
దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు తగ్గింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ప్రకారం.. 2024–25 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.4 శాతానికి వచ్చి చేరింది. జూలై–సెప్టెంబర్‌లోనూ ఇదే స్థాయిలో నమోదైంది.
2023–24 డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో నిరుద్యోగిత రేటు 2024 అక్టోబర్–డిసెంబర్‌లో 8.1 శాతానికి తగ్గింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది.
2024 జూలై–సెప్టెంబర్‌లో ఈ రేటు 8.4 శాతం. ఇక పురుషుల్లో నిరుద్యోగిత రేటు అంత క్రితం ఏడాది మాదిరిగానే 2024 అక్టోబర్–డిసెంబర్‌లో 5.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. 2024 జూలై–సెప్టెంబర్‌లో ఇది 5.7 శాతం నమోదైంది.