హార్బర్ అభివృద్ధిపై ఆశ | On the development of the harbor hope | Sakshi
Sakshi News home page

హార్బర్ అభివృద్ధిపై ఆశ

Published Sat, Nov 7 2015 1:36 AM | Last Updated on Thu, Oct 4 2018 5:26 PM

On the development of the harbor hope

నవ్యాంధ్ర రాజధానిగా రూపొందుతున్న జిల్లాకు తీరప్రాంతం ఆయువు పట్టుగా మారనుంది. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం హార్బర్ రాష్ట్రంలో విశాఖపట్నం తరువాత అత్యంత ప్రాధాన్యత గలది. విదేశీ మారకద్రవ్య సముపార్జనతో పాటు వేలాదిమందికి ఉపాధి కేంద్రంగా మారిన ఈ హార్బర్ అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమైంది. అమరావతి అంకురార్పణతోనైనా ఈ దిశగా పాలకులు దృష్టి సారిస్తారని, తమకు మంచి రోజులొస్తాయని తీరప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం సముద్ర తీరంలో సహజసిద్ధంగా ఏర్పడిన పాయను అనువైన ప్రాంతంగా ఎంచుకుని 1980లో అటవీశాఖకు చెందిన 38 ఎకరాల్లో హార్బర్ నిర్మించారు. దీనికి అనుసంధానంగా తొలి దశ పనుల్లో భాగంగా 50 బోట్లను నిలుపుదల చేసుకునే విధంగా జె ట్టీ నిర్మించారు. హార్బర్ ఏర్పాటుతో ఆప్రాంతం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. బోట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాకినాడ, మచిలీపట్నం, చీరాల ఓడరేవు, నెల్లూరు, మద్రాసుకు చెందిన బోట్లు మత్స్యసంపద విక్రయాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాకపోకలు సాగించటం మొదలుపెట్టాయి. దీంతో జెట్టీ సమస్య జటిలంగా మారింది.
 
మురిగిపోయిన నిధులు..

 జెట్టీ సమస్య పరిష్కారానికి పదేళ్ల కిందట నాడు కూచినపూడి శాసనసభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమాణారావు హార్బర్ రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం జెట్టీ అభివృద్ధికి రూ.10 కేటాయించినప్పటికీ అటవీశాఖకు చెందిన భూమికి అనుమతి మంజూరుకాక నిధులు మురిగిపోయాయి. కొంతకాలం తరువాత సమస్యను నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లి హార్బర్ అభివృద్ధికి కావలసిన ఐదెకరాల అటవీశాఖ భూమిని కేటాయింపు చేయించడంలో మోపిదేవి సఫలీకృతులయ్యారు. వైఎస్ ఆకస్మిక మరణంతో పనులు మాత్రం ముందుకు సాగలేదు. 2011 ఫిబ్రవరి 7న రచ్చబండ కార్యక్రమానికి నిజాంపట్నం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా హార్బర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్కఅడుగూ ముందుకు పడలేదు.
 
పెరిగిన బోట్లు.. తరచూ వివాదాలు...

 హార్బర్‌లోని జెట్టీలో 50 బోట్లు నిలిపేందుకు మాత్రమే చోటు సరిపోతుంది. ప్రస్తుతం నిజాంపట్నంలో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, 150 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. వీటితో పాటు నిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన బోట్లు 50 వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వేటనుంచి వచ్చిన బోట్లు నిలుపుకునేందుకు జెట్టీలో ఖాళీలేక మత్స్య సంపద దిగుమతి చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బోట్లు ఒకేసారి ఒడ్డుకు చేర తాయి. వీటిని పక్కపక్కనే నిలపడం వల్ల అలలు, ఈదురుగాలుల ప్రభావానికి  ఒకదానికి ఒకటి ఢీకొని దెబ్బతింటున్నాయి. జెట్టీలో చోటుకోసం గొడవలు జరగ డం పరిపాటిగా మారింది. పాయ పక్కనే లంగర్లు వేసి, మడ చెట్లకు కట్టి ఉంచితే ఇటీవల తుపాన్ల సమయంలో మూడు బోట్లు తాళ్లు తెగిపోయి సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement