ఖమ్మంరూరల్: పాలేరు నియోజకవర్గం ఏర్పడిన 1962 నుంచి 2016 ఉప ఎన్నికల వరకు మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగాయి. 2014 వరకు కూడా మహిళలకు పోటీ చేసే అవకాశం ఏ పార్టీ కూడా కల్పించలేదు. పాలేరులో ప్రస్తుతం 2,04,530 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,04,222 మంది ఉంటే పురుషులు 1,00, 293 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 3,929మంది అధికంగా ఉన్నారు.
ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో అన్నిరంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం మహిళలకు అవకాశాలు ఇవ్వడంలేదు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరుమలాయపాలేనికి చెందిన మద్దినేని స్వర్ణకుమారికి అవకాశం ఇవ్వడంతో ఆమె అప్పటి ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వర్ణకుమారి 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2016లో రాంరెడ్డి సుచరితారెడ్డికి..
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2016లో మృతి చెందడంతో తిరిగి పాలేరులో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డి సతీమణ రాంరెడ్డి సుచరితారెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఆమె ఆ ఉప ఎన్నికల్లో 50వేలు ఓట్లు సాధించారు. అనంతరం ఆమె రాజకీయాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఆమె కూడా పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే 14సార్లు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు సార్లు మాత్రమే మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించడం గమనార్హం.
1999లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి..
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న స్వర్ణకుమారి 1999లో రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఉద్యోగం వదులుకుని వచ్చినా ఆమెను ప్రజాప్రతినిధిగా పదవీ వరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment