దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం | AP Assembly Has Passed Andhra Pradesh Disha Bill 2019 | Sakshi
Sakshi News home page

దిశ బిల్లుకు ఆమోద ముద్ర

Published Fri, Dec 13 2019 2:56 PM | Last Updated on Fri, Dec 13 2019 3:48 PM

AP Assembly Has Passed Andhra Pradesh Disha Bill 2019 - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. బిల్లు పాస్‌ అయినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది.

అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ దిశ యాక్ట్‌పై భావోద్వేగ ప్రసంగం చేశారు. మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన వస్తే వణుకు పుట్టేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. దిశకు తగిన న్యాయం చేసిన తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి మరోసారి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని సీఎం జగన్‌ అన్నారు. నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

‘కొద్ది రోజుల కిందటనే ఈ సబ్జెక్టు మీద చర్చ జరిగినప్పుడు కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకువచ్చాం. గత ప్రభుత్వ హయాంలో రాష్టంలో క్రైమ్‌ పెరిగిపోతుంది. 2014లో 13549 కేసులు నమోదు కాగా,  2015లో13088,  2016లో13948, 2017లో 14696, 2018లో 14048 కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో అత్యధికం అత్యాచార సంబంధిత కేసులే. చిన్న పిల్లులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. దారుణ ఘటనలు నివారించాలంటే విప్లవాత్మక చర్యలు తీసుకురావాలి. పక్కరాష్ట్రంలో తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశం మొత్తాన్ని కలిచివేసింది. అత్యాచార నిందితులను తక్షణమైన శిక్షించాలని అందరూ కోరుకున్నారు. ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే కచ్చితంగా ఏదైనా జరిగితే, భయం ఉంటేనే ఆగుతాయని అనుకున్నారు. ఇదే రకమైన ఒత్తిడి తెలంగాణ ప్రభుత్వంపై వచ్చింది.

సినిమాల్లో అత్యాచారం చేసిన వారిని తుపాకితో కాల్చి చంపితే అంతా చప్పట్లు కొడుతారు. అదే పని చేసిన తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి మరోసారి సెల్యూట్‌ చేస్తున్నాను. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఎన్‌హెచ్‌ఆర్సీ, సుప్రీంకోర్టు విచారణలు చేపట్టాయి. సిట్‌ వేశారు. ఇవన్ని ఎందుకు? అత్యాచారం, హత్య తప్పు అయినా.. పోలీసులు చేసింది తప్పు అని చెబుతారా?  అదే జరిగితే బాధ్యత గల ఓ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు కూడా చూసి చూడనట్లు ఊరుకుంటారు. అప్పుడు దేశంలో అత్యాచారాలు పెరిగిఅరాచకాలు పెచ్చరిల్లుతాయి.  ఆ అనుభ‌వాల నుంచి రూపొందించిందే ఏపీ దిశ యాక్ట్‌. మ‌న ఇంటి ఆడ‌వారికే సమ‌స్య వ‌స్తే మ‌నం ఎలా బాధ ప‌డ‌తామో గుర్తించి ఈ చ‌ట్టాన్ని తీసుకొచ్చాం. బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగితేనే చ‌ట్టాల‌పై, న్యాయాల‌పై సామాన్యుల‌కు గౌర‌వం పెరుగుతుంది.  త్వ‌రిత‌గ‌తిన శిక్ష‌లు అమ‌లుకావాలి. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్ణ‌యం తీసుకునేలా ఈ దిశ యాక్టు రూపొందించాం. ఈ చ‌ట్టాలు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధికి సంబంధించేలా త‌యారు చేయ‌బ‌డింది. ఈ చ‌ట్టం రాష్ట్రప‌తి వ‌ద్ద‌కు ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీస్తుంది. అలాంట‌ప్పుడు స‌త్వ‌ర‌ న్యాయం జ‌రుగుతుంది. రెండు చ‌ట్టాల్లో ఒకదానిని రాష్ట్ర ప‌రిధిలోనే నిర్ణ‌యం తీసుకుని శిక్ష అమ‌లు చేస్తారు. మ‌రొక‌రి రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్తాం. 

ప్ర‌తి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం
13 జిల్లాల్లో ప్ర‌త్యేక‌మైన న్యాయ స్థానాల‌ను ఏర్పాటు చేస్తాం. ఇవి ప్ర‌తి రాష్ట్రాల్లో ఉన్నా.. ప్ర‌తి జిల్లాలో మాత్రం ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం మాత్రం మ‌న‌దే. మ‌హిళ‌ల మీద దాడులు, సోష‌ల్ మీడియాలో వేధింపులు, అత్యాచారాలు జ‌రిగితే ఈ కోర్టుల్లో త‌క్ష‌ణం శిక్ష‌లు అమ‌లు చేస్తారు. ఆయా కోర్టుల్లో ప్రత్యేకంగా న్యాయ‌వాదుల నియామ‌కాలు చేప‌డ‌తాం. నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా, స్ప‌ష్ట‌మైన ఆధారాలుంటే త‌క్ష‌ణ‌మే మ‌ర‌ణ‌శిక్ష విధించేలా చ‌ట్టం చేశాం. అందుకనుగుణంగా సెక్ష‌న్‌కు 376కి స‌వ‌ర‌ణ చేస్తున్నాం. జ‌డ్జిమెంట్ పీరియ‌డ్‌ను కూడా 21 రోజుల‌కు కుదిస్తున్నాం. విచార‌ణ 7 రోజుల్లో, ట్ర‌య‌ల్ 14 రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితుల‌కు శిక్ష విధించేలా చ‌ట్టాల‌కు మార్పు తీసుకొస్తున్నాం. క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర‌ల్ యాక్ట్ 173, 309కి మార్పులు చేస్తున్నాం. చిన్నారుల‌ మీద దాడులు, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డితే పాస్కో యాక్టు ప్ర‌కారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు ఉంది. ఇప్పుడు దానిని మార్చి జీవిత‌ఖైదు విధించేలా చ‌ట్టం చేయ‌బోతున్నాం. 

సోష‌ల్ మీడియాలో వేధిస్తే 2నుంచి నాలుగేళ్లు జైలు
సోష‌ల్ మీడియా కార‌ణంగా కూడా ఆడ‌వాళ్ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింది. దుర‌దృవ‌శాత్తు అలాంటివాటికి ఇప్ప‌టి వ‌రకు చ‌ట్టం లేదు. దానికీ ఇప్పుడు చ‌ట్టం చేస్తున్నాం. వారిని మొద‌టిసారి త‌ప్పుకు రెండేళ్ల జైలుకు, రెండోసారీ అదే నేరానికి పాల్ప‌డితే నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తాం. 354E అనే చ‌ట్టాన్ని తీసుకొస్తున్నాం. నిందితుల వివ‌రాలు అన్ని డిజిట‌లైజ్ చేయ‌బోతున్నాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement