Strict Laws
-
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య. -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
రిపబ్లికన్లే అడ్డంకి
ముక్కుపచ్చలారని పసిమొగ్గలు రక్తమోడుతున్నారు. చదువులమ్మ చెట్టు నీడలోనే వారికి నూరేళ్లూ నిండిపోతున్నాయి. పదేళ్ల క్రితం శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు నుంచి నిన్నటి టెక్సాస్ ఘటన వరకు బడిలో తుపాకుల శబ్దం గుండెల్లో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఎందుకు రాలేకపోతున్నాయి ? సాటి మనుషుల ప్రాణాల కంటే మర తుపాకీలే అమెరికన్లకు ఎక్కువా? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పుల ఘటనలు జరుగుతున్నా, పాఠశాలల్లోకి దుండగులు చొరబడి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీస్తున్నప్పటికీ అగ్రరాజ్యం తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకురావడంలో విఫలమవుతోంది. దీనికి ప్రధానంగా సాంస్కృతికపరమైన, రాజకీయప రమైన కారణాలను చెప్పుకోవచ్చు. మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛతో తుపాకీ ఉండడం తమ హక్కు అని 74% మంది అమెరికన్లు భావిస్తారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడైంది. వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండాలని 26% మంది అమెరికన్లు భావిస్తారు. ప్రైవేట్ వ్యక్తులు తుపాకులు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో జనాభా కంటే ఆయుధాల సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 120 తుపాకులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉన్నట్టే. 2020 నాటికి అగ్రరాజ్యం జనాభా 33 కోట్లు ఉంటే, ఆ దేశ ప్రజల దగ్గర 40 కోట్ల ఆయుధాలున్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలని ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలు స్వరం పెంచుతున్నప్పటికీ డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విధానపరంగా విభేదాలున్నాయి. 2012 సంవత్సరంలో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలులో తుపాకీ గుళ్లకి 20 మంది చిన్నారులు బలయ్యాక 13 రాష్ట్రాలు తుపాకుల విక్రయంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అవన్నీ డెమొక్రట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలే. అదే సమయంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ప్రజలు కూరగాయలు కొన్నంత సులుభంగా తుపాకులు కొనే వెసులుబాటు ఉంది. ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం తుపాకులు తమ వెంట ఉంచుకోవచ్చునని మొదట్నుంచీ రిపబ్లికన్ల వాదనగా ఉంది. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం ‘‘ఆయుధాలు దగ్గర ఉంచుకోవడం ప్రజల హక్కు. రాష్ట్రాల భద్రత కోసం పౌర సైన్యం అత్యంత అవసరం. ఈ నియమాలను ఉల్లంఘించకూడదు’’ అని చెబుతోంది. తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఉండాలన్న డిమాండ్లు వచ్చిన ప్రతీసారి రిపబ్లికన్లు రాజ్యాంగ సవరణని గుర్తుచేస్తూ ప్రజల హక్కులు కాలరాయొద్దని గళమెత్తుతున్నారు. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టాలను నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమర్థంగా అడ్డుకుంటూ ఉండడంతో విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులోకి వస్తున్నాయి. తుపాకులపై నిషేధం విధిస్తే అమెరికన్లకు రక్షణ ఉండదని, గన్ ఫ్రీ స్కూలు జోన్స్ వల్ల ఎక్కువ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఎన్ఆర్ఏ సీఈవో వేన్ లాపీరే అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఏ సభ్యుల్లో 77% రిపబ్లికన్లే కావడం గమనార్హం. మానసిక వ్యాధికి మందు వేయాలని వాదనలు తుపాకుల నియంత్రణ చట్టాలను విమర్శించేవారు కాల్పులకు పాల్పడినవారంతా ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నవారేనని వాదిస్తున్నారు. కాల్పులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా తుపాకుల్ని నియంత్రించడం కాకుండా మతి స్థిమితంలేని వారికి చికిత్స చేయాలన్నది రిపబ్లికన్ల వాదనగా ఉంది. తుపాకుల్ని అమ్మే ముందు వారి నేర చరితను చూడాలన్న డిమాండ్లను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ► 2012 డిసెంబర్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూలు విషాదం మొదలు ఇప్పటివరకు 948 సార్లు స్కూళ్లలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ► 46 లక్షల మంది పిల్లల ఉండే ఇళ్లలో తుపాకుల్లో బుల్లెట్లు్ల లోడ్ చేసే ఉండటం అత్యంత ఆందోళనకరం. ఆ తుపాకులను తల్లిదండ్రులు జాగ్రత్త పరచకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ► పాఠశాలల్లో కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకుల్లో 68% ఇంటి నుంచి, స్నేహితులు, బంధువుల నుంచి తీసుకువచ్చినవే. ► స్కూళ్లలో జరిగే తుపాకీ కాల్పుల్లో 93% ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నవే. ► శ్వేత జాతీయుల కంటే నల్లజాతి వారే నాలుగు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
21రోజుల్లో మరణ శిక్ష
నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరూ ఆడపిల్లలే. నాకూ చెల్లెలు ఉంది. భార్య ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే నేను ఎలా స్పందించాలి? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఏరకమైన శిక్షపడితే బాధిత మహిళకు, ఆ కుటుంబానికి ఉపశమనం కలుగుతుందని మనమంతా ఆలోచించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సోమవారం మహిళలు, చిన్నారుల భద్రతపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలు ఉంటే 21 పనిదినాల్లో ఉరి శిక్ష పడేలా మహిళలు, చిన్నారుల భద్రతపై బుధవారం శాసనసభలో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘దిశ’ లాంటి ఘటనల్లో ఎలా స్పందించాలి? ‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఈ పరిస్థితులను మార్చాలని తపన పడుతూ.. ప్రస్తుతం ఉన్న చట్టంలో అవసరమైన మార్పులు చేయడానికి సూచనలు, సలహాలు అడుగుతున్నా. హైదరాబాద్‌లో దిశ ఘటన పట్ల సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాలి. 26 ఏళ్ల మహిళా డాక్టర్‌ను టోల్ గేట్‌కు సమీపంలో రేప్ చేసి, కాల్చేసిన ఘటన మనకళ్ల ముందు కనిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పడు రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? అని ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది. మన రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరిగితే మన పోలీసులు ఎలా స్పందించాలి? మనం ఎలా స్పందించాలన్న దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు, విన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత అందుకు బాధ్యులైన వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం. మన చట్టాల్లో మార్పు రావాల్సిందే ‘దిశ’ ఘటనలో తప్పు జరిగిందని మీడియా విస్తృతంగా చూపించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హేట్సాఫ్ టు కేసీఆర్, తెలంగాణ పోలీసు ఆఫీసర్స్.. అని ఈ చట్టసభ సాక్షిగా చెబుతున్నాం. సినిమాల్లో హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే.. అందరం చప్పట్లు కొడతాం. సినిమా బాగుందని చెబుతాం. కానీ నిజ జీవితంలో దమ్మున్న వాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుతో ఢిల్లీ నుంచి వస్తారు. ఇది తప్పు.. ఇలా జరక్కూడదు.. ఇలా ఎందుకు చేశారు? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి. నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష లేదు ఢిల్లీలో ఒక ఘటన జరిగితే.. ఇలాంటి ఘటన మున్ముందు జరగకూడదని నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చాం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే శిక్షలు పడాలని కోరుకున్నాం. 4 నెలల్లో తీర్పు నివ్వాలి, 4 నెలల్లో శిక్ష వేయాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఏడేళ్లయినా నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఉపశమనం కలిగేలా చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపల్లి ఎదురు చూస్తోంది. ఈ దిశగానే మన రాష్ట్రం కూడా ఆలోచిస్తోంది. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్ హ్యాండెడ్‌గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు.. దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు జరిగితే కొన్ని దేశాల్లో అయితే దోషులు కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి. వారంలో విచారణ పూర్తి కావాలి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు అలాంటి కేసులు వారం రోజుల్లోపు విచారణ పూర్తి కావాలి. ఆ తర్వాత డీఎన్ఎ రిపోర్టుల్లాంటివి పూర్తి కావాలి. మూడు వారాలు అంటే 21 పని రోజుల్లో దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితి రావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది. సోషల్ మీడియాను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పక్షపాత ధోరణితో వేరే వ్యక్తుల మీద బురద చల్లడానికి మనస్సాక్షి అనేది లేకుండా దిగజారిపోయారు. సోషల్ మీడియాలో మహిళలను రక్షించే ప్రయత్నం చేయాలి. మహిళల గురించి నెగెటివ్‌గా ఎవరైనా పోస్టింగ్ చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. అది ఉంటే తప్ప ఇలాంటివి ఆగిపోవు. ఆ దిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకు రావాలని అడుగులు వేస్తున్నాం. 354 (ఇ)ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే జీరో ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చింది. ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే కేసు నమోదు చేస్తున్నాం. అందుకే పర్మిట్ రూమ్‌లను రద్దు చేశాం మనిషి మద్యం తాగినప్పుడు ఇంగితం కోల్పోతాడు. ఇలాంటి వారు మరో నలుగురు కలిస్తే ఆలోచనలు మారతాయి. రాక్షసులు అవుతారు. ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూములు అన్నింటినీ రద్దు చేశాం. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశామని గర్వంగా చెబుతున్నాం. స్మార్ట్ ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. ఎన్ని నిషేధాలు ఉన్నా దీన్ని కట్టడి చేయలేని పరిస్థితి. పోర్నోసైట్లను బ్లాక్ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో విప్లవాత్మక బిల్లును తీసుకొస్తాం. చట్టం రూపకల్పనకు సలహాలు అడిగితే విమర్శలా? మహిళల భద్రత కోసం తీసుకొచ్చే చట్టానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని చంద్రబాబును అడిగితే ఈ ప్రభుత్వం తప్పు చేస్తోంది.. శాంతిభద్రతలు లేకుండా పోయాయని విమర్శలు చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి వేలెత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది. చంద్రబాబు పాలనలో మహిళలపై జరిగిన నేరాలను ఒకసారి చూద్దాం. ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శలే ఈ లెక్కలు. ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తాం : చంద్రబాబు మహళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తామని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి తక్షణం శిక్ష పడితే భయం ఉంటుందన్నారు. చట్టానికి సంబంధించి సలహాలు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. -
మరణశిక్షలతో నేరాలు ఆగుతాయా?
కఠిన చట్టాలున్నా వాటి అమలు సరిగ్గా జరగకపోతే లేదా అమల్లో తీవ్ర జాప్యం జరిగితే వాటి వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేందుకు అనుమతిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ నేపథ్యంలో క్రూరమైన నేరాలు జరగకుండా ఉరిశిక్షలు ఏ మేరకు హెచ్చరికలుగా నిలుస్తాయన్నది చర్చనీయాంశమవుతోంది. ఐరాసతో సహా ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు మరణశిక్షలు అమానవీయమని వీటిని రద్దు చేయాలని గట్టిగా డిమాండ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉరిశిక్షల అమలు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలోని న్యాయస్థానాల్లో కేసుల విచారణ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల నిందితులు తీవ్ర నేరాలకు పాల్పడకుండా మరణశిక్షలు నియంత్రణగా ఉపయోగపడడం లేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. 2017 ఆఖరు నాటికి భారత్‌లో 371 మంది మరణశిక్ష పడిన ఖైదీలున్నారు. వారిలో... 1991లో శిక్ష పడిన ఖైదీ కూడా ఉన్నాడు. అంటే అతడిది 27 ఏళ్ల నిరీక్షణ. 2017లో దేశవ్యాప్తంగా వివిధస్థాయిల్లోని న్యాయస్థానాలు 109 మందికి ఉరిశిక్ష విధించాయి. 2016లో ఈ సంఖ్య 149గా ఉంది. అయితే గత పధ్నాలుగేళ్లలో కేవలం నలుగురికి మాత్రమే ఈ శిక్షను అమలుచేశారు. వీరిలోనూ ముగ్గురికి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడినందుకు, ఒకరికి మాత్రమే మైనర్‌పై లైంగికదాడి, హత్యకు పాల్పడినందుకు మరణశిక్ష విధించారు. ఉరిశిక్ష పడిన 127 మంది ఖైదీల కేసుల విచారణకు అయిదేళ్లకు పైగా, 54 మందికి పదేళ్లకు పైగా, మిగతా వారికి అయిదేళ్ల వరకు సమయం పడుతోంది. ఉరిశిక్ష రద్దుకు ఖైదీలు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి తిరస్కరణకు గురవడానికి మధ్యకాలంలో 10 నుంచి 16 ఏళ్ల శిక్షను వారు అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ నిర్భయ అత్యాచారం కేసులో పడిన ఉరిశిక్షను సమీక్షించాలంటూ నలుగురిలో ఇద్దరు ఖైదీలు పెట్టుకున్న పిటీషన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకటన వాయిదా వేసింది. ఉరిశిక్షలనేవి నేరస్థులను అంతమొందిస్తాయే తప్ప నేరాన్ని కాదంటూ ఈ ఖైదీల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఎవరు జీవించాలి, ఎవరు మరణించాలి అన్న విషయాన్ని న్యాయస్థానాలు ఎలా నిర్ణయిస్తాయంటూ ప్రశ్నించారు. గత 14 ఏళ్లలో ఉరి అమలు 4 కేసుల్లోనే... 1993 నాటి ముంబై వరుస బాంబుపేలుళ్ల కేసులో 2015 జులై 30న యాకుబ్ మెమన్‌కు నాగ్‌పూర్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు పార్లమెంట్‌పై దాడి చేసులో మహ్మద్ అఫ్జల్ గురుకు 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్ జైలులో శిక్ష పూర్తిచేశారు. 2008లో ముంబైపై పాక్ ముష్కరులు ఉగ్రదాడి జరిపిన కేసులో సజీవంగా పట్టుకున్న అజ్మల్ అమీర్ కసబ్‌ను 2012 నవంబర్ 21న పుణెలోని ఎరవాడ జైలులో ఉరితీశారు. టీనేజీ అమ్మాయి అత్యాచారం,హత్య కేసులో 2004 ఆగస్టు 14న పశ్చిమబెంగాల్ లోని అలీపూర్ జైలులో ధనుంజయ్ ఛటర్జీ (42)కి మరణశిక్ష అమలుచేశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అవినీతి నిరోధానికి త్వరలో కఠిన చట్టాలు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): అవినీతిని నిరోధించడానికి కేంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కఠినమైన చట్టాలు రూపొందించిందని, త్వరలో ఇవి అమల్లోకి రానున్నాయని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ చెప్పారు. విశాఖ పోర్టు ట్రస్ట్(వీపీటీ), డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్)లలో నిర్వహిస్తున్న నిఘా వారోత్సవాల ముగింపు సభ శనివారం పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఠాకూర్ మాట్లాడుతూ అవినీతిపరులను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషిస్తున్నామన్నారు. వీపీటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీసీఐ సీఎండీ రాజేష్ త్రిపాఠి మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించి అవినీతిని అదుపు చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కమర్షియల్ ట్యాక్స్ ప్రి న్సిపల్ కమిషనర్ హరేరాం మాట్లాడుతూ అవినీతి నిరోధించేందుకు అన్ని శాఖల పని తీరు పారదర్శకంగా ఉండాలన్నారు. వారో త్సవాల్లో భాగంగా ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన చిత్ర లేఖన పోటీల్లో గెలు పొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు డి ప్యూటీ చైర్మన్ పి.ఎల్. హరనాథ్, చీఫ్ విజిలె న్స్ అధికారి వి.వి. ఎస్.శ్రీనివాస్, వీపీటీ, డీసీఐ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏఎంసీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆంధ్రా వైద్య కళాశాలలో శనివారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించారు. ఏఎంసీ, హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా చేపట్టిన ఈ వారోత్సవాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఎస్.వి.ఎస్.ఎస్.ఎస్.ప్రసాద్‌శర్మ, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.దేవి మాధవి, హెచ్‌పీసీఎల్ చీఫ్ మేనేజర్(పబ్లిక్ రిలేషన్స్) యు.ఎస్.శర్మ, చీఫ్ మేనేజర్(విజిలెన్స్) సురేష్‌బాబు, వివిధ శాఖల వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నైతిక విలువలతో పారదర్శకత పెంపు ఉక్కునగరం: ఉద్యోగుల్లో నైతిక విలువలు, సంస్థ పట్ల వైఖరి మార్పు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఎం ఎం.సి.మాథుర్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఎంపీ హాలులో జరిగిన విజిలెన్స్ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల్లో నిబద్ధత, భాగస్వామ్య వైఖరి పెంచడం వల్ల సంస్థ అభివృద్థి పథంలో నడుస్తుందన్నారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ అవినీతి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందన్నారు. ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పి.సి.మహాపాత్ర, రే చౌదరి, పి.కె.రథ్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్య వేలు చూపిస్తే మహా పాపమా?
సాక్షి, దుబాయ్: ఎదుటివారిని అవహేళన చేస్తూ మధ్య వేలును చూపించటమనేది పాశ్చాత్య దేశాల్లో కనిపించేదే. బండ బూతే అయినప్పటికీ ఆ సైగను అక్కడి ప్రజలు అంతగా పట్టించుకోరు కూడా. కానీ, సంప్రదాయలను కఠినంగా ఫాలో అయ్యే ఇస్లాం దేశాల్లో అది తీవ్ర నేరమే. ఆ పని చేశాడనే ఓ బ్రిటీష్ టూరిస్ట్‌కు ఆరు నెలల కఠినకారాగార శిక్ష విధించారు. 23 ఏళ్ల జమీల్ ముక్దుమ్ లెయిసెస్టర్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాని. ఈ ఫిబ్రవరిలో తన భార్యతో కలిసి దుబాయ్ పర్యటనకు వచ్చాడు. ఆ సందర్భంలో రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి మోటర్ బైక్‌పై జమీల్ కారు పక్కగా దూసుకెళ్లాడు. దీంతో ముక్దుమ్ అతనికి మధ్య వేలు సైగ చేశాడు. అయితే దానిపై సదరు మోటర్ బైకిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటికే ముక్దుప్ దేశం విడిచి వెళ్లిపోయాడు. తిరిగి గత వారం మళ్లీ దుబాయ్‌కి రాగా, ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అతన్ని జైలుకు పంపించారు. చివరకు బెయిల్ పై రిలీజ్ అయిన ముక్దుమ్ ఘటనపై స్పందించాడు. ‘నేనేం మహా పాపం చేయలేదు. ఇలాంటివి తరచూ ఇంగ్లాండ్ రోడ్లపై కనిపిస్తుంటాయి. ఆ మాత్రానికే జైలుకు పంపుతారా?’ అంటూ ముక్దుమ్ ప్రశ్నిస్తున్నాడు. పైగా రేపిస్టులు, మర్డర్ చేసిన వారి సెల్లో తనను ఉంచారని అతను వాపోయాడు. ట్రాఫిక్ ప్రయాణాల్లో ప్రయాణికులు విసుగు చెంది ఇలా వ్యవహరించటం సాధారణమే అయినా.. దుబాయ్ చట్టప్రకారం అలా అవమానించటం తీవ్ర నేరమేనని ముక్దుమ్ తరపున న్యాయవాది తెలిపారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జోసెఫ్ అనే యూకే వైద్యుడిని కూడా ఇలాంటి అసభ్య సైగ చేశాడన్న కారణంతోనే పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. కాగా, దుబాయ్ చట్టాలను ఉల్లంఘిస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో అలికెంట్ వాసులు(655) ప్రథమ స్థానంలోఉండగా, 524 మంది బ్రిటన్ వాసులు రెండో స్థానంలో ఉన్నారని దుబాయ్ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.