నిరుద్యోగం పైపైకి.. ఉద్యోగాలు లేక యువత విలవిల | The Unemployment Rate In The Country Is Increasing During The Year | Sakshi
Sakshi News home page

దేశంలో నిరుద్యోగం పైపైకి.. రాష్ట్రాల్లో భారీ వ్యత్యాసం

Published Wed, Sep 14 2022 2:34 AM | Last Updated on Wed, Sep 14 2022 2:34 AM

The Unemployment Rate In The Country Is Increasing During The Year - Sakshi

న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్‌ను దాటేశామని మీసాలు మెలేస్తున్నాం. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. గత ఏడాది కాలంలో నిరుద్యోగ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఆగస్టులో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి చేరుకుంది. అయిదేళ్ల క్రితం 5% ఉన్న నిరుద్యోగ రేటు అలా అలా పెరుగుతూనే ఉంది. 2021 ఆగస్టులో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 8.35%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 6.56 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ బాగా పెరిగిపోయిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక గ్రామీణ భారతంలో ఉద్యోగాలు లేక యువత విలవిలలాడిపోతున్నారు. గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం రేటు 9.6% ఉంటే, పట్టణాల్లో 7.7%గా ఉంది. 

రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం  
రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 30% కంటే ఎక్కువగా నిరుద్యోగం రేటు ఉన్న రాష్ట్రాలు మూడు ఉంటే, 3%కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు నాలుగున్నాయి. హరియాణాలో అత్యధికంగా 37.3 శాతంతో నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంటే జమ్ము కశ్మీర్‌లో 32.8%, రాజస్థాన్‌లో 31.4% ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 6.9% నిరుద్యోగం రేటు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 6%గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం రేటు అత్యల్పంగా 0.4% ఉంటే, 3శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా; మేఘాలయా ఉన్నాయి.  

40% మంది యువతకి ఉద్యోగాల్లేవ్‌ 
కొత్త ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2016–17 నుంచి 2021–22 గణాంకాలను పరిశీలించి చూస్తే ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోతున్నారు. గత ఏడేళ్ల కాలంలో యువతలో సగటు నిరుద్యోగం రేటు 42.6%గా ఉంది. ప్రస్తుతం యువతలో నిరుద్యోగం రేటు 34%గా ఉంది. ఇక పనిచేసే రంగంలో ఉండే మహిళలు పదేళ్ల క్రితం 26% ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 19శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గడం, యువతలో నైపుణ్యాలు కరువు, పనిచేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా వినియోగించడం వంటివన్నీ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నాయి. మరికొంత మంది యువత చిన్నా చితక ఉద్యోగాలు చేయలేక వదులుకొని వెళ్లిపోవడం కూడా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణంగా మారింది.  

ప్రభుత్వం ఏం చేస్తోంది ?  
నిరుద్యోగం కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2023 చివరి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగంలో నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేయడానికి ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికేనని ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్ల తర్వాత ప్రైవేటు రంగంలో పని చేయడానికి నిపుణులైన కార్మికులు లభిస్తారన్నది కేంద్రం వాదనగా ఉంది. రవాణా రంగంలో ఊబర్, ఓలా, ఆతిథ్య రంగంలో ఇంటికి ఫుడ్‌ డెలివరీ చేసే స్విగ్గి, జోమాటో సర్వీసులతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ తయారీ రంగం, మౌలికసదుపాయాల కల్పన ద్వారా ఉపాధి అవకాశాల్ని పెంచాల్సిన అవసరం ఉందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: ర్యాంటాక్‌, జింటాక్‌ టాబ్లెట్స్‌తో క్యాన్సర్‌?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement