ముంబై: ఉపాధికి జూన్ కలసి రాలేదు. ప్రధానంగా సాగు రంగంలో ఉపాధి నష్టంతో జూన్ మాసంలో నిరుద్యోగ రేటు 7.80 శాతానికి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ గణాంకాలతో ఒక నివేదిక విడుదల చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేమి మే నెలలో 6.62 శాతంగా ఉంటే, జూన్ నెలలో 8.03 శాతానికి పెరిగిపోయినట్టు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మే నెలలో 7.12 శాతంగా ఉంటే జూన్ నెలలో 7.30 శాతానికి చేరినట్టు తెలిపింది. ‘‘లాక్‌డౌన్‌లు లేని ఒక నెలలో ఉపాధి రేటు ఎక్కువగా పడిపోవడం అన్నది ఇదే. ఇది గ్రామీణ ప్రాంతంలోని రుతువుల వారీగా ఉండే ప్రభావం వల్లే. గ్రామీణ ప్రాంతాల్లో సాగు పనులు లేకపోవం వల్లే ఇలా జరిగింది. విత్తన సాగు మొదలవుతుంది కనుక జూలై నుంచి ఈ పరిస్థితి మారిపోతుంది’’అని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ తెలిపారు.
30 లక్షల మందికి ఉపాధిలేవి...
1.3 కోట్ల మందికి గత నెలలో ఉపాధి నష్టం జరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ నికరంగా పెరిగిన నిరుద్యోగులు 30 లక్షల మందేనని వివరించింది. అసంఘటిత రంగంలో ఉపాధి నష్టం ఎక్కువగా జరిగినట్టు వ్యాస్ తెలిపారు. కార్మికుల వలసే ఇందుకు కారణమన్నారు. జూన్‌లో వేతన జీవుల్లో (సంఘటిత రంగం) 25 లక్షల మంది ఉపాధిని కోల్పోవడం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో 30.6% రాజస్థాన్‌లో 29.8%, అసోంలో 17.2%, జమ్మూ కశ్మీర్‌లో 17.2%, బిహార్‌లో 14% చొప్పున నిరుద్యోగం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment