మహిళలకు రక్షణ కల్పించాలి
కర్నూలు(న్యూసిటీ): మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ డిమాండ్ చేశారు. కర్నూలు నగర శివారులో శుక్రవారం శ్రావణి అనే యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళలపై హత్యాచారాలు, వేధింపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులపై నిర్భయ చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, నగర సహాయ కార్యదర్శి ఉమాదేవి, అరుణ, రషీద, షెహెనాజ్, తదితరులు పాల్గొన్నారు.
నిందితుడిని ఉరి తీయాలి..
శ్రావణి హత్యకు కారకుడైన నిందితుడిని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆ సంఘం ఆధ్వరం్యలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఆ సంఘం నగర కార్యదర్శి వి.మల్లికార్జున, నాయకులు రవి, శశి, ఇమామ్, వీరాంజనేయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో..
శ్రావణిని హతమార్చిన నిందితుడని శిక్షించాలని కోరుతూ జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మద్దమ్మ మాట్లాడుతూ కర్నూలు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ, ఐకేపీ డీపీఎం వసంతకుమారి, జయంతి, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.