మహిళా భద్రతపై జరిగిన చర్చలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరూ ఆడపిల్లలే. నాకూ చెల్లెలు ఉంది. భార్య ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే నేను ఎలా స్పందించాలి? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఏరకమైన శిక్షపడితే బాధిత మహిళకు, ఆ కుటుంబానికి ఉపశమనం కలుగుతుందని మనమంతా ఆలోచించాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సోమవారం మహిళలు, చిన్నారుల భద్రతపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలు ఉంటే 21 పనిదినాల్లో ఉరి శిక్ష పడేలా మహిళలు, చిన్నారుల భద్రతపై బుధవారం శాసనసభలో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
‘దిశ’ లాంటి ఘటనల్లో ఎలా స్పందించాలి?
‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఈ పరిస్థితులను మార్చాలని తపన పడుతూ.. ప్రస్తుతం ఉన్న చట్టంలో అవసరమైన మార్పులు చేయడానికి సూచనలు, సలహాలు అడుగుతున్నా. హైదరాబాద్‌లో దిశ ఘటన పట్ల సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాలి. 26 ఏళ్ల మహిళా డాక్టర్‌ను టోల్ గేట్‌కు సమీపంలో రేప్ చేసి, కాల్చేసిన ఘటన మనకళ్ల ముందు కనిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పడు రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? అని ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది. మన రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరిగితే మన పోలీసులు ఎలా స్పందించాలి? మనం ఎలా స్పందించాలన్న దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు, విన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత అందుకు బాధ్యులైన వారిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం.
మన చట్టాల్లో మార్పు రావాల్సిందే
‘దిశ’ ఘటనలో తప్పు జరిగిందని మీడియా విస్తృతంగా చూపించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హేట్సాఫ్ టు కేసీఆర్, తెలంగాణ పోలీసు ఆఫీసర్స్.. అని ఈ చట్టసభ సాక్షిగా చెబుతున్నాం. సినిమాల్లో హీరో ఏదైనా ఎన్‌కౌంటర్ చేస్తే.. అందరం చప్పట్లు కొడతాం. సినిమా బాగుందని చెబుతాం. కానీ నిజ జీవితంలో దమ్మున్న వాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుతో ఢిల్లీ నుంచి వస్తారు. ఇది తప్పు.. ఇలా జరక్కూడదు.. ఇలా ఎందుకు చేశారు? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి.
నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష లేదు
ఢిల్లీలో ఒక ఘటన జరిగితే.. ఇలాంటి ఘటన మున్ముందు జరగకూడదని నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చాం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే శిక్షలు పడాలని కోరుకున్నాం. 4 నెలల్లో తీర్పు నివ్వాలి, 4 నెలల్లో శిక్ష వేయాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఏడేళ్లయినా నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఉపశమనం కలిగేలా చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపల్లి ఎదురు చూస్తోంది. ఈ దిశగానే మన రాష్ట్రం కూడా ఆలోచిస్తోంది. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్ హ్యాండెడ్‌గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు.. దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు జరిగితే కొన్ని దేశాల్లో అయితే దోషులు కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి.
వారంలో విచారణ పూర్తి కావాలి
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు అలాంటి కేసులు వారం రోజుల్లోపు విచారణ పూర్తి కావాలి. ఆ తర్వాత డీఎన్‌ఎ రిపోర్టుల్లాంటివి పూర్తి కావాలి. మూడు వారాలు అంటే 21 పని రోజుల్లో దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితి రావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది. సోషల్ మీడియాను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పక్షపాత ధోరణితో వేరే వ్యక్తుల మీద బురద చల్లడానికి మనస్సాక్షి అనేది లేకుండా దిగజారిపోయారు. సోషల్ మీడియాలో మహిళలను రక్షించే ప్రయత్నం చేయాలి. మహిళల గురించి నెగెటివ్‌గా ఎవరైనా పోస్టింగ్ చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. అది ఉంటే తప్ప ఇలాంటివి ఆగిపోవు. ఆ దిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకు రావాలని అడుగులు వేస్తున్నాం. 354 (ఇ)ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే జీరో ఎఫ్‌ఐఆర్‌ను తీసుకొచ్చింది. ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే కేసు నమోదు చేస్తున్నాం.
అందుకే పర్మిట్ రూమ్‌లను రద్దు చేశాం
మనిషి మద్యం తాగినప్పుడు ఇంగితం కోల్పోతాడు. ఇలాంటి వారు మరో నలుగురు కలిస్తే ఆలోచనలు మారతాయి. రాక్షసులు అవుతారు. ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూములు అన్నింటినీ రద్దు చేశాం. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశామని గర్వంగా చెబుతున్నాం. స్మార్ట్ ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. ఎన్ని నిషేధాలు ఉన్నా దీన్ని కట్టడి చేయలేని పరిస్థితి. పోర్నోసైట్లను బ్లాక్ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో విప్లవాత్మక బిల్లును తీసుకొస్తాం.
చట్టం రూపకల్పనకు సలహాలు అడిగితే విమర్శలా?
మహిళల భద్రత కోసం తీసుకొచ్చే చట్టానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని చంద్రబాబును అడిగితే ఈ ప్రభుత్వం తప్పు చేస్తోంది.. శాంతిభద్రతలు లేకుండా పోయాయని విమర్శలు చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి వేలెత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది. చంద్రబాబు పాలనలో మహిళలపై జరిగిన నేరాలను ఒకసారి చూద్దాం. ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శలే ఈ లెక్కలు.
ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తాం : చంద్రబాబు
మహళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తామని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి తక్షణం శిక్ష పడితే భయం ఉంటుందన్నారు. చట్టానికి సంబంధించి సలహాలు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment