మహిళల రక్షణలో 'దిశ' మారదు | A System For Online Registration Of Complaints On Assaults On Women And Children | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణలో 'దిశ' మారదు

Published Sun, Dec 6 2020 3:36 AM | Last Updated on Sun, Dec 6 2020 3:36 AM

A System For Online Registration Of Complaints On Assaults On Women And Children - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలకు రక్షణ కవచంలా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌లో దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్‌ 13న అసెంబ్లీలో, డిసెంబర్‌ 16న మండలిలో దిశ బిల్లును ఆమోదించి 2020 జనవరి 2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ బిల్లుపై కేంద్రం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చేందుకు రాజీలేని వైఖరితో ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం–2019 (పాత బిల్లు)ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2020 (కొత్త బిల్లు)ని శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, బాలలపై జరిగే నేరాలపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు)చట్టం–2020కి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. అసెంబ్లీ, మండలి ఆమోద ప్రక్రియ పూర్తి కావడంతో ఈ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2) ప్రకారం గవర్నర్‌ పరిశీలన అనంతరం వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.  

ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు
► దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ కచ్చితంగా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడానికి ముందు నుంచే ఏపీలో ఈ విధానం అమల్లో ఉండటం విశేషం. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. 
► రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్‌ స్టేషన్లలో 18 కస్టమైజ్డ్‌ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లోని ప్రత్యేక పరికరాలతో సాంకేతిక సిబ్బంది నేర స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.
► ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సత్వర సహాయం అందించేలా ఆవిష్కరించిన దిశ యాప్‌ను ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98,380 మంది ఎస్‌ఓఎస్‌ ద్వారా పోలీసుల సహాయం కోరారు. 
► దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7 రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడింది.
► దిశ కేసుల దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 
► రాష్ట్రంలో 11 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 700 పోలీస్‌స్టేషన్లలో ఉమెన్‌ స్పెషల్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. దిశ బిల్లులో ప్రస్తావించిన అనేక విషయాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు వచ్చాయి.   

దిశ బిల్లులో ప్రధానాంశాలు..
► మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం–2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌  కోడ్‌(ఐపీసీ)–1860, క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)–1973లను ఉపయోగిస్తారు.   
► ఐపీసీ సెక్షన్‌ 326ఎ, 326బి, 354, 354ఎ, 354బి, 354సి, 354డి, 376, 376ఎ, 376బి, 376ఎబి, 376సి, 376డి, 376డిఎ, 376డిబి,376ఈ, 509లతో పాటు పోక్సో యాక్ట్, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు. 
► 18 ఏళ్ల లోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ – పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది.
► జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. 
► కేసుల నమోదుకు ఆన్‌లైన్‌ విధానం అమలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారి వివరాలు అపరాధుల రిజిష్టర్‌ (ఆన్‌లైన్‌ విధానం)లో నమోదు చేస్తారు. 
► వేగంగా దర్యాప్తు పూర్తి చేసేలా ప్రతి జిల్లా స్థాయిలో ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
► బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా, దోషులకు వేగంగా శిక్షలు అమలు చేసేలా ఈ కేసుల కోసం ప్రతి జిల్లాలో ఒకటి, అంతకంటే ఎక్కువగా ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటిలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ను కూడా నియమించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement