
బనేశ్వర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలపై సీఆర్‌పీఎఫ్ దళాలు పశ్చిమబెంగాల్‌లో అరాచకం సృష్టిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్ బీజేపీ సంస్థలా వ్యవహరిస్తోందన్నారు. ఓటర్లను భయపెడ్తున్నాయని, మహిళలను వేధిస్తున్నాయని, పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా ఓటర్లను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సీఆర్‌పీఎఫ్ అంటే తనకు గౌరవమని, అయితే, అందులోని కొందరు అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మమత బుధవారం కూచ్‌బిహార్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడి నుంచి, పుల్వామాలో ఉగ్రవాదుల దాడి నుంచి భద్రతా బలగాలను కాపాడలేకపోయిన అమిత్ షా.. ఓట్ల కోసం కేంద్ర బలగాలను వాడుకుంటున్నారని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు 200కి పైగా సీట్లు రావాలని, లేదంటే పార్టీలోని ద్రోహులను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి, వారి పార్టీలోకి తీసుకువెళ్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరించకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మహిళలు, బాలికలపై కేంద్ర బలగాల వేధింపులను అడ్డుకోవాలని ఈసీని అభ్యర్థించారు. తారకేశ్వర్‌లో సోమవారం ఒక పాఠశాల విద్యార్థినిని కేంద్ర బలగాలకు చెందిన ఒక జవాను వేధించడంతో, ఆ జవానును ఈసీ విధుల నుంచి తొలగించింది. ఆరామ్‌బాఘ్‌లో టీఎంసీ అభ్యర్థిని సుజాత మొండల్‌పై బీజేపీ శ్రేణుల దాడిని ప్రస్తావిస్తూ. రాష్ట్రంలోని కొందరు పోలీస్ అధికారులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment