స్పై కెమెరాల ద్వారా జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఐదేళ్ల క్రితం ముందుకు వచ్చారు హైదరాబాద్ వాసి వరలక్ష్మి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ ‘అమ్మాయిలూ జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతూ వచ్చారు. ‘‘ఈ క్రమంలోనే జనంలోకి వెళుతున్నకొద్దీ మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, హింస.. ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. విషయాలు తెలుస్తున్నకొద్దీ నేరాలకు అడ్డుకట్ట వేయలేమా.. అనే ఆలోచన ఎక్కువైంది’’ అంటారు వరలక్ష్మి. ఆ దిశగానే మహిళల రక్షణ విషయంలో అనేక కోణాల్లో పరిశీలించి ‘వాయిస్ ఆఫ్ భారత్’ ను తీసుకొచ్చాను అని వివరించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం చట్టాలు కఠినతరం చేయాలంటూ నినదించే వరలక్ష్మి ‘సాక్షితో పంచుకున్న విషయాలు...
‘‘మహిళల రక్షణపై దాదాపు వందమంది సెలబ్రిటీలు, స్త్రీ, పురుషుల వాయిస్‌ను 45 రోజులు పాటు వీడియో రూపంలో రికార్డు చేశాను. వారందరూ మాట్లాడిన విషయాలో ముఖ్యమైన పాయింట్స్‌ను క్రోడీకరించారు. అడ్వకేట్ అభిప్రాయాన్ని కూడా తీసుకొని 24 ముఖ్యమైన పాయింట్ల జాబితాను తీసుకొచ్చాను. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అధికారులను సంప్రదించి, ఆ జాబితాను అమలు పరిచాలని కోరుతున్నాను. రోజు రోజుకూ నేరాలుపెరుగుతున్న నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక ఎజెండా ఇది.
2017లో ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో జనంలోకి వెళ్లినప్పుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగస్టు 15, 2020 నుంచి పబ్లిక్ నుంచి వాయిస్ తీసుకోవడం మొదలుపెట్టాను. తెలంగాణ, ఆంధ్రాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి కూడా వాయిస్ తీసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిరోధించడానికే నా ప్రయత్నం అంతా. దీంట్లో భాగంగానే మహిళలకు శిక్షణా తరగతులు, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్, బాలకార్మికులకు సంబంధించినవి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అవగాహన, ఆరోగ్య శిబిరాలు.. ఇవన్నీ ఒక దగ్గర చేర్చడానికి ‘హెవెన్ హోమ్ సొసైటీ’ పేరుతో ఎన్జీవోను ఏర్పాటు చేశాను.
సీసీ కెమెరాలు, పుటేజీ
‘వాయిస్ ఆఫ్ భారత్’లో భాగంగా గ్రామణస్థాయి నుంచి నా కార్యాచరణను మొదలుపెట్టాను. అప్పుడే పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది అర్ధమైంది. ఏదైనా నేరం జరిగిన వార్త తెలిసినప్పుడు ‘అయ్యో’ అనేసి ఊరుకుంటున్నాం. కానీ, చాలా వరకు గురుకులాలు, కార్యాలయాలు, పాఠశాలల్లో... సీసీ కెమెరాల ఏర్పాటు, వాటికి సంబంధించిన పుటేజీ రికార్డులో ఉండటం అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఎక్కడా రికార్డు కాకపోవడంతో నేరాలు కూడా వెలుగు చూడటం లేదు. నేరస్థులు నిర్భయంగా బయట తిరుగుతున్నారు.
మిస్సింగ్ అయిన కథనాలెన్నో..
లాక్‌డౌన్ తర్వాత వరుస చిన్నారులు మిస్సింగ్ కథనాలు ఎక్కువగా వినవస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ దమ్మాయిగూడలో నలుగురు పిల్లలు మిస్సింగ్ న్యూస్ ప్రధానమైంది. అందులో ఒక చిన్నారిని అత్యంత దారుణంగా రేప్ చేసి, చంపారు. మరో రెండు కేసులు వెలుగులోకే రాలేదు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట రావాలంటే అన్నిచోట్లా సిసి కెమెరాల ఏర్పాట్లు పెంచాలి. సెక్షన్లు త్వరగా అమల్లో పెట్టాలి. పార్టీలతో సంబంధంలో లేకుండా మహిళల రక్షణకు సంబంధించిన విషయాలన్నీ వారి ఎజెండాలో పెట్టాలి. ప్రతి మహిళా ఆలోచించాల్సిన తరుణం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలు, మహిళల భద్రత విషయాల పట్ల వెంటనే స్పందించి, అమలులో పెట్టాలి. అఘాయిత్యాలు చోటు చేసుకున్నాక కాదు రక్షణ గురించి ఆలోచించడం కాదు, ముందే బతికుండటానికి రక్షణ కావాలన్నదే ‘వాయిస్ ఆఫ్ భారత్’ నినాదం.
మహమ్మారి టైమ్
కరోనా టైమ్‌లో బయట తిరిగే వారి సంఖ్య తగ్గింది, క్రైమ్ తగ్గింది అనుకుంటున్నారు. నిజానికి పరిస్థితి అలా లేదు. దీనికి సంబంధించిన డేటా కోసం అన్ని పోలీసు విభాగాల్లోనూ వివరాలను సేకరించాను. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం ఐదు కేసులు ఫైల్ అవుతున్నాయి. గృహహింస అయితే మరీ దారుణం. కరోనా కారణంగా ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడంలో మునిగిపోయి ఈ తరహా క్రైమ్ వినడానికి, చెప్పుకోవడానికి ఎవరూ పట్టించుకోవడం లేదు.
మూడో కంటితో చూడొద్దు... యాంటీ రెడ్ ఐ
షాపింగ్ మాల్స్, కాంప్లెక్సులు, హోటల్ గదులు, అద్దె ఇల్లు.. ఇలా ప్రతి చోట అమ్మాయిలు, మహిళలను స్పై కామ్ ద్వారా నగ్న వీడియోలు, ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసే నేరగాళ్లు పెరిగారు. దీనివల్ల జరిగే అనర్థాలకు అడ్డుకట్టవేసే ఉద్దేశంతోనే మూడో కన్నుతో చూడొద్దు అని ‘యాంటీ రెడ్ ఐ’ ఏర్పాటు చేశాను. దాదాపు ఐదేళ్లుగా ఈ స్పై కెమరా నేరాలకు సంబంధించి వర్క్ చేస్తున్నాను.
ఎంతోమంది సాయంగా!
మహిళల భద్రతకు సంబంధించిన ‘యాప్’ ను తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ, మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను ప్రింట్ చేస్తూ వాటిని అధికారులకు అందజేస్తూ వస్తున్నాను. వేధింపులు, అఘాయిత్యాలకు గురైన బాధితులకు సాయం చేయమంటూ వేడుకోళ్లు వస్తూనే ఉంటాయి. దానికి తగినట్టుగానే అడ్డుకోవడానికి ‘చంపేస్తాం’ అంటూ ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఇలాంటప్పుడు కుటుంబం శ్రేయస్సు గురించి ఆలోచించి, విడిగా ఉంటూ ఈ పనులు చూస్తున్నాను. ఈ సంస్థ ముందుకెళ్లడానికి నా స్నేహితుల సాయమే నాకు కొండంత అండగా నిలుస్తోంది’’ అని వివరించారు వరలక్ష్మి.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: రాజేష్ రెడ్డి నోముల
‘స్పై’ కెమెరాలపై ‘స్పై’..మూడో కన్నుతో చూడొద్దు!
Published Sun, Jul 18 2021 5:09 AM | Last Updated on Sun, Jul 18 2021 2:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment