ఇదీ.. నా కల | CM YS Jagan Mohan Reddy Comments at inauguration of Disha Police Station | Sakshi
Sakshi News home page

ఇదీ.. నా కల

Published Tue, Feb 25 2020 4:19 AM | Last Updated on Tue, Feb 25 2020 8:57 AM

CM YS Jagan Mohan Reddy Comments at inauguration of Disha Police Station - Sakshi

దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు

ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పనిలేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నాం.. అలాగే అక్రమాలపై మహిళా సంరక్షణ పోలీస్‌ రిపోర్ట్‌ ఇచ్చాక దానిపై యాక్షన్‌ తీసుకోవడం ముఖ్యం. అప్పుడే ఊళ్లో మార్పు కనిపిస్తుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘గ్రామం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో ఒక్కసారి ఊహిస్తే.. అది మన కళ్లముందు కనిపిస్తుంది. 72 గంటల్లో సేవలందించేలా గ్రామ సచివాలయం, స్కూలు, ఆసుపత్రి, రైతు భరోసా కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, ఓ మహిళా సంరక్షణ పోలీసు.. ఇలా అన్నీ వరుసగా కనిపిస్తాయి. ఇది కేవలం ఊహగానే మిగిలి పోకుండా మన కళ్లెదుట సాక్షాత్కరింప చేయడానికి మన ప్రభుత్వం నడుం బిగించింది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విజయనగరంలోని పోలీస్‌ బ్యారెక్స్‌లో సోమవారం ఆయన దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన తన కలల గ్రామాన్ని నిజం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పని లేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏం చెప్పారంటే..

ఎనిమిది నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు
‘పోలీస్‌ అంటే ఊర్లో కొద్దో గొప్పో భయం ఉంటుంది. అందుకే గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి పేరును ‘మహిళ సంరక్షణ పోలీస్‌’గా మారుద్దామని డీజీపీకి చెప్పాను. ఈ పేరు అయితే బావుంటుంది. గ్రామ, వార్డు పరిధిలో మహిళ సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్‌ మిత్రలు, పోలీస్‌ చెల్లెమ్మల భుజస్కందాలపై ఉన్న బాధ్యతను గుర్తు చేయాల్సిన పరిస్థితి. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో.. అలా మార్చేందుకు మన ప్రభుత్వం గత 8 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో గ్రామం అన్నది ఏలా ఉంటుందంటే.. ప్రతి 2 వేల జనాభాకు కావాల్సిన ప్రతి సేవ అందుబాటులో ఉండేట్టు గ్రామ సచివాలయం ఉంటుంది. అన్ని సేవలూ అక్కడే లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రతీ సేవ నిర్ణీత గడువులోగా అందేలా చూస్తున్నాం.
దిశ పోలీస్‌ స్టేషన్‌ బయట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ గ్రూప్‌ ఫొటో 

గ్రామ సచివాలయం పక్కనే మెరుగైన వసతులతో ఒక ఇంగ్లిష్‌ మీడియం స్కూలు కనిపిస్తుంది. అదే గ్రామంలో ఒక అడుగు ముందుకు వేస్తే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ అనే ఒక ఆసుపత్రి కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు 2,400 సబ్‌ సెంటర్స్‌ కూడా లేవు. రానున్న రోజుల్లో మొత్తం 11,158 గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ తీసుకొస్తాం. అక్కడ డీఎస్సీ చదివిన నర్సు, ఒక ఏఎన్‌ఎం ఉంటారు. వారు అదే ఊళ్లో ఉంటూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తారు. గ్రామ సచివాలయం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం ఉంటుంది. అన్ని విషయాల్లో రైతులకు తోడుగా ఉంటుంది. ఈ క్రాప్‌ బుకింగ్, పంటలు, వాతావరణం, గిట్టుబాటు ధర, మార్కెట్‌కు సంబంధించిన సూచనలు ఇస్తారు. శిక్షణ కూడా ఉంటుంది. నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్,విత్తనాలు అందుబాటులో ఉంటాయి.  

మహిళా సంరక్షణ పోలీస్‌ది కీలక పాత్ర
మహిళా సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్‌ మిత్రాలు చురుగ్గా ఉండాలి. మీ గ్రామంలో ఎవరైనా, ఎక్కడైనా  ఇల్లీగల్‌ లిక్కర్‌ అమ్ముతున్నారంటే వాళ్లకు సింహస్వప్నం కావాలి. మీరు ఒక్క మెసేజ్‌ కొడితే ఎస్పీ అలర్ట్‌ అవుతారు. పోలీసులను పంపించి క్లీన్‌ చేసేస్తారు. గ్రామంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నా వెంటనే మీరు అలర్ట్‌ అయ్యి రిపోర్టు చేయాలి. మీరు చేసిన రిపోర్టు మీద ఎటువంటి యాక్షన్‌ తీసుకున్నారో పరిశీలించి రోబోయే రోజుల్లో డైరెక్ట్‌గా డీజీపీ, హోంమినిస్టర్, నేను కూడ ఇన్వాల్వ్‌ అవుతాం. ఎందుకంటే మీరు రిపోర్ట్‌ ఇచ్చాక దానిపై యాక్షన్‌ తీసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్‌.

అప్పుడే ఊర్లో మార్పు కనిపిస్తుంది. అంగన్‌వాడీ సెంటర్లు మీ అధీనంలో ఉంటాయి. గ్రామంలో ఉన్న స్కూళ్లు, ఆ స్కూళ్ల వ్యవహారాలు, ఆస్కూల్లో బూత్‌రూంలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత.. ఇలా అన్నీ కూడా గ్రామ సెక్రటేరియట్‌ పరిధిలోకి తీసుకొస్తున్నాం. వీటి పర్యవేక్షణలో మీరు భాగస్వాములవుతున్నారు. మీ అందరికీ ఒక అన్నలా బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నా. మీ వల్ల గ్రామానికి మంచి జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నా’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement