న్యూఢిల్లీ: వినియోగంపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ (ఎఫ్‌ఎంసీజీ) డిసెంబర్ త్రైమాసికంలో ప్రతికూల వృద్ధిని చూసింది. విశ్లేషణ సంస్థ నీల్సన్‌ఐక్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల విలువ 7.6 శాతం పెరిగింది. కానీ, విక్రయించిన ఉత్పత్తుల సంఖ్య పరంగా చూస్తే 0.3 శాతం తగ్గింది. విక్రయాల సంఖ్య పరంగా ప్రతికూల వృద్ధి పరిశ్రమలో నమోదైంది. కరోనా ముందు నాటితో పోలిస్తే విలువ, సంఖ్యా పరంగా అమ్మకాలు ఎగువనే ఉన్నాయి.
వరుసగా ఆరో త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్‌లో విలువ పరంగా 2.8 శాతం క్షీణత నమోదైంది. కానీ, గత డిసెంబర్ క్వార్టర్‌లో పట్టణ మార్కెట్‌లో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ 1.6 శాతం వృద్ధిని చూసింది. రిటైల్ విభాగంలో ఆధునిక విక్రయ చానళ్లలో విలువ పరంగా 23.3 శాతం, సంఖ్యా పరంగా 12.6 శాతం చొప్పున వృద్ధి, అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు నమోదైంది. సంప్రదాయ చానళ్లు అయిన కిరాణా దుకాణాలు తదితర నమూనాల్లో అమ్మకాలు 1.5 శాతం తగ్గాయి. ‘‘వినియోగదారులు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండగా, తయారీదారులు కూడా ప్రోత్సాహకాలను తొలగించి మార్జిన్లను కాపాడుకునే విధానాన్ని అనుసరించారు’’అని నీల్సన్ ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సోనికా గుప్తా తెలిపారు.
చిన్న ప్యాకెట్లకే మొగ్గు
‘‘సంప్రదాయ, ఆధునిక విక్రయ చానళ్లలో వినియోగదారులు ఇప్పటికీ చిన్న పరిమాణంలోని ప్యాకెట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. తయారీ సంస్థలు సైతం విక్రయాల కోసం చిన్న ప్యాక్‌లను తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. చిన్న సంస్థల నుంచి పోటీ ఉండడం కూడా పోర్ట్‌ఫోలియో పరంగా వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం పెద్ద సంస్థలకు ఏర్పడింది. ఆహారోత్పత్తులకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తూ, నాన్ ఫుడ్ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని నీల్సన్‌ఐక్యూ నివేదిక తెలియజేసింది. నాన్ ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు అన్ని విభాగాల్లోనూ కరోనా ముందు నాటితో పోలిస్తే తక్కువగా నమోదువుతున్నట్టు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment