గుబురుగా పెరిగిన చెట్లు, గుత్తులుగా వేలాడే జీడిమామిడి కాయలతో కళకళలాడిన సాగరతీరం నేడు ఎడారిని తలపిస్తోంది. పచ్చని తోటలతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం మోడువారిన చెట్లతో వెలవెలబోతోంది. చూద్దామన్నా కాపు కనిపించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీరంలోని జీడిమామిడి తోటలను గాలికి వదిలేడంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే అటవీ సంపద వేరుపురుగు సోకి అంతరించిపోతోంది. పర్యావరణ సమతుల్యతకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఈ తోటల పరిరక్షణకు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.
పిట్టలవానిపాలెం : గుంటూరు జిల్లాలో ప్రధాన తీరప్రాంతమైన బాపట్ల సమీపంలో ముత్తాయపాలెం, కర్లపాలెం, పేరలి తదితర గ్రామాలు, ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. ఈ భూముల్లో అటవీ శాఖ 1956, 57, 58 సంవత్సరాల కాలంలో జీడి మామిడి సాగు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే జీడిమామిడి తోటల పరిరక్షణకు 1980లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. బాపట్ల ఫారెస్టు రేంజ్ పరిధిలోని జీడిమామిడి తోటలను నెల్లూరు అటవీ అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి బాపట్ల ఫారెస్టు రేంజ్ విభాగాన్ని కావలి నార్త్ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. జీడి మామిడి తోటలను ఆసంస్థ పర్యవేక్షణలోకి చేర్చింది. 2000 సంవత్సరం వరకు ఈ ప్రాంతాల్లో జీడి మామిడి తోటల పరిస్థితి బాగానే ఉంది. తర్వాత కాలంలో చెట్లను వేరు పురుగు ఆశించి సమూలంగా నాశనం చేస్తోంది.
నాడు 5,000.. నేడు 150..
తోటలు అంతరించిపోతున్నప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడంతో జీడిమామిడి ద్వారా ప్రభుత్వానికి అందాల్సిన రాబడి పూర్తిగా పడిపోయింది. ఆయా ప్రాంతాలలో తోటలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దెబ్బతింది. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లలో విస్తరించి ఉన్న జీడిమామిడి చెట్లు 15 ఏళ్ల క్రితం ఐదు వేల చెట్లు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం 150 చెట్లకు చేరుకుంది. దీన్ని బట్టి జీడి మామిడి తోటల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లు, పేరలిలో 1000 హెక్టార్లు, బాపట్ల మండలం ముత్తాయపాలెంలో 2000 హెక్టార్లు, ప్రకాశం జిల్లా కడవకుదురులో 100 హెక్టార్లు విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి.
గణనీయంగా తగ్గిన ఆదాయం..
గడచిన పదేళ్లుగా జీడిమామిడి ధరలు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం తోటల్లో చెట్లు సంఖ్య తగ్గి, ఫలసాయం తగ్గిపోవడమే. వేలంపాటల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి గణనీయంగా తగ్గిపోతుంది. గతేడాది బాపట్ల సెక్షన్ పరిధిలోని జీడిమామిడి తోటలకు రూ.80 లక్షల ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ.40 లక్షలకు పడిపోయింది.
దిద్దుబాటు చర్యలతో పూర్వ వైభవం..
అంతరించిపోతున్న జీడిమామిడి తోటలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. తిరిగి తోటలను అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, అవి పెరిగి ఫలసాయం అందించే వరకు ఆయా అటవీ భూముల్లోని రైతులకు నామమాత్రపు లీజుకు ఇవ్వాలి.దీని వలన మొక్కల పెంపకానికయ్యే ఆర్థిక భారం తగ్గడంతో పాటు రైతులకు ఉపాధి కలుగుతుంది.
గతంలో చాలా బాగుండేది..
గతంలో జీడిమామిడి తోటలు చాలా గుబురుగా ఉండేవి. గత పదేళ్లుగా చెట్లు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతమంతా ఎడారిగా మారింది. ఈసంవత్సరం అసలు చూద్దామన్నా కాపు కన్పించడం లేదు. అధికారులు పరిశీలించి మొక్కలు నాటి పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శ్రీనివాసరెడ్డి, తోట కాపలాదారు, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం
తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది..
నిరుడు చూసిన చెట్లు ఈఏడు ఎండిపోతున్నాయి. దాదాపుగా 65 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నందాయపాలెం తోట పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరుకుంది. పచ్చని తోటల దగ్గర ఉండే మాలాంటి వారం చల్లదనం కోల్పోయా. తోట ఎండిపోవడం వలన పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుంది. తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది.
- వెంకట్రామిరెడ్డి, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం
మోడు వారిన జీడి
Published Sat, Oct 17 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement
Advertisement