మధ్య వేలు చూపిస్తే మహా పాపమా?
మధ్య వేలు చూపిస్తే మహా పాపమా?
Published Thu, Sep 21 2017 11:17 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM
సాక్షి, దుబాయ్: ఎదుటివారిని అవహేళన చేస్తూ మధ్య వేలును చూపించటమనేది పాశ్చాత్య దేశాల్లో కనిపించేదే. బండ బూతే అయినప్పటికీ ఆ సైగను అక్కడి ప్రజలు అంతగా పట్టించుకోరు కూడా. కానీ, సంప్రదాయలను కఠినంగా ఫాలో అయ్యే ఇస్లాం దేశాల్లో అది తీవ్ర నేరమే. ఆ పని చేశాడనే ఓ బ్రిటీష్ టూరిస్ట్‌కు ఆరు నెలల కఠినకారాగార శిక్ష విధించారు.
23 ఏళ్ల జమీల్ ముక్దుమ్ లెయిసెస్టర్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాని. ఈ ఫిబ్రవరిలో తన భార్యతో కలిసి దుబాయ్ పర్యటనకు వచ్చాడు. ఆ సందర్భంలో రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి మోటర్ బైక్‌పై జమీల్ కారు పక్కగా దూసుకెళ్లాడు. దీంతో ముక్దుమ్ అతనికి మధ్య వేలు సైగ చేశాడు.
అయితే దానిపై సదరు మోటర్ బైకిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటికే ముక్దుప్ దేశం విడిచి వెళ్లిపోయాడు. తిరిగి గత వారం మళ్లీ దుబాయ్‌కి రాగా, ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అతన్ని జైలుకు పంపించారు. చివరకు బెయిల్ పై రిలీజ్ అయిన ముక్దుమ్ ఘటనపై స్పందించాడు. ‘నేనేం మహా పాపం చేయలేదు. ఇలాంటివి తరచూ ఇంగ్లాండ్ రోడ్లపై కనిపిస్తుంటాయి. ఆ మాత్రానికే జైలుకు పంపుతారా?’ అంటూ ముక్దుమ్ ప్రశ్నిస్తున్నాడు. పైగా రేపిస్టులు, మర్డర్ చేసిన వారి సెల్‌లో తనను ఉంచారని అతను వాపోయాడు.
ట్రాఫిక్ ప్రయాణాల్లో ప్రయాణికులు విసుగు చెంది ఇలా వ్యవహరించటం సాధారణమే అయినా.. దుబాయ్ చట్టప్రకారం అలా అవమానించటం తీవ్ర నేరమేనని ముక్దుమ్ తరపున న్యాయవాది తెలిపారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జోసెఫ్ అనే యూకే వైద్యుడిని కూడా ఇలాంటి అసభ్య సైగ చేశాడన్న కారణంతోనే పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. కాగా, దుబాయ్ చట్టాలను ఉల్లంఘిస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో అలికెంట్ వాసులు(655) ప్రథమ స్థానంలోఉండగా, 524 మంది బ్రిటన్ వాసులు రెండో స్థానంలో ఉన్నారని దుబాయ్ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
Advertisement