దిశ ఉదంతంపై సీఎం జగన్‌ ఉద్వేగపూరిత ప్రసంగం | AP CM YS Jagan Emotional Speech in Assembly Over Disha Incident | Sakshi
Sakshi News home page

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: సీఎం జగన్‌

Published Mon, Dec 9 2019 2:59 PM | Last Updated on Mon, Dec 9 2019 8:08 PM

AP CM YS Jagan Emotional Speech in Assembly Over Disha Incident - Sakshi

సాక్షి, అమరావతి : మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ’లో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’  ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి  అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్‌, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ ‘మేం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలు నన్ను కలిచివేశాయి. దీన్ని మార్చాలనే తాపత్రయమే ఈ రోజు చట్టసభలో ఏం చేస్తే... మార్పులు తీసుకు రాగలుగుతామని ఆలోచనతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. హైదరాబాద్‌లో దిశ ఉదంతం తీసుకుంటే ఇది నిజంగా సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన. ఆ వైద్యురాలు టోల్‌గేట్‌ వద్ద ఉండగా బండికి పంక్చర్‌ చేసి, దాన్ని రిపేర్‌ చేయిస్తామని నమ్మించి అత్యాచారం చేసి, కాల్చేసిన ఘటన మన కళ్ల ముందే కనబడుతుంది. ఇలాంటి  దారుణాలపై పోలీసులు, రాజకీయ నాయకులు ఎలా స్పందించాలని ఆలోచన చేస్తే... నిజంగా బాధ అనిపించింది. 

ఇలాంటి సంఘటనే మన రాష్ట్రంలో జరిగితే..మనం ఎలా స్పందించాలి. ఆ యువతిపై దారుణానికి పాల్పడ్డవారిని కాల్చేసినా కూడా తప్పులేదని అందరూ అనుకున్నారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నాకు చెల్లెలు ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక తండ్రిగా ఎలా స్పందించాలి. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌, తెలంగాణ పోలీసులు.

జరగకూడని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. సినిమాలో అయితే హీరో ఎన్‌కౌంటర్‌ చేస్తే చప్పట్లు కొడతాం. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది. ఇదే నిజ జీవితంలో జరిగితే... జరిగింది తప్పు...ఇలా ఎందుకు చేశారని నిలదీస్తున్నారు. ఏదైనా జరిగితే బాధిత కుటుంబాలకు కావల్సింది వెంటనే ఉపశమనం. అలా తమకు సత్వర న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఎవరైనా కూడా చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని కాల్చేయాలని అనుకోరు. జరుగుతున్న జాప్యం చూసినప్పుడు... సంవత్సరాలు తరబడి కోర్టులు చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదనే బాధ వారిని కలిచివేస్తోంది. 

అందుకనే ఇవాళ చట్టాలు మారాలి. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్‌ హ్యాండెడ్‌గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు... దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు ఉన్నట్టుగా... కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచనలు చేయాలి. ఇలాంటి  ఆధారాలు దొరికినప్పుడు ఏం చేయాలన్నదానిపై ఆధారాలు చేయాలి. కొన్ని కొన్ని దేశాల్లో అయితే కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి.

సంఘటన జరిగిన వారం రోజుల్లోపు విచారణ పూర్తికావాలి, ఈలోపు డీఎన్‌ఎ రిపోర్టుల్లాంటివి పూర్తికావాలి, 2 వారాల్లోపు విచారణ పూర్తికావాలి, 3 వారాల్లోపు దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితిలోకి రావాలి. లేకపోతే ఎవ్వరికీ సంతృప్తి ఉండదు. చాలా వేగంగా కేసుల విచారణ పూర్తి కావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప .. వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది.  

సోషల్‌మీడియాను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పక్షపాత ధోరణితో వేరే వ్యక్తులమీద బుదరజల్లడానికి మనస్సాక్షి అనేది లేకుండా దిగజారిపోయారు. సోషల్‌ మీడియాలో మహిళలను రక్షించే ప్రయత్నంచేయాలి. మహిళల గురించి నెగెటివ్‌గా ఎవరైనా పోస్టింగ్‌ చేస్తే శిక్షపడుతుందనే భయం ఉండాలి. అది ఉంటే తప్ప ఇలాంటివి ఆగిపోవు. ఆదిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అడుగులు వేస్తున్నాం. 354 (ఇ)ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఇప్పటికే జీరో ఎఫ్‌ఐఆర్‌ను ఈ ప్రభుత్వంలో ఇదివరకే తీసుకు వచ్చాం. ఎక్కడైనా సరే కేసును నమోదుచేస్తున్నాం.

అసలు మనిషి ఎప్పుడు రాక్షసుడు అవుతాడు, తన ఇంగితాన్ని ఎప్పుడు కోల్పోతాడని ఆలోచిస్తే.. తాగితే ఈరకంగా తయారవుతాడు. అలాంటిది ఐదారుగురు మనుషులు కూర్చుని తాగితే మృగాలవుతారు. అందుకే పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ షాపులు రద్దు చేశాం.  గ్రామాల్లో 43వేల బెల్టుషాపులను రద్దుచేశామని గర్వంగా చెప్తున్నాం. స్మార్ట్‌ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావంచూపిస్తున్నాయి. ఎన్ని నిషేధాలు ఉన్నా దీన్ని కట్టడిచేయలేని పరిస్థితి. పోర్న్‌ సైట్లను బ్లాక్‌ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో మరో విప్లవాత్మక బిల్లును తీసుకువస్తాం.’ అని తెలిపారు.

ఇందు కోసం ప్రభుత్వం అందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు కోరుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం సలహాలు ఇవ్వడం తప్ప అన్ని విమర్శలు చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ రేటు పెరగటంతో పాటు, మహిళలపై అత్యాచారాలు, హత్యకేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని అన్నారు.  చంద్రబాబుగారిని సలహా ఇవ్వమని అడిగాం. కాని సలహా ఇవ్వడం తప్ప.. ఏ విధంగా విమర్శించాలో అన్ని విమర్శలూ చేశారు.ఉద్దేశాలు ఏమైనా... కూడా వాస్తవాల్లోకి మనం పోవాల్సి ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement