో విడుదల చేస్తాయి. ఫలితంగా ఒకసారి వేసిన ఎరువులు చాలాకాలం పాటు మొక్కలకు ఉపయోపగడతాయన్నమాట.
 
నాలుగింతలు తక్కువ ఖర్చు...
 
తరఫ్‌దార్ అభివృద్ధి చేసిన పద్ధతిలో నానో ఎరువుల ఖరీదు సంప్రదాయ ఎరువులతో పోలిస్తే రెండు నుంచి నాలుగింతలు తక్కువ ఉంటుంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కలిగించే రసాయనాల వాడకాన్ని 80 రెట్ల వరకూ తగ్గించవచ్చు.  పంట రకాన్ని బట్టి నానో ఫాస్పరస్ ధర ఒక హెక్టారుకు రూ.350 నుంచి రూ.400 వరకూ ఉంటే, ఎస్‌ఎస్‌పీ ధర రూ.480 నుంచి రూ.640, డీఏపీ ధర రూ.1500 నుంచి రూ.2000 వరకూ మాత్రమే ఉంటుంది.

నానో ఎరువుల వాడకం వల్ల మొక్కలు పీల్చుకోగల పోషకాల శాతం కూడా ఎక్కువ అవుతుంది. దీన్నే శాస్త్ర పరిభాషలో న్యూట్రియెంట్ యూజ్ ఎఫిషియెన్సీ అంటారు. సంప్రదాయ ఎరువులతో ఇది 42 శాతానికి మించదు. కానీ నానో ఎరువుల విషయంలో ఇది 58 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మొక్కలు ఏపుగా ఎదగడంతోపాటు ఎక్కువ దిగుబడులు అందిస్తాయి. ఒక అంచనా ప్రకారం నానో ఎరువుల ద్వారా పెరిగే దిగుబడులు  17 నుంచి 54 శాతం వరకూ ఉంటాయి.

నానో ఎరువులతో ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. నేల ఎక్కువ తేమను ఒడిసిపట్టుకోవడం, కార్బన్ మోతాదులను పెంచడం వీటిల్లో కొన్ని. స్థానికంగా తయారు చేసుకోవడం ద్వారా ఎరువుల దిగుమతులు తగ్గి విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది కూడా. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 67 లక్షల టన్నుల ఎరువులను దిగుమతి చేసుకోగా ఇందుకోసం దాదాపు 200 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది.
 
తరఫ్‌దార్ కృషి...
 
నానో ఎరువుల తయారీ కోసం చాలాకాలంగా ప్రయాత్నాలు జరుగుతున్నాయి. మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌తోపాటు దేశంలోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులూ ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నారు.  జోధ్‌పూర్‌లోని సెంట్రల్ ఏరిడ్ జోన్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త జె.సి.తరఫ్‌దార్ ఇటీవలే ఇందులో విజయం సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా బయో సింథసిస్ (ఎంజైమ్‌ల సాయంతో) పద్ధతిలో నానో ఎరువులను తయారు చేసే ప్రక్రియను ఆవిష్కరించారు.  బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ఎంజైమ్‌ల సాయంతో యూరియా, పొటాష్ వంటి ఎరువులను నానోస్థాయిలోకి  మార్చగలిగారు.
 
 ప్రశస్తి ఇంజినీరింగ్‌తో ఒప్పందం...

 నానో ఎరువులను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సెంట్రల్ ఏరిడ్ జోన్ రీసెర్చ్ సెంటర్ సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రతిష్ట ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మాజీ ఐఏఎస్ అధికారులు కొందరు బోర్డు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పోషకాలను అభివృద్ధి చేస్తోంది.  
 ‘‘సహజమైన పదార్థాలతో తయారు చేస్తూండటం వల్ల ఈ నానో ఎరువులతో పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు. అన్ని రకాల పంటలకూ దీన్ని వాడవచ్చు.’’
 - జె.సి.తరఫ్‌దార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement