కష్టమేనా ఉత్సవం! | womens day special story | Sakshi
Sakshi News home page

కష్టమేనా ఉత్సవం!

Published Wed, Mar 8 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

కష్టమేనా ఉత్సవం!

కష్టమేనా ఉత్సవం!

ఆ పూటకు కూలి దొరికితే ఉత్సవం! క్షేమంగా ఇంటికి తిరిగి రాగలిగితే ఉత్సవం! బయట వేధింపులు లేకపోతే ఉత్సవం! ఇంట్లో సాధింపులు లేకపోతే ఉత్సవం!‘మహిళా దినోత్సవం అంటే మీకు తెలుసా?’ అనిసాక్షి ‘ఫ్యామిలీ’ అడిగినప్పుడు దాదాపుగా మహిళలంతా..ఇదిగో... ఈ ఉత్సవాల గురించే మాట్లాడారు!!అవి కాదు ఉత్సవాలు... అసలివి ఉత్సవాలే కాదు... అని చెప్పడానికి‘సాక్షి’ వారిని కదిలించింది. వారి మనోభావాలకు కదిలిపోయింది.ఆడబిడ్డ పుట్టడమే ఒక ఉత్సవంలా...ఆమె స్వేచ్ఛగా ఎదగడమే ఒక మహోత్సవంలా..ప్రతి ఇల్లూ కళకళలాడే రోజులు రావాలని సాక్షి మనసారా ఆకాంక్షిస్తోంది.

ఏడ్వని రోజు లేదు!
మరో జన్మంటూ ఉంటే మగవాడిగా పుట్టాలని కోరుకుంటున్నాను. నేను పుట్టినప్పుడే తండ్రిని, తల్లిని కోల్పోయా! అవ్వ అష్టకష్టాలు పడి పెళ్లి చేస్తే కొద్ది రోజులకు భర్త విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు కూలీనాలీ చేసుకుని జీవితం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆడదానిగా పుట్టినందుకు చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు ఆడదానిగా పుట్టానని ఏడవని రోజు లేదు. మగవాడిగా పుడితే బాగుండునని చాలాసార్లు అనుకున్నాను.  మహిళా దినోత్సవం గురించి తెలియదు.. దాని గురించి ఎప్పుడూ వినలేదు. చెప్పేవారు కూడా లేరు.
– తోట శ్రీదేవి, ఓడెడ్, ముత్తారం

గొప్పగా అనిపిస్తోంది!
ఆడదానిగా పుట్టడం నిజంగా గొప్ప జన్మే. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఇంటి బాధ్యతలు తప్పవు. ఒళ్లు బాగాలేకపోయినా ఇంటి పని తప్పనప్పుడు మాత్రం అబ్బాయిగా పుట్టి ఉంటే ఈ కష్టం ఉండేది కాదు కదా అనిపిస్తుంటుంది. మహిళలూ, మగవాళ్లూ సమానమే అంటుంటారు. వింటుంటాం. కానీ మాకిచ్చే కూలీ మాత్రం తక్కువే. రోజంతా మగాళ్లకంటే ఏ మాత్రం తక్కువ కాకుండా కాయకష్టం చేసి తక్కువ కూలి తీసుకునేటప్పుడు బాధనిపిస్తుంది. మహిళాదినోత్సం ఏంటో తెలియనే తెలియదు.
– బాడు మంగమ్మ, కమ్మరి, సైదాపురం, నెల్లూరు జిల్లా

స్త్రీగా జన్మించినందుకు గర్విస్తున్నా!
కొన్నేళ్లుగా ఊళ్లోనే కుట్టుమిషతో కుటుంబాన్ని నడుపుతున్నాను. నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు కుట్టు మిష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇద్దరు పిల్లల చదువుకుంటున్నారు. ఏదో పని నేర్చుకొని సంపాదనలో పడితే మనకే ఎంతో భరోసాగా అనిపిస్తది. అదే మహిళావిజయం అంటే!
– ఫర్జానాబేగం, మదనాపురం, వనపర్తి జిల్లా

కష్టంలనే ధైర్యం వస్తది     
పెళ్లయ్యాక ఇంటిపట్టునే ఉండేదాన్ని. మా ఆయన కొబ్బరి బోండాల వ్యాపారం చేసేవాడు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన... లారీ యాక్సిడెంట్‌ అయ్యి చనిపోయుండు. వెనకా ముందు ఆదుకునేవారు లేరు. తెలియని వ్యాపారమే అయినా ధైర్యం చేసిన. పిల్లలు నేను బతకాలంటే తప్పదు కదా! ఈ వ్యాపారం జేయబట్టి ఎనిమిదేళ్లు. ఇప్పుడు పిల్లలు మంచిగ చదువుకుంటున్నరు. ఆడదాన్ని అయితే ఏం. కష్టంల నుంచే «ధైర్యం పుట్టుకవస్తంది. మహిళాదినోత్సవం అంటే ఏం జేస్తరు?
– దుర్గ, కొబ్బరి బొండాల వ్యాపారి, హైదరాబాద్‌

అడవిల మానై పుట్టినా మంచిగుండేది...
ఆడదానిగ పుట్టేకన్నా అడవిల మానై పుట్టుడు మంచిదని మా అమ్మోళ్లు అనడం నా చిన్నప్పటి నుంచి ఇనేదాన్ని. అది నిజమని ఇప్పుడు నాకూ అనిపిస్తుంది. పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి ఈ ఫుట్‌పాత్‌ మీద బొమ్మలు పెట్టుకుని కూసుంట. మళ్ళీ రాత్రి ఎనిమిదింటికే ఇంటికి పోత. బొమ్మలమ్మితే ఒకనాడు వంద రూపాయలొస్తయి. ఒక రోజు రూపాయి కూడా రాదు. అప్పుడప్పుడు నాకు ఫిట్స్‌ వస్తవి. దావఖానల చుట్టు తిరిగిన ఏం ప్రయోజనం లే! నా సావుతోనే ఆ రోగం కూడా పోతదేమో. మా అమ్మనాన్నకు నేను, మా అన్న సంతానం. మా అందరిదీ బొమ్మలు అమ్ముకుని పొట్టపోసుకునే పని. మా ఇద్దరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. మా ఆయన యాక్సిడెంట్‌ అయ్యి సచ్చిపోయుండు. అప్పుడు నా బిడ్డకు 3 నెలల వయసు. ఇప్పుడు పదో తరగతి చదువుతోంది. బొమ్మలు అమ్ముకుంటూ, కూతురును చదివించుకుంటూ వయసు మీద పడిన అమ్మనాయనను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న. మా అన్న కూడా అనారోగ్యం చేసి సచ్చిపోయుండు. సమాజంల ఆడోల్ల పరిస్థితి అంత బాగలేదు. అందుకే నా బిడ్డకు ఈ యేడు పెండ్లి జేయాలనుకుంటున్న. నా బాధ్యత కూడా తీరిపోద్ది కదా! ఉన్నోళ్లకు మహిళాదినోత్సవాలు, మాకేం ఉంటాయి.
– రమణ, బొమ్మల వ్యాపారి, సికింద్రాబాద్‌

కష్టాలు తప్పవు
ఆడదాన్ని కాబట్టి కష్టాలు తప్పవు. భర్త మీద ఆధారపడితే జీవితం సాగదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆడదైనా, మగాడైనా కష్టపడాల్సిందే. ఇద్దరం బాధ్యత తీసుకుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. ఆడదానికి బయటపనితోపాటు ఇంటి పని తప్పకపోవడంతో కుదేలవుతోంది. ఇక మహిళా దినోత్సవం గురించి నాకు తెలీదు. ఎప్పుడూ వినలేదు.
– నాగమణి, కుండల వ్యాపారి, అనంతపురం

గర్వంగా ఉంది!
మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది. అన్నింటికి ఆడదే ఆధారం. ఆడది లేకుంటే ఈ సృష్టిలో ఏదీ లేదు. అబ్బాయిగా పుట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే... మహిళగా పుట్టాక కుటుంబంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ మామూలే కదా? ఇన్నేళ్లలో నేనెప్పుడూ మహిళాదినోత్సవం అనేది ఒకటుందని వినలేదు. దానిని మార్చి 8న నిర్వహిస్తారని కూడా తెలియదు.
– బి. శివపార్వతి స్కూలు ఆయా, గుడివాడ

... తెలుసు... కానీ!
మహిళగా పుట్టినందుకు సంతోషంగా ఉంది. అబ్బాయిగా పుట్టి ఉంటే బావుండేదనే తలంపు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలగలేదు. మహిళ అయినందు వల్ల ఎదుర్కొన్న సమస్యలు నాకెప్పుడూ ఎదురవనే లేదు. మహిళా దినోత్సవం గురించి పేపర్లలో చదివాను, టీవీలో చూశాను. ఈ కార్యక్రమం మార్చి ఎనిమిదవ తేదీనే ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియదు.
రుద్ర మహాలక్ష్మి రాజమండ్రి

శ్రమను నమ్ముకున్న
ఆడదానిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. ఆడ మగ అనే భేదం ఉండకుండా సమానంగా చూడాలి. కానీ ఇప్పుడు అలా ఎక్కడా లేదు. నేను ఎంచుకున్న వ్యవసాయ రంగం లో మగాళ్లకు దీటుగా పనిచేస్తున్న. మహిళల ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మగవారే. తలపెట్టిన అన్ని కార్యాల్లో అడ్డుతగులుతుంటారు. ఆడది ఆడదానిలా ఉండక మగరాయుడిలా పనిచేస్తది అని అంటరు. కాని నేను ఇవేమీ పట్టించుకోను. గెలిచి సత్తాచాటలన్నదే లక్ష్యం. నేను బతుకుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తాను.
– నక్క అమ్మాయమ్మ, రైతు

కష్టాల కడలి ఈదుతున్నాను
మహిళా పుట్టినందుకు పుట్టెడు కష్టాలు అనుభవిస్తూ కష్టాల కడలి ఈదుతున్నాను. తాగుడుకు బానిసైన నా భర్త సంపాదనంతా అతడి తాగుడుకే సరిపోతుంది. కుటుంబాన్ని నేనే పోషించాలి. తెల్లారి 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడితే కాని కుటుంబ పోషణకు సరిపడా డబ్బు రాదు. స్త్రీగా పుట్టి నేనేం సుఖపడుతున్నాను. నా భర్తను చూసినప్పుడల్లా మగాడిగా పుట్టి ఉంటే బావుణ్ననిపిస్తుంటుంది. బరువు, బాధ్యత లేకుండా పొద్దస్తమాను తాగుతూ తిరుగుతుంటాడు. అమ్మగా బిడ్డలకు జన్మనిచ్చినందుకు వారిని పోషించుకోవాల్సిన బాధ్యత నా మీద పడింది.

అదే మొగాడిగా పుడితే బరువు, బాధ్యలుండవు కదా. నా వంటి పేద కుటుంబంలో పుట్టిన ప్రతి స్త్రీ కష్టాలు అనుభవిస్తుంది. భర్త కొట్టినా తిట్టినా వాడితోనే ఉండాలి. విడిపోయే అవకాశం పెద్దకుటుంబాల్లో ఉన్నట్టు మాకు ఉండదు. కుల కట్టుబాట్లు తప్పక పాటించాలి. స్త్రీగా పుట్టడం వల్ల సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ. మహిళా దినోత్సవం అన్నదాన్ని ఇంతవరకు వినలేదు. ఇవన్నీ గొప్పోళ్లు చేసుకునే పండగలు, నాలాంటి పేదదానికి కుటుంబమే కైలాసం. ఇటువంటి దినాలు ఎప్పుడు వినలేదు. ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు.
–  కల్లేపల్లి లక్ష్మి, చేపల వ్యాపారి, విశాఖపట్టణం

నా చిన్నప్పుడు అనుకున్నా...
నేను రోజూ కూలీకి వెళ్ళాల్సిందే. ఒకరోజు పనికెళ్లకపోతే ఇల్లు గడువదు.  మా అమ్మనాన్న మా తమ్ముడునీ గరాబంగా పెంచారు. నన్ను బడికి కూడ పంపలేదు.  అప్పుడనిపించేది అబ్బాయిలా పుడితే బాగుండేదని. నా భర్త ఒక్కడు పని చేస్తే వచ్చే డబ్బులు కుటుంబ పొషణకు సరిపోవడం లేదు. నాకు కష్టమైనప్పటికి తట్టలెత్తడం తప్పడం లేదు. ఈ పని చేయాలంటే ఆరోగ్యం ఉండాలి. వయసు మీద పడిన కొద్ది ఈ పని చేయలేకపోతున్నా. – మిరియాల సరోజన, భవన నిర్మాణ కార్మికురాలు, భూపాలపల్లి

రాళ్లు కొడుతున్నాం.. మోస్తున్నాం!
స్త్రీగా పుట్టినందుకు సంతోషంగా ఉంది. కానీ అప్పుడప్పుడూ అబ్బాయిగా పుట్టి ఉంటే బావుండని కూడా అనిపిస్తుంటుంది. మహిళ అయినందువల్ల ఎదుర్కొంటున్న కష్టం మమ్మల్ని చులకనగా చూడడమే. రాళ్లు కొడతాం, ఆ తర్వాత లారీలో నింపుతాం. ఇంత కష్టం పడడం మాకేమీ భయంగా లేదు, ధైర్యంగానే ఉంది. ఆడోళ్లం మా కష్టం మేము చేసుకుంటాం. మా పొట్ట మేము నింపుకుంటాం. ఎవరి దయాదాక్షిణ్యాలూ మాకక్కరలేదు. చులకన చూపులు, తక్కువ చేయడం మానుకుంటే చాలు. మహిళాదినోత్సవం అంటే ఏంటో మాకస్సలే తెలియదు.
– రమణమ్మ, పేర్నమిట్ట

చదువుకోవాలని ఉండేది!
మహిళగా పుట్టడం అదృష్టం. చదువుకోవాలని ఉన్నా నన్ను చదివించలేదు. ‘బయటకు వెళ్లకు, అక్కడికివెళ్లకు’ అనే ఆంక్షలు పెట్టినపుడు అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుండనిపించేది. నేను ఆ రోజుల్లోనే మా కాఫీ హోటల్‌ కౌంటర్‌లో కూర్చునేదాన్ని. మగరాయుడల్లే చేస్తోందనే వాళ్లు. మహిళా దినోత్సవం అని పేపర్‌లో చదవడమే, కానీ పెద్దగా అవగాహన లేదు. మహిళలకు రక్షణ కవురువైందనేది మాత్రం ఎవ్వరూ కాదనలేని పరిస్థితి.
– గుమ్మలూరి రుక్మిణి, గృహిణి, శ్రీకాకుళం

రెక్కల కష్టం తప్పదుగా!
రెక్కల కష్టం మీద బతకడం సంతోషంగా ఉంటుంది. వంటింటి కుందేలుగా ఉంటే ఏమీ సాధించలేదని బాధ ఉంటుంది. భర్తకు చేదోడుగా ఉన్నాను. అబ్బాయిగా పుడితే బావుండని ఎప్పుడూ అనిపించలేదు. ఎలా పుట్టినా బాధలు తప్పవు. కష్టపడనిదే జీవితం సాఫీగా సాగదు. మహిళాదినోత్సం అంటే ఏమిటో తెలియదు. టీవీల్లో అప్పుడప్పుడూ వింటుంటాను. పేపర్లలో ఫొటోలు చూస్తుంటానంతే.
– మానుకొండ ఝాన్సీరాణి, కూరగాయల వ్యాపారి, తెనాలి

మగాళ్లకు ఇన్ని బాధలుండవు
నలుగురు పిల్లలని పోషించేందుకు జీవితం అంతా సరిపోయింది. ఇంటాబయటా అన్ని సమస్యలే.  మగాళ్లకు ఇన్ని బాధలెందుకు ఉంటాయి..? ఆడపిల్ల సమస్యలను అలవాటు చేసుకుని బతికేయాల్సిందే. నేతకార్మికుడిగా ఆయన, బీడీ కార్మికురాలిగా నేను కష్టపడితే తప్ప పిల్లలని చదివించుకోలేకపోయాను. ఇపుడు కొంచెం ఫర్వాలేదు. మహిళలకు ఓ రోజు ఉందని తెలియదు.
– అంబాల దేవలక్ష్మి, గృహిణి, సిరిసిల్ల

పైసల కాడ తేడా!
ఇదీ కష్టం అని ఒకటంటే చెప్పుకుంటం. ఎన్నని చెప్పుకుంటం. ఆడదానిగా పుట్టినందుకన్నా ఆడ పని, మగ పని అని విడదీసి జీతంలో తేడా చూపిస్తరు. ఇలాంటప్పుడే బాదనిపిస్తది. ఆడదానిగా కష్టాలోచ్చినప్పుడల్లా మగవాడిగా పుడితే బాగుండేది కదానిపిస్తది. ఆడోళ్లకు ఓ రోజు ఉందని తెలియదు. రోడ్లు ఊడ్చి బతికేటోళ్లం మాకేం తెలుసు.
– బరిగెల దేవేంద్ర, కార్మికురాలు, మామూనూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement