రేపటికి ముందడుగు | Interview with Superstar Krishna's daughter Manjula | Sakshi
Sakshi News home page

రేపటికి ముందడుగు

Published Wed, Mar 8 2017 12:04 AM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

రేపటికి ముందడుగు - Sakshi

రేపటికి ముందడుగు

మహిళను గౌరవించడానికి ఒక ‘డే’నా!
ఒక జన్మ కూడా సరిపోదు.
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
ఈ ఒక్క రోజు నాలుగు చప్పట్లు కొట్టి
రేపటి నుంచి ఇష్టానుసారంగా ఉండటం...
ఇవాళ్టి అబద్ధాన్ని ఒక జన్మంతా సాగదీయడమే.
అసలు మహిళలకి మగాడు మర్యాద ఇవ్వడమేంటి?
అతడికి జన్మను ఇచ్చిందే ఒక మహిళ.
మహిళ ఆత్మ గౌరవాన్ని తగ్గించకుండా ఉంటే చాలు.
మహిళ విజయాలకు వంకలు పెట్టకుండా ఉంటే చాలు.
సామర్థ్యాలను సమాధి చేయకుండా ఉంటే చాలు.
మగాడి జీవితానికి బొడ్డుతాడు అయిన ఈ మహోన్నత శక్తిని నులిమేయకుండా ఉంటే చాలు.
తన మనుగడను తను తెంచుకోకుండా ఉంటే చాలు!


నటి... సూపర్‌స్టార్‌ కృష్ణ కుమార్తె... మంజులతో ఇంటర్వ్యూ
అసలు ఎక్కడా కనిపించడం లేదు.. ఏం చేస్తున్నారు?
మాతృత్వం గొప్ప వరం. అందుకే కూతురు పుట్టాక బ్రేక్‌ తీసుకున్నా. ఇన్నేళ్లూ మదర్‌హుడ్‌ని ఆస్వాదించాను. ఎదిగే పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఉంటుంది. అప్పుడు పిల్లలపై మన ప్రేమ తప్పక చూపించాలి. నేనదే చేశా. ఇప్పుడు నా కూతురి వయసు పదేళ్లు. ‘అమ్మా... నాతో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయకు. వర్క్‌ చూసుకో’ అని తనే అంటోంది. సో, ప్రొఫెషనల్‌ లైఫ్‌ స్టార్ట్‌ చేసే టైమ్‌ వచ్చింది. ఓ మూవీ డైరెక్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నా.

ఇవాళ ‘ఉమెన్స్‌ డే’ కాబట్టి, దాని గురించి మాట్లాడుకుందాం. మహిళగా పుట్టినందుకు మీరెలా ఫీలవుతున్నారు?
లక్‌లా భావిస్తున్నా. మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువ అనే అంశం జోలికి వెళ్లదలచుకోలేదు. అలాంటి వాదన నాకిష్టం ఉండదు. ‘ఎంతో పుణ్యం చేస్తే మహిళగా పుడతారు’ అని దలైలామా, ఓషో వంటి ఆధ్యాత్మిక గురువులు అన్నారు. ఉద్వేగం, సున్నితత్వం, ఆవేశం, జాగ్రత్త.. వంటివన్నీ మహిళలకు ఎక్కువ. మగవాళ్లు కూడా మహిళల నుంచే పుడతారు. అది సహజమైన ప్రక్రియ. మహిళగా పుట్టినందుకు ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపపడింది లేదు.

స్త్రీ ‘తక్కువ’... పురుషుడు ‘ఎక్కువ’ అనే సమాజం ఇది. ఈ పరిస్థితిలో ఓ స్త్రీ ఆత్మవిశ్వాసంగా బతకాలంటే ఏం చేయాలి?
నేను ఫీలయ్యేది ఏంటంటే... మనకి మనమే (మహిళలు) ఎక్కడో చిన్న భయాలు, ఓ రకమైన ఆలోచనలతో ఒకదానికి కట్టుబడిపోతున్నాం. కొందరు మహిళలు వాళ్లను వాళ్లే తక్కువ చేసుకుంటారు. ‘మనం ఎక్కువ’ అనే ఫీలింగ్‌ ఇన్‌సెక్యూర్టీని పోగొట్టి, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మహిళలకు అడ్డంకులు ఉన్నాయి. కాదనడం లేదు. ఏది ఏమైనా అమ్మగా, వర్కింగ్‌ విమెన్‌గా... రెంటినీ బ్యాలెన్స్‌ చేసుకోగల సామర్థ్యం మహిళలకే ఉంది. మనకు ‘సూపర్‌ పవర్స్‌’ ఉన్నాయి. ఇంటినీ, జాబ్‌నీ బ్యాలెన్స్‌ చేసుకోవడం మగవాళ్ల వల్ల కాదు. మనల్ని మనం తక్కువగా ఊహించుకోకుండా ఉంటే ‘మగవాళ్లు ఎక్కువ’ అనే ధోరణిలో మార్పు తీసుకురాగలుగుతామని నా నమ్మకం.

మగవాడు ఇంటి పనులు చేయకూడదని కొందరి మగవాళ్లల్లో ఉంటుంది.. కొందరు ఆడవాళ్ల ఫీలింగ్‌ కూడా అదే...
కరెక్ట్‌గా అన్నారు. ట్రెండ్‌ మారింది. ఇప్పుడు మగవాళ్లు కూడా ఇంటి పనుల్లో హెల్ప్‌ చేయడానికి ముందుకొస్తున్నారు. మహిళలుగా వాళ్లకు ఆ ఛాన్స్‌ మనమే ఇవ్వాలి. కొందరు... ‘వద్దండీ. మీకెందుకు శ్రమ’ అంటారు. మగాళ్ల కంటే మనమే ఎక్కువ ఇదైపోతుంటాం. మనకూ ఈక్వల్‌ ఇంపార్టెన్స్‌ ఉండాలని మనం ఫీలవ్వాలి. అది లేనిదే ఏం చేయలేం. ఇప్పుడు మగవాళ్లు మారుతున్నారు. మా ఆయన మా అమ్మాయి డైపర్స్‌ ఛేంజ్‌ చేసేవారు. స్టడీస్‌ దగ్గర్నుంచి అమ్మాయి విషయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. పిల్లల బాగోగులు చూసుకోవడం తండ్రులకు లభించే గొప్ప గిఫ్ట్‌. ఐయామ్‌ నాట్‌ గుడ్‌ ఎట్‌ సీయింగ్‌ అకడమిక్స్‌. ఆయనే చూసుకుంటారు.  
     
కృష్ణగారి కూతురు కావడంతో ఫ్యాన్స్‌ మిమ్మల్ని హీరోయి న్‌ని కానివ్వలేదు. అమ్మాయిని కాబట్టి ప్రొఫెషన్‌ని ఎంచుకునే ఫ్రీడమ్‌ లేకుండాపోయిందని బాధగా అనిపించిందా?

అప్పుడు అనిపించింది. ఫ్రీడమ్‌ లేదా? అనుకున్నా. నేను అనుకుని ఉంటే అభిమానులను ఎదిరించి సినిమాలు చేసుండొచ్చు. కానీ, ఆలోచించా. ఓ మహిళగా కుటుంబ గౌరవం, పేరు మన చేతుల్లో ఉంటాయి. మన కల్చర్‌ చాలా డిఫరెంట్‌. ఫ్యాన్స్‌ నాన్నగారిని చాలా ప్రేమిస్తారు.  ‘హీ ఈజ్‌ ద కింగ్‌. ఇది ఆయన కింగ్‌డమ్‌’. నేను దాన్ని పూర్తిగా గౌరవిస్తా. అందుకే నేను కూడా ఫ్యాన్సే రైట్‌ అనుకున్నా. ఎందుకంటే... దర్శకులు వచ్చి కథలు చెప్పినప్పుడు... ‘నేను ఇది చేయను, అది చేయను’ అని చెప్పేదాన్ని. కొన్ని పాత్రలకే పరిమితం కావాలనుకున్నప్పుడు చేయకపోవడమే బెటర్‌. యాక్చువల్లీ నేను యాక్ట్‌ చేస్తానన్నప్పుడు నాన్నగారు హండ్రెట్‌ పర్సెంట్‌ హ్యాపీగా లేరు. నా ఇష్టాన్ని కాదనలేక ‘యస్‌’ చెప్పారు. ఫ్యాన్స్‌ ఆక్షేపించినప్పుడు ఓ పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పుడు కొన్ని పాటించాలని, ఫ్యామిలీ గౌరవ మర్యాదలను స్పాయిల్‌ చేయకూడదని అర్థమైంది. అందుకే నా అంతట నేను మానుకున్నా. అయినా అప్పుడు చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్‌ కూడా లేవు. ఇప్పుడు పరిస్థితి మారింది.

ఆ టైమ్‌లో ఎప్పుడైనా నేను అబ్బాయిగా పుట్టి ఉంటే నచ్చిన ప్రొఫెషన్‌లో సెటిలై ఉండేదాన్నని అనిపించిందా?
అస్సలు లేదండి. మా అమ్మ, అమ్మమ్మ ‘నువ్‌ మగాడిగా పుట్టుంటే ఈపాటికి ఇండస్ట్రీ అంతా ఏలేసేదానివి’ అనేవారు. నేను నవ్వేదాన్ని. అప్పుడు కూడా నాకు అబ్బాయిగా పుడితే బాగుండేదని అనిపించలేదు.
   
‘నిర్భయ’ వంటి ఘటనలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

చాలా డిస్ట్రబ్‌ చేస్తాయి. మహిళగానే కాదు... మానవత్వపు దృష్టితో చూసినా చాలా విచారకరమైన ఘటన. ఓ మనిషి అంత క్రూరంగా ఎలా చేస్తాడు? ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది? ఆ ప్రాణం ఎంత విలవిలలాడి ఉంటుంది? రక్త–మాంసాలతో పుట్టిన సాటి మనిషిగా ఆ బాధను గ్రహించలేరా? ఒకప్పుడు మంచి మనుషులు ఉండేవారు. రాముడు తదితరుల గురించి చెబుతారు కదా! మళ్లీ ఆ రోజులు రావాలి. కఠినమైన శిక్షలు వేయాలి లాంటివి చెప్పను. శిక్షలు కూడా మార్చలేవు. ‘మంచితనం’ పెంచుకోవాలి. అందుకే, ‘మూర్ఖత్వపు మనుషులు మాకు వద్దు. వాళ్ల నుంచి మమ్మల్ని బయటకు తీసుకురా. మనుషుల్లో మంచిని మాత్రమే ఉంచు. నీచపు స్థితికి దిగజారనివ్వకుండా ఉన్నత స్థితికి తీసుకువెళ్లు’ అని మనందరం దేవుణ్ణి ప్రార్థించాలి. మనందరం మంచోళ్లం అయిపోవాలి. అదొక్కటే మార్గం. మనం మారి, ప్రేమతో సమాజంలో మార్పు తీసుకురావాలి. ప్రేమను పంచాలి.  

ఇటీవల తమిళ హీరో శరత్‌కుమార్‌ కూతురు వరలక్ష్మి దగ్గర ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. బ్యాగ్రౌండ్‌ ఉన్న సెలబ్రిటీలకూ వేధింపులు తప్పవా?
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరికైనా అలాంటి ఘటనలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలున్న వెధవ ఎవరైనా తగిలాడనుకోండి... వాట్‌ టు డూ! ఎలా హ్యాండిల్‌ చేయాలి? ఎలా బయటపడాలి? అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాంటోళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియాలి. అడ్వాంటేజ్‌ తీసుకోవాలనే వెధవలు ఇంచు మించు ప్రతి రంగంలోనూ ఉన్నారు. అందరిలోనూ మార్పు రావాలి. మంచిని పంచాలి. మంచి మనుషులుగా మారుతుంటే.. మనల్ని చూసి ఇంకొకరు. అలా మల్టిప్లై అయ్యి లోకమంతా మారుతుందని ఆశిద్దాం.

మీ రోల్‌ మోడల్‌ ఎవరు?
మా అమ్మమ్మ. ఆ ప్రేమ వేరు. (నవ్వుతూ..) నాయనమ్మకు లేదని అనడం లేదు. మా అమ్మమ్మకు అమ్మ ఏకైక సంతానం. అందుకని అమ్మమ్మ మాతోనే ఉండేవారు. నాన్నగారికి మా అమ్మమ్మ అంటే గౌరవం. అమ్మకన్నా అమ్మమ్మ స్ట్రాంగ్‌. మమ్మల్ని బాగా పెంచింది. స్కూల్‌కి వెళతాం, పాఠాలు చదువుతాం, మిగతావన్నీ నేర్చుకుంటాం. కానీ, ముందు మన బేస్‌ స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడు ఏదైనా చేయగలం అనిపిస్తుంది. నాకు ఆ బేస్‌ అమ్మ, అమ్మమ్మ దగ్గర లభించింది. ఏం నేర్చుకున్నా.. నేర్చుకోకపోయినా... ఎమోషన్, లవ్‌ అనేవి స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ ఇద్దరి దగ్గరనుంచి అవి నేర్చుకున్నాను. మా ఐదుగురు బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ను అమ్మమ్మ ఎంతో కేరింగ్‌గా చూసుకుంది. అమ్మమ్మ ఈజ్‌ వెరీ స్ట్రాంగ్‌ విమెన్‌.

డైరెక్షన్‌ చేయబోతున్నారని తెలిసి, కృష్ణగారు ఏమన్నారు?
హి వాజ్‌ సో హ్యాపీ. ముఖ్యంగా నా కథను నమ్మి, మరొకరు సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందపడ్డారు. కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తున్నానని తెలిసిన తర్వాత నాన్నగారు ఇంకా గర్వంగా ఫీలయ్యారు. మహేశ్‌బాబుకు చెప్పగానే... ‘డైరెక్షన్‌ చేస్తున్నావా? వెరీ డిఫికల్ట్‌. అంత ఈజీ కాదు’ అన్నాడు. ‘అవును! నాకు ఆ సంగతి తెలుసు. బట్, నేను చేయగలనని నాకు తెలుసు’ అని చెప్పా. అప్పుడు ‘గుడ్‌... గుడ్‌. బాగా చెయ్‌’ అన్నాడు. మహేశ్‌కి భయం ఎక్కువ. తన చుట్టూ ఉన్నవాళ్లు సక్సెస్‌ కావాలని కోరుకుంటాడు. ఒకవేళ సరైన రిజల్ట్‌ రాకపోతే... ఎక్కడ డిజప్పాయింట్‌ అవుతామేమోనని ‘బీ కేర్‌ఫుల్‌’ అంటుంటాడు. ప్రతి పని పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాడు. ప్రాక్టికల్‌గా ఉంటాడు. నాన్నగారికి మహేశ్‌కి ఫుల్‌ డిఫరెంట్‌. నాలో ఇద్దరి లక్షణాలున్నాయి. అన్నయ్య రమేశ్, మా ఆయన అందరూ... సపోర్ట్‌ చేస్తారు.

మీ చుట్టూ ఉన్న మీ నాన్నగారు, బ్రదర్స్, హజ్బెండ్, బ్రదర్‌ ఇన్‌లాస్‌... అందరూ మంచోళ్లే అనుకుంటా!
అవునండీ. మా ఆయన (సంజయ్‌) చాలా మంచి వ్యక్తి. ఫ్యామిలీని చూసుకోవడంలో గానీ, ఇల్లు, పిల్లలు, ఫ్రీడమ్‌ విషయంలోగానీ... హి ఈజ్‌ అమేజింగ్‌. నాన్నగారు మహిళలను గౌరవించే విధానం, ఫ్రీడమ్‌ ఇచ్చే విధానం సూపర్‌. ఆయనెంత గొప్ప మనిషి అండి. మనీ, ఫేమ్, సక్సెస్‌ రావడం ఈజీ. కానీ, మంచి పేరు రావడం చాలా కష్టం. తెలుగువాళ్లు మొత్తం ‘కృష్ణగారు గొప్ప వ్యక్తి’ అని చెబుతారు. మహిళలు, మగవారు సమానమని నాన్న చెబుతారు. మహేశ్‌ కూడా అంతే. ఒక్క క్షణం కూడా ‘ఐయామ్‌ ద బాస్‌’ అనే తరహాలో ప్రవర్తించడు. ఫాదర్, బ్రదర్స్, హజ్బెండ్‌... ప్రతి ఒక్కరూ అంత మంచోళ్లు అవడం నా అదృష్టం. చుట్టూ మంచి వాతావరణం ఉంటే లైఫ్‌లో అద్భుతాలు సృష్టించవచ్చు.

మీరు డైరెక్షన్‌ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది?
క్యూట్‌ లవ్‌ స్టోరీ. ‘ఫస్ట్‌ మూవీ ఎప్పుడూ ఎందుకు లవ్‌ స్టోరీలు తీస్తారు?’ అని చాలామంది అడిగారు. ప్రేమ అనేది యూనివర్సల్‌ ఎసెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌. ఇదే నా మొదటి సినిమా. మంచి సినిమా చేయాలని మొదలుపెడుతున్నాను.  నా ఫస్ట్‌ లవ్‌ డైరెక్షనే. యాక్టింగ్‌లోకి ఎందుకొచ్చానంటే... నాన్నగారిని చూసి యాక్టింగ్‌ ఈజీ అనుకున్నాను. నాకూ ఈజీగా ఛాన్సులొచ్చాయి. కానీ, దర్శకత్వం అనేది జీవితాన్ని ఓ కోణంలో దగ్గరగా చూసిన తర్వాత అనుభవంతో చేయాలి. ఓ 20 ఏళ్ల అమ్మాయికి, ఆ టైమ్‌లో కష్టం అనిపించింది. ఇప్పుడు హ్యాపీగా సినిమా తీయడానికి రెడీ అయ్యాను. మనుషులు ఎలా ఉండాలనుకుంటానో... అలాంటి పాత్రలు సృష్టించే ఛాన్స్‌ వచ్చింది. 20 ఏళ్ల క్రితం నేను వేరు, ఇప్పుడు వేరు. నాలో వచ్చిన పరిణతి సినిమాలో కనిపిస్తుంది. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌... ఫన్, కమర్షియల్‌ వేలో తీయబోతున్నా. కానీ, మంచి సెన్సిబిలిటీస్‌ ఉంటాయి.

మీ అమ్మాయి జాన్వీని కూడా నటింపజేస్తున్నారట?
అవునండీ. కథని మలుపు తిప్పే క్యారెక్టర్‌ తనది. పక్కనే అల్లరి చేస్తున్న కూతురితో.. జానూ... కుదురుగా కూర్చో... వన్‌ లాక్‌ రెమ్యునరేషన్‌ ఇస్తానన్నాగా... నో మమ్మీ... ఫైవ్‌ లాక్స్‌.. అంటూ అల్లరిగా చూసింది. తల్లీకూతుళ్లిద్దరూ కూల్‌గా నవ్వేశారు.


ఈ ‘ఉమెన్స్‌ డే సందర్భంగా’ నేను కోరుకునేదొక్కటే.. నాలానే మిగతా అందరి మహిళల జీవితాల్లోనూ మంచి మగవాళ్లు ఉండాలి. ఇప్పటికే మంచివాళ్లు ఉన్నారు. నెగటివ్‌ ఎనర్జీ ఉన్న ఆ మిగతావాళ్లల్లోనూ మంచి మార్పు రావాలి.

మహాత్మా గాంధీగారు నాకు ఆదర్శం. అహింసను నమ్ముతా. ఆయన మహిళల గురించి చాలా గొప్పగా చెప్పారు. ‘మహిళలకు పవర్‌ ఇచ్చినట్లయితే.. ప్రపంచం ఇంకా మంచిగా మారుతుంది’ అని ఆయనోసారి చెప్పారు.
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement