దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది.
దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు.
అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి.
పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది.
బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్‌లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది.
మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే.
నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు.
రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం.
కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి.
ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య.
చట్టాలు చేస్తే చాలా?
Published Wed, Sep 4 2024 11:46 PM | Last Updated on Wed, Sep 4 2024 11:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment