7.4 శాతానికి జీడీపీ జోరు..
డిసెంబర్ త్రైమాసికంలో 7.5%
- వృద్ధి రేటులో చైనాను అధిగమించనున్న భారత్
- కొత్త గణాంకాల విధానంతో వృద్ధి స్పీడ్
- వ్యవసాయంలో మాత్రం నీరసం
న్యూఢిల్లీ: ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరం (2014-15)లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు జోరందుకుని, 7.4 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వం తాజా అంచనాల్లో ప్రకటించింది. 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మార్పు ప్రకారం ప్రభుత్వం సోమవారం తాజాగా ఈ అడ్వాన్డ్ (ముం దస్తు) అంచనా గణాంకాలను విడుదల చేసింది.
మారిన బేస్ ఇయర్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2013-14లో వృద్ధి రేటును 4.7%-6.9%కి ఇటీవల సవరించిన సంగతి తెలిసిందే. తాజా ఫార్ముల్లాకు అనుగుణంగా ప్రస్తుత ఏడాది వృద్ధి రేటు 6.9% నుంచి 7.4 శాతానికి (గత అంచనాలు 5.5%) ఎగబాకనున్నట్లు కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్‌ఓ) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 7.5%గా నమోదయ్యింది.
విలువల్లో...
వాస్తవిక జీడీపీ (లేదా) 2011-12 స్థిర ధరల ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ. 106.57 లక్షల కోట్లు ఉంటుందని తాజా విధానం అంచనా వేస్తోంది. 2015 జనవరి 30న విడుదలైన ఫస్ట్ రివైజ్డ్ అంచనా ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2013-14) ఈ విలువ రూ.99.21 లక్షల కోట్లు. అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో జీడీపీ విలువ 7.4 శాతం వృద్ధితో రూ.99.21 లక్షల కోట్ల నుంచి రూ.106.57 లక్షల కోట్లకు చేరుతుందన్నమాట. ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ విలువ 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.113.45 లక్షల కోట్లతో పోల్చితే 2014-15లో 11.5% వృద్ధితో రూ.126.54 లక్షల కోట్ల స్థాయికి పెరుగుతుందని ప్రభుత్వం అంచనావేసింది.
రంగాల వారీగా ఇలా: డిసెంబర్ త్రైమాసికంలో 7 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదుచేసుకున్న రంగాల్లో ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెసనల్ సర్వీసులు, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసులు ఉన్నాయి. వ్యవసాయం. అటవీ, మత్య్స విభాగాలు కలిపి కేవలం 1.1% వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ఒక్క వ్యవసాయ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం (మైనస్) క్షీణత నమోదయ్యింది.
చైనాను అధిగమించడంపై: అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదయితే, ఈ రేటు విషయంలో భారత్ చైనాను అధిగమించినట్లవుతుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి మొదటి దేశమవుతుంది. అయితే ఈ విషయంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ అధికారి అశిష్ కుమార్ విభిన్నంగా స్పందించారు. చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం మనదేశం ఆర్థిక పరిమాణం కన్నా నాలుగైదురెట్లు అధికమని ఈ కారణంగా మన దేశంలో ఏడు శాతం వృద్ధి కొనసాగినా... ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అధిగమించాలంటే మనకు ఇంకా 20 నుంచి 30 ఏళ్లు పడుతుందని అన్నారు.
బేస్ ఇయర్ అంటే: వివిధ రంగాలకు సంబంధించిన గణాంకాలకు ఒక నిర్దిష్ట ఏడాదిని మూలంగా తీసుకుని అప్పటి ధర/విలువ ప్రాతిపదికన తదుపరి ప్రతి ఏడాదీ పెరిగే ధర/విలువ వృద్ధి తీరును పరిశీలించడం జరుగుతుంది. పెరుగుదలను శాతాల్లో చూపుతారు. ఈ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకున్న సంవత్సరాన్నే ‘బేస్ ఇయర్’ అంటారు.
వృద్ధి పెరగడం లెక్కల్లో పొరపాటా?-అసోచామ్
బేస్ ఇయర్ మార్పుతో ప్రకటించిన కొత్త జీడీపీ అం చనాలు ఆయోమయం సృష్టిస్తున్నాయని పారిశ్రామిక చాం బర్ అసోచామ్ విమర్శించింది. జీడీపీ లెక్కింపు మారినంతనే ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి జోరుపెరిగినట్లు కన్పిస్తున్నదంటే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ రావత్ అన్నారు. వ్యవస్థలో పెట్టుబడుల పునరుద్ధరణ జరగలేదని, చమురు ధరలు తగ్గినప్పటికీ, వినియోగ డిమాండ్ పెరగలేదని వ్యాఖ్యానించారు.
నెలవారీ తలసరి ఆదాయం రూ.7,378
10 శాతం పెరుగుదల
జీవన ప్రమాణ సూచికగా భావించే నెలవారీ తలసరి ఆదాయం తాజా గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,378.17(119 డాలర్లు)కు పెరగనుంది. ఇది 10% ఎక్కువ. బేస్ ఇయర్ మారడంతో తలసరి ఆదాయం గణాంకాలు కూడా మారాయి. కొత్త అంచనాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం నెలవారీ తలసరి ఆదాయం రూ.6,699గా ఉంది. వస్తువుల, సేవలకు జత అయిన స్థూల విలువతో పాటు పరోక్ష పన్నులను కూడా మదింపు చేసి కొత్త తలసరి ఆదాయాన్ని గణించారు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.80,388గా ఉన్న వార్షిక తలసరి నికర ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 10% వృద్ధితో రూ.88,538కు (ప్రస్తుత ధరల ప్రకారం) పెరుగుతుంది. స్థిర ధరల్లో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,829.92గా ఉన్న నెలవారీ తలసరి ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.6,182.75కు పెరుగుతుంది.