ఓ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ అధ్యయనంలో వెల్లడి సామాజిక మాధ్యమాలతో మేలెంత జరుగుతోందో కానీ.. ఆన్‌లైన్ వినియోగదారుల్లో చాలామంది రకరకాల వేధింపులకు గురవుతున్నారు. అసభ్య పదజాలంతో తిట్టడం, గాయపరుస్తామని.. లేదా చంపేస్తామన్న బెదిరింపులు.. ఆన్‌లైన్‌లో వేధించడం ఇటీవలి కాలంలో మరింత ఎక్కువైందని చెబుతోంది కంప్యూటర్ భద్రత సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ నార్టన్ బై సెమాంటిక్. ఆన్‌లైన్ వేధింపుల తీరుతెన్నులపై ఈ సంస్థ ఇటీవల ఓ అధ్యయనం జరిపింది. దేశంలోని ప్రతి 10 మంది ఆన్‌లైన్ వినియోగదారుల్లో 8 మంది ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నట్లు అధ్యయనం స్పష్టం చేస్తోంది. నార్టన్ బై సెమాంటిక్ కంట్రీ మేనేజర్ రితీశ్ చోప్రా తెలిపిన ప్రకారం సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
►ఎవరినో ఏదో అన్నారని.. అకారణంగా కొందరిపై విరుచుకుపడటం.. ఘర్షణ రేకెత్తించేలా వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కామెంట్లు పెట్టడం, లైంగిక వేధింపులకు గురి చేయడం ఎక్కువవుతోంది.
►ఆన్‌లైన్‌లో తిట్లు, బూతులు తింటున్నామని 40 ఏళ్ల వయసు లోపు వారు 65% మంది ఫిర్యాదు చేస్తుండగా, దివ్యాంగులు, మానసిక స్థితి సక్రమంగా లేనివారు 87% మంది ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.
►బరువు ఎక్కువ ఉన్నారన్న కారణంగా ఆన్‌లైన్ వేధింపులు ఎదుర్కొంటున్న వారు దాదాపు 77 శాతం మంది ఉన్నారు.
►శారీరక హాని చేస్తామన్న బెదిరింపులు దాదాపు 45 శాతం ఉండగా, ఎదుటివారిని చులకన చేసేలా ప్రవర్తించడం 44 శాతం వరకు ఉంది.
►లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిలో చాలామంది అసలు ప్రొఫైల్ ఏమిటో కూడా స్పష్టంగా తెలియదు.
►వేధింపుల్లో ఆడ, మగ తేడా పెద్దగా లేకపోవడం విశేషం.
►40 ఏళ్లలోపు మహిళలు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తున్నట్లు సర్వే చెబుతోంది. ఈ విషయంలో ఢిల్లీలో ఎక్కువమంది బాధితులు ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
►ఆన్‌లైన్ వేధింపుల కారణంగా మానసికంగా కలత చెందినట్లు కొందరు.. వీటి ప్రభావం తమ బంధాలపై పడినట్లు మరికొందరు తెలిపారు.
►సైబర్ వేధింపుల బాధితుల్లో ముంబైది మొదటి స్థానం మూడో స్థానంలో హైదరాబాద్
ఆన్‌లైన్ రక్షణను పటిష్టం చేసుకోవాలి
ఆన్‌లైన్ వేధింపులను తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఆన్‌లైన్ రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని రితేశ్ చోప్రా అంటున్నారు. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లలో భద్రతా సెట్టింగ్స్‌ను సమీక్షించాలని, తరచూ పాస్‌వర్డ్‌లు మార్చడం మరింత మేలు చేకూరుస్తుందని సూచించారు. ఎవరైనా దూషణలకు పాల్పడితే వారి మాటలకు స్పందించకుండా నేరుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిం చారు. వేధింపులకు సంబంధించిన అన్ని రకాల ఆన్‌లైన్ సాక్ష్యాలను భద్రపరుచుకోవాలని చెప్పారు.
సైబర్ వేధింపుల బాధితులు
►ముంబై 51%
►ఢిల్లీ 47%
►హైదరాబాద్ 46%
Comments
Please login to add a commentAdd a comment