ఆగని వేధింపుల పర్వం | Women Harassment Cases in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆగని వేధింపుల పర్వం

Published Thu, Mar 7 2019 10:45 AM | Last Updated on Thu, Mar 7 2019 10:45 AM

Women Harassment Cases in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మహిళలపై వివిధ రకాల వేధింపులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వేధింపులపై 2016లో 12,80 కేసులను షీ బృందాలు నమోదు చేశాయి. 2017లో 16,94 కేసులు నమోదు కాగా.. 2018లో 18,80 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పని చేస్తున్న మహిళల్లో 80 శాతం మంది వేధింపులకు గురవుతున్నట్లు షీ బృందాల అధ్యయనంలో తేలింది. మిగతా 20 శాతం మందిలో రిటేల్‌ దుకాణాల్లో పనిచేసేవారు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగినులున్నట్లు స్పష్టమైంది. మీటూపైనా మహిళలు మౌనం వహిస్తున్నట్లు షీబృందం అధ్యయనంలో వెలడవ్వడం గమనార్హం. 

ఇదో మచ్చుతునక..  
‘ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ప్రణతి (పేరు మార్చాం) తన టీం లీడర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమె తన ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చింది.’ ప్రస్తుతం ఈ కేసు పురోగతిలో ఉంది. తాను ఆరు నెలలుగా ఉద్యోగంలో లైంగిక వేధింపుల కారణంగా నరకం అనుభవించినట్లు ఆమె తెలిపింది. తన టీం లీడర్‌ పనివేళలు ముగిసిన తర్వాత కూడా లేట్‌నైట్‌ ఆఫీసులో ఉండాలని వేధించారని.. తన వాంఛలు తీర్చాలని కోరినట్లు వేధించినట్లు తెలిపింది’

భాగ్యనగరంలో పరిస్థితి ఇలా..
వేధింపుల విషయంలో 70 శాతం మంది మహిళలు సామాజిక కట్టుబాట్లు, భయం కారణంగా ఫిర్యాదుకు ముందుకు రావడంలేదు
30 శాతం మంది వేధింపులపై ఫిర్యాదు చేసిన వెంటనే తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు
వేధింపులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలన్న విషయంపై మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంలేదు
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి లోకల్‌ కంప్లైంట్‌ కమిటీని ఆయా కంపెనీల యాజమాన్యాలు ఏర్పాటు చేయడంలేదు   
2018లో లోకల్‌ కంప్లైట్‌ కమిటీలకు నగరంలో కేవలం మూడు ఫిర్యాదులు మాత్రమే అందాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు
అన్ని రకాల వేధింపులపై లోకల్‌ కంప్లైట్‌ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరుతో పాటు ఈ– మెయిల్‌ ద్వారానూ ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలి
పనిప్రదేశంలో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు గ్రేటర్‌లో మహిళలు ముందుకు రావడంలేదు.   
నగరంలోని ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత, పనిచేసే వాతావరణం కల్పించాలి
  ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేధింపులపై ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీపై కంపెనీ ఉన్నతాధికారులు అజమాయిషీ చేయవద్దు  
ఆయా కార్యాలయాల్లో మహిళలు తమకు ఎదురవుతున్న సమస్యలు, వేధింపులు, సవాళ్లపై ధైర్యంగా ముందుకొచ్చేలా సుహృద్భావ వాతావరణం కల్పించాలి  
మహిళలపై వేధింపుల నిరోధానికి స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వం, పోలీసులు సమన్వయంతో పనిచేయాలి

ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి
మహిళలను గౌరవించడం అనే సంస్కారం ప్రతి ఒక్క ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసినా సమాజంలో మార్పు రానిదే అవేవీ సత్ఫలితాన్నివ్వవు. వేధింపులను నిరోధించేందుకు ప్రతిఒక్కరూ సంఘటితంగా పోరాడాలి. మహిళలకు భరోసా కల్పించాలి. మహిళలపై అన్ని రకాల హింస, వేధింపులకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పనిచేయాలి.– శ్రావ్యారెడ్డి,వీఅండ్‌షీ ఫౌండేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement